జట్టు ఓడిపోవడం కోహ్లీకి అస్సలు నచ్చదు: వెంకటేశ్ అయ్యర్
ABN , Publish Date - Jun 02 , 2026 | 08:57 AM
ఆర్సీబీ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్ మొత్తం కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడమే కాకుండా.. ఆఖరిలో విరాట్‌తో ఓపెనింగ్ కూడా చేశాడు. అయితే టైటిల్ విజయానంతరం వెంకటేశ్ అయ్యర్.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 ట్రోఫీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సగర్వంగా ముద్దాడింది. 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత 2025లో తొలి కప్పును అందుకున్న ఆర్సీబీ.. ఈ ఏడాది కూడా అదే జోరును కొనసాగించి రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 75 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆర్సీబీ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్ ఈ సీజన్ మొత్తం కోహ్లీతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడమే కాకుండా.. ఆఖరిలో విరాట్‌తో ఓపెనింగ్ కూడా చేశాడు. అయితే టైటిల్ విజయానంతరం వెంకటేశ్ అయ్యర్.. కోహ్లీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘విరాట్ తన జట్టు ఓడిపోవడాన్ని అస్సలు చూడాలనుకోడు. అదే భావన మిగతా ఆటగాళ్లలోనూ ఉత్సాహాన్ని నింపుతుంది. కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. నేటికీ అదే స్థాయిలో ఉత్సాహం, కసితో బ్యాటింగ్ చేస్తాడు. విరాట్ కోహ్లీతో కలిసి మైదానంలో ఉన్నప్పుడు ఇతర ప్లేయర్లు భుజాలు వాల్చుకుని తిరగలేరు. నెమ్మదిగా నడవలేరు. నిర్లక్ష్యంగా ఉండలేరు. అలాంటి ఆటగాడు పక్కన ఉంటే ఏ ప్లేయర్ మాత్రం నిర్లక్ష్యంగా ఉండగలడు? కోహ్లీ క్రీజులో ఉంటే ప్రత్యర్థి జట్టుపై మానసిక ఒత్తిడి సహజంగానే ఉంటుంది’ అని వెంకటేశ్ అయ్యర్ వెల్లడించాడు.
ఓ పద్ధతితో..
‘కోహ్లీ విజయానికి టాలెంట్ మాత్రమే కారణం కాదు. దాని వెనుక కఠోర శ్రమ, క్రమశిక్షణ, స్పష్టమైన ప్రణాళిక ఉంటాయి. అతడి ప్రాక్టీస్‌కు ఒక పద్ధతి ఉంటుంది. ఎప్పుడూ అత్యంత జోష్‌తో కనిపిస్తాడు. కోహ్లీని చూస్తుంటే ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవచ్చని అనిపిస్తుంది. కేవలం భారీ షాట్లు ఆడటమే కాదు.. బౌలర్ ఏమి చేయబోతున్నాడో కూడా ముందే అర్థం చేసుకోవడం విరాట్ ప్రత్యేకత. నాకు కోహ్లీని చూసిన ప్రతిసారీ ఓ మోటివేషన్ వస్తుంది. మనం ఏం చేయాలనుకుంటున్నామో దానిపై ఓ స్పష్టత ఉండాలి. స్పష్టత ఉంటే సగం పని పూర్తి అయినట్లే’ అని వెంకటేశ్ అయ్యర్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
కోల్‌కతాలో మెస్సి విగ్రహం తొలగింపు.. ఎందుకంటే?
ఆర్సీబీ హిట్టర్ టిమ్ డేవిడ్‌పై సస్పెన్షన్ వేటు