ఐబీఎస్ అంటే ఏంటి? తినకూడని, తినాల్సిన ఆహారాలు ఇవే..
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:10 PM
శరీరంలో ఎంతో అసౌకర్యాన్ని కలిగించే సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. ఐబీఎస్ అనేది పెద్దప్రేగుకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక వ్యాధి. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: శరీరంలో ఎంతో అసౌకర్యాన్ని కలిగించే సమస్య ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(IBS). ఐబీఎస్ అనేది పెద్దపేగుకు సంబంధించిన ఓ దీర్ఘకాలిక వ్యాధి. ఈ వ్యాధిబారిన పడితే కడుపునొప్పి, పొత్తికడుపు తిమ్మిరి, కడుపుబ్బరం, విరేచనాలు, గ్యాస్, మలబద్ధకం సమస్యలు వంటివి తరచూ వేధిస్తుంటాయి. జీర్ణక్రియ ప్రక్రియలో ఏవైనా సమస్యలు తలెత్తితే ఐబీఎస్ బారినపడినట్లు అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వారు ఆహారం విషయంలో, ముఖ్యంగా పిండి పదార్థాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఐబీఎస్ ముఖ్య లక్షణాలు:
ఐబీఎస్ ఉన్నవారిలో కడుపునొప్పి సర్వసాధారణం. మల విసర్జన తర్వాత ఈ నొప్పి తగ్గుతుంది. ఈ సమస్య ఉన్నవారిలో పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తరుచూ విరేచనాలు కావడం, మల విసర్జన కష్టంగా మారడం జరుగుతుంది. కొన్నిసార్లు అతిసారం కలిగించే బాక్టీరియా కడుపుపై మరింత ప్రాణాంతక దాడిచేస్తుంది. ఎక్కువ ఒత్తిడి తీసుకునే వాళ్లు ఈ వ్యాధి బారినపడుతుంటారు.
తీసుకోవాల్సిన ఆహారం:
1.ఆకుపచ్చ కివీ పండులో యాక్టినిడిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్లు జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్య తగ్గించడానికి తోడ్పడుతుంది.
2. పిప్పరమింట్ ఆయిల్ పేగుల్లోని కండరాలను రిలాక్స్ చేస్తుంది. ఐబీఎస్ వల్ల వచ్చే కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో ఇది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
3. హైడ్రోలైజ్డ్ గ్వార్ గమ్ అనేది గ్వార్ బీన్స్ నుంచి తయారైన, నీటిలో సులభంగా కరిగే, సహజ సిద్ధమైన డైటరీ ఫైబర్. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి, మల విసర్జన సాఫీగా జరగడానికి ఇది సహాయపడుతుంది.
4. ఓట్స్‌లో బీటా-గ్లూకాన్ అనే కరిగే పీచు ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెత్తబరుస్తుంది. ఐబీఎస్ ఉన్నవారికి గోధుమల కంటే ఓట్స్ తీసుకోవడం సురక్షితం.
5. ఐబీఎస్ ఉన్నవారికి పచ్చి అరటి పిండి చాలా మంచిది. ఇందులో అధిక మొత్తంలో రెసిస్టెంట్ స్టార్చ్ ఉండటం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ఇది గ్లూటెన్ - రహిత ప్రత్యామ్నాయం, కాబట్టి గోధుమలకు బదులుగా డైట్‌లో వాడొచ్చు. దీనివల్ల జీర్ణకోశ ఆరోగ్యం మెరుగుపడుతుంది.
తినకూడని ఆహారం:
1. కాలిఫ్లవర్, క్యాబేజీ, బ్రోకలి, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటివి గ్యాస్ కలిగించే ఆహార పదార్థాలు. ఇవి ఐబీఎస్ లక్షణాలను ఎక్కువగా ప్రేరేపిస్తాయి.
2. ఐబీఎస్ బాధితులకు పాలు, పాల పదార్థాలు తరచుగా జీర్ణ సమస్యలు కలిగిస్తాయి. ఇందులో ఉండే ‘లాక్టోస్’ అనే చక్కెరను కొందరు జీర్ణం చేసుకోలేకపోవడం వల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపునొప్పి, అతిసారం వంటి సమస్యలు వస్తాయి.
3. మైదా, గోధుమ పిండిని ఎక్కువగా రోటీలు, పూరి, చపాతీ, బేకరీ ఐటమ్స్ వంటి ఆహారాల్లో ఉపయోగిస్తారు. ఇందులో ఉండే గ్లూటెన్ పేగులకు చికాకు కలిగిస్తుంది.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read
వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?
For More Latest News