లక్ష మందిలో ఒకరికి వచ్చే ఆ వ్యాధికి...
ABN , Publish Date - Jan 23 , 2026 | 12:53 PM
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స నిర్వహించి ఒకరి ప్రాణాలు కాపాడారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే ఈ వ్యాధికి వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అరుదైన వ్యాధికి కర్నూలు వైద్యుల శస్త్ర చికిత్స
రోగి ప్రాణాన్ని కాపాడిన జీజీహెచ్ వైద్యులు
కర్నూలు: సదరం(Sadaram) సర్టిఫికెట్ కోసం వచ్చిన రోగికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల వైద్యులు శస్త్రచికిత్స చేసి ప్రాణాలను కాపాడారు. అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం హెచ్.సిద్దాపురం గ్రామానికి చెందిన తులసి టైలర్. ఆమె ఆరేళ్ల నుంచి ఒళ్లు, కండరాల నొప్పులతో బాధపడుతూ మంచానికే పరిమితమయ్యారు. సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి పరీక్షల కోసం పంపించారు. ఆదోని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు రోగికి పరీక్షలు నిర్వహించారు. రక్తంలో ఫాస్ఫేట్ తక్కువగా ఉన్నట్లు గుర్తించి, కర్నూలు జీజీహెచ్ ఎండో క్రైనాలజీ హెచ్‌వోడీ డాక్టర్ పి.శ్రీనివాసులుకు రెఫర్ చేశారు.
ఆ విభాగంలో అక్టోబరు 5న ఆమె అడ్మిషన్ పొందారు. చిన్న వయస్సులో ఫాస్ఫేట్ స్థాయి తగ్గడం వల్ల ఆమె నడవలేని పరిస్థితి ఉన్నట్లు గుర్తించారు. ట్యూమర్ ఇండ్యూ్‌సడ్ ఆస్టియో మలేసియా అనే అరుదైన వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ప్రైవేటు స్కాన్‌లో వెన్నుపూస దగ్గర ప్రీసాక్రల్ ప్రాంతంలో క్యాన్సర్ కణతిని గుర్తించారు. గత ఏడాది నవంబరు 10న ఎండోక్రైనాలజీ హెచ్‌వోడీ డాక్టర్ పి.శ్రీనివాసులు, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధారాణి, సర్జికల్ అంకాలజిస్టులు డాక్టర్ చైతన్యవాణి, డాక్టర్ బీసన్న, మత్తుమందు వైద్యులు డాక్టర్ భార్గవి మల్టీ డీసిప్లినరీ విధానంలో శస్త్ర చికిత్స చేశారు. కంటికి కనబడని ఒక సెం.మీ. కణితిని తొలగించారు. వారం తర్వాత రోగి నడవగలిగారు.

లక్ష మందిలో ఒకరికి..
కోలుకున్న మహిళతో కలిసి గురువారం కర్నూలు జీజీహెచ్ సూపరింటెండెంట్ చాంబర్‌లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. లక్ష మందిలో ఒకరికి వచ్చే ట్యూమర్ ఇండ్యూస్డ్ ఆస్టియో మలేసియా వ్యాధిని గుర్తించి శస్త్ర చికిత్స అందించామని తెలిపారు. రోగికి ఫాస్ఫేట్ తక్కువగా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి మూలాలను గుర్తించి, శస్త్ర చికిత్స అందించిన ఎండో క్రైనాలజీ, సర్జికల్ అంకాలజి వైద్యులను హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అభినందించారు. జబ్బు నయం కాదని మంచానికి పరిమితమైన తనకు వైద్యులు ప్రాణదానం చేశారని తులసి ధన్యవాదాలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి.
హమ్మయ్య! పసిడి, వెండి ధరలు తగ్గాయోచ్!
Read Latest Telangana News and National News