చిన్న పిల్లలను వీటికి దూరంగా ఉంచండి.. లేదంటే చాలా ప్రమాదం.!
ABN , Publish Date - Feb 09 , 2026 | 06:38 PM
చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు. పిల్లల సంతోషం కోసం కొన్నింటిని వారికి దగ్గర చేస్తుంటారు తల్లిదండ్రులు. తినే పదార్థాలైనా, ఆట వస్తువులైనా వాటి వల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందా? అనే విషయం గురించి తెలుసుకోవాలి. చిన్నపిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో పిల్లల్ని పెంచడం తల్లిదండ్రులకు పెద్ద సవాల్‌గా మారింది. ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఎన్నో అనర్థాలు జరిగే అవకాశముంటుంది. బిజీ లైఫ్ స్టైల్ కారణంగా పిల్లల్ని పెంచే విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారు. పిల్లల్ని అర్ధం చేసుకుని పెంచడమే కాదు.. వారి విషయంలో తగు జాగ్రత్తలు పాటించడం కూడా ముఖ్యమే.
1. ఊపిరాడకుండా చేసే వస్తువులు:
చిన్న పిల్లలకు.. నాణేలు, బటన్లు ఇతర చిన్న చిన్న వస్తువులు గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది. వాటిని పిల్లలకు దగ్గరగా ఉంచకూడదు. ప్లాస్టిక్, చెక్కబొమ్మలు కొనేటప్పుడు వయసు పరిమితి తప్పకుండా చూడాలి. వాటితో గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
2. విషపూరితమైన పదార్థాలు:
రంగు రంగుల మాత్రలను చూడగానే ఆకర్షితులయ్యే పిల్లలు వెంటనే వాటిని నోట్లో వేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది చాలా ప్రమాదకరం.. కాబట్టి మెడిసిన్స్ దూరంగా ఉంచాలి. క్లీనింగ్ లిక్విడ్స్ అంటే ఫ్లోర్ క్లీనర్లు, డిటర్జెంట్లు, ఫినాయిల్ బాటిళ్లను ఎత్తులో లేదా లాక్ చేసిన అల్మారా వంటి వాటిలో ఉంచాలి. నెయిల్ పాలిష్, పెర్ఫ్యూమ్స్ వంటివి కూడా డేంజరే కాబట్టి వాటినీ దూరంగా ఉంచడం ఉత్తమం.
3. పదునైన, ఎలక్ట్రానిక్ వస్తువులు:
కత్తులు, కత్తెరలు మొదలగు పదునైన వస్తువులను ఎట్టిపరిస్థితుల్లో పిల్లలకు అందుబాటులో ఉంచకూడదు. వీటివల్ల చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ వస్తువులనూ పిల్లలకు చేరువలో ఉంచకూడదు. ప్లగ్ పాయింట్లు.. పిల్లలకు అందేంత ఎత్తులో ఉంటే వాటికి తప్పనిసరిగా సేఫ్టీ కవర్లు వాడాలి. లేదంటే విద్యుత్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. అగ్గిపెట్టెలు, లైటర్లు వంటి వాటినీ దూరంగా ఉంచాలి.
4. ప్లాస్టిక్ కవర్లు దూరంగా ఉంచాలి:
ప్లాస్టిక్ కవర్లను పిల్లలకు దూరంగా ఉంచాలి. పిల్లలకు తెలియకుండా ముఖానికి వేసుకుంటే ఊపిరాడక ప్రమాదం వాటిల్లే అవకాశముంది. నీటి గుంత(సంపు)ను తప్పకుండా మూసి ఉంచాలి. నీటితో నిండిన డ్రమ్ము, బకెట్, గోలెం(సిమెంట్ తొట్టి) వంటి వాటికి దూరంగా పిల్లలను ఉంచాలి.
5. స్మార్ట్ ఫోన్‌లకు దూరంగా ఉంచాలి:
ఈ మధ్యకాలంలో చాలామంది.. చిన్న పిల్లలకు సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్‌లలో బొమ్మలు చూపిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇది చాలా ప్రమాదం అంటున్నారు వైద్య నిపుణులు. వీటివల్ల.. పిల్లల కళ్లు, మెదడుపై ప్రతికూల ప్రభావం కలిగే అవకాశం ఉందంటున్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు వీటిని దూరంగా ఉంచాలి.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉదయం నిద్రలేవగానే ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త.!
అధిక బరువు సమస్యకు ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
For More Latest News