మరో 9 రోజుల్లో... వచ్చేస్తోంది సాకర్ సమరం
ABN , Publish Date - Jun 02 , 2026 | 03:16 AM
ఖండాలన్నీ కదంతొక్కే సమరం.. ఊహకందని విన్యాసాలు.. లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు.. అవధుల్లేని ఆనందాలు.. అంతులేని నిర్వేదాలు.. ఇలా భూగోళం మొత్తాన్ని ‘బంతి’లా...
39 రోజులు
48 జట్లు
104 మ్యాచ్‌లు
ఖండాలన్నీ కదంతొక్కే సమరం.. ఊహకందని విన్యాసాలు.. లిప్తపాటులో తలకిందులయ్యే ఫలితాలు.. అవధుల్లేని ఆనందాలు.. అంతులేని నిర్వేదాలు.. ఇలా భూగోళం మొత్తాన్ని ‘బంతి’లా ఆడేసే.. టోర్నీలకెల్లా బంపర్ టోర్నీ.. సాకర్ సమరానికి వేళైంది. యావ త్ ప్రపంచానికి ఫుట్‌బాల్ ఫీవర్ ఎక్కించే మాస్ మహా జాతర ‘ఫిఫా వరల్డ్‌కప్’నకు మరో 9 రోజుల్లో తెరలేవనుంది. 39 రోజులపాటు.. సాకర్ కిక్కుతో.. చిందులు తొక్కించనుంది.
నాలుగేళ్లకొకసారి ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూగించే సాకర్ సంరంభానికి ఈసారి అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 23వ ఫిఫా వరల్డ్‌క్‌ప ఈ నెల 11న ఆరంభం కానుండగా.. వచ్చే నెల 19న న్యూయార్క్‌లో జరిగే మెగా ఫైనల్‌తో ముగియనుంది. డిఫెండింగ్ చాంప్‌గా అర్జెంటీనా బరిలోకి దిగనుంది.
జంబో టోర్నీ
ఇప్పటి వరకు జరిగిన ఈవెంట్లు ఒక లెక్క కాగా.. ఇప్పుడు జరగబోయేది అంతకు మించి అన్నట్టుగా సాగనుంది. 39 రోజులపాటు టోర్నీ సాగనుండగా.. 104 మ్యాచ్‌లకు 16 నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. బరిలోకి దిగే జట్ల సంఖ్యను 32 నుంచి 48కి పెంచారు. ఆయా జట్లను నాలుగేసి చొప్పున 12 గ్రూప్‌లుగా వర్గీకరించారు. ప్రతి గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లతోపాటు మూడో స్థానంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన మరో 8 జట్లను నాకౌట్ రౌండ్-32కు ఎంపిక చేయనున్నారు. మొత్తంగా కలల కప్‌ను సొంతం చేసుకోవాలంటే ఆయా జట్లు 8 మ్యాచ్‌లు నెగ్గాల్సి ఉంటుంది.
ఐరోపాలోనే ఎక్కువగా..
ఇప్పటి వరకు జరిగిన 22 ప్రపంచ కప్‌ల్లో.. 11సార్లు ఐరోపా దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి. ఆసియాలో తొలిసారి 2002లో జపాన్, కొరియాలు సంయుక్తంగా నిర్వహించాయి. 2010లో ఆఫ్రికా ఖండానికి మొదటిసారి వరల్డ్‌కప్ నిర్వహణ హక్కులు దక్కాయి. 2022 వరల్డ్‌క్‌పనకు పశ్చిమాసియా దేశమైన ఖతార్ వేదికైంది.
మెక్సికో అరుదైన రికార్డు..
మూడోసారి వరల్డ్‌క్‌పనకు ఆతిథ్యం ఇస్తున్న దేశంగా మెక్సికో అరుదైన రికార్డును సొంతం చేసుకోనుంది. 1970, 1986లో రెండుసార్లు మెక్సికో సాకర్ కప్‌ను నిర్వహించింది. ఇప్పుడు అమెరికా, కెనడాతో కలసి మూడోసారి టోర్నీ జరపనుంది. అంతేకాకుండా మూడు దేశాలు సంయుక్తంగా వరల్డ్‌కప్‌ను నిర్వహించడం కూడా టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి. బ్రెజిల్‌పాటు ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీలు రెండేసిసార్లు వరల్డ్‌క్‌పనకు ఆతిథ్యం ఇచ్చాయి.
బ్రెజిల్ ఐదుసార్లు..
సాకర్ వరల్డ్‌క్‌పను బ్రెజిల్ అత్యధికంగా ఐదుసార్లు సొంతం చేసుకోగా.. జర్మనీ, ఇటలీలు నాలుగేసి సార్లు దక్కించుకున్నాయి. అర్జెంటీనా మూడుసార్లు.. ఫ్రాన్స్, ఉరుగ్వే రెండేసి సార్లు సొంతం చేసుకొన్నాయి. ఇంగ్లండ్, స్పెయిన్ చెరోసారి మెగా కప్‌ను ముద్దాడాయి.
వరల్డ్‌కప్ చరిత్ర
సాకర్‌ను తొలిసారి 1900 ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టగా.. 1904లో ఫిఫా ఏర్పడింది. ‘వరల్డ్‌కప్ పితామహుడు’గా చెప్పుకొనే ఫిఫా మాజీ అధ్యక్షుడు జూలెస్ రిమెట్.. 1920 విశ్వక్రీడల్లో సాకర్ కప్ ప్రతిపాదన చేశాడు. 1930లో తొలి ఫిఫా వరల్డ్‌క్‌పను 13 జట్లతో ఉరుగ్వేలో నిర్వహించారు. ఆతిథ్య దేశమైన ఉరుగ్వే 4-2తో అర్జెంటీనాను ఓడించి ఆరంభ టైటిల్‌ను సొంతం చేసుకొంది. ఆ తర్వాతి 1934లో ఇటలీ, 1938లో ఫ్రాన్స్ నిర్వహించాయి. 1942 మెగా కప్‌ను హిట్లర్ ఆధ్వర్యంలో జర్మనీలో జరపాలనుకొన్నా.. ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు చేశారు. 1946లో కూడా వరల్డ్‌వార్ కారణంగా ఆగింది. ఇక, 1950 నుంచి ప్రతి నాలుగేళ్ల కొకసారి నిర్వహిస్తూనే వస్తున్నారు. భవిష్యత్‌లో 2030 వరల్డ్‌క్‌పను మొరాకో, స్పెయిన్, పోర్చుగల్ సంయుక్తంగా జరపగనుండగా.. 2034 మెగా టోర్నీ హక్కులను సౌదీ అరేబియా దక్కించుకొంది.
ఇవి కూడా చదవండి...
ఆవులపై ద్వంద్వ ప్రమాణాలు మానండి.. యోగి స్ట్రాంగ్ కౌంటర్
చిక్కుల్లో ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం..! ఎమ్మెల్యేలతో 3న అత్యవసర సమావేశం