మరమరాలు - ఆరోగ్య మర్మాలు
ABN , Publish Date - Jun 28 , 2026 | 12:35 PM
వేగించిన ధాన్యపు గింజలను ‘భృష్ఠధాన్యం’ అంటారు. వేడి తాకిడితో గింజ స్వభావం మారుతుంది.
వేగించిన ధాన్యపు గింజలను ‘భృష్ఠధాన్యం’ అంటారు. వేడి తాకిడితో గింజ స్వభావం మారుతుంది. దోరగా వేగితే పరిమళం పెరుగు తుంది. అరుగుదల తేలికవుతుంది. మరీ ఎక్కువ వేడి అందితే గింజలోని ఆవిరి ఒత్తిడిగా మారి, గింజ పేలి, తెల్లని పువ్వులా వికసిస్తుంది. ‘పాప్’ అని పేలతాయి కాబట్టి, తెలుగులో ‘పేలాలు’ అనీ, ఇంగ్లీషులో ‘పాప్స్’ అనీ పిలిచారు. వరితో చేసిన పేలాల్ని బొరు గులు, బొరువులు, మరమరాలు, మొర్మరాలు.. ఇలా పిలుస్తారు.
రుగ్వేద కాలంలో పేలాలను ‘లాజ’ అన్నారు. మరమరాలకి వేల ఏళ్ల చరిత్ర ఉంది. వడ్లు, బియ్యం, జొన్నలు, బార్లీ, మొక్కజొన్నలు, శన గలు, పెసలు మాత్రమే కాదు నేటి చిరుధాన్యా లన్నింటినీ పేలాలుగా తయారుచేయవచ్చు.
పాతతరం వాళ్లు పేలాలను బెల్లం లేదా తేనె కలిపి తినేవారు. తీపి ఇష్టం లేకపోతే పసుపు, ఉప్పు, కారం కలిపి తినాలని ఆయుర్వేద గ్రంథమైన భావప్రకాశం సూచించింది. పేలపిండిని మాంసాహారంతో కలిపి తినరాదని కూడా ఆ గ్రంథంహెచ్చరించింది. మరమరాలతో వైవిధ్య భరితమైన వంటలు చేసు కోవచ్చు. కొన్ని పరిశీలిద్దాం!
ఉప్మా: చిక్కటి మజ్జిగలో పేలపిండిని నానబెట్టి, అందులో కొత్తిమీర, ధనియాలపొడి, జీలకర్ర, తాలింపు కలిపితే పొయ్యి అవసరం లేని తక్షణ ఉప్మా సిద్ధమవుతుంది. అమీబియాసిస్, ఎసిడిటీ, అతిసారం, వడదెబ్బ, జ్వరం వంటి సమస్యల్లో ఇది ఉపశమనం ఇచ్చే ఆహారం.
అట్టు: తడిపిన మరమరాల ముద్ద, నానబెట్టిన గోధుమరవ్వ, టమాటాముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర కలిపి చేసిన అట్లు రుచికర మైనవి. మినప అప్పచ్చులకన్నా తేలికగా అరుగుతాయి.
రవ్వట్టు: మరమరాలు, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పెరుగు, జీలకర్రతో చేసిన రవ్వట్టు మృదువుగా, పరిమళ భరితంగా ఉంటుంది.
వడలు: పైన చెప్పిన రవ్వట్టులో కలిపిన వాటిని పలుచగా కాకుండా గట్టిగా రుబ్బిన పిండితో చేసిన వడలు కరకరలాడుతూ తేలికైన అల్పాహారం.
మసాలా: ఒక భాండీలో పైపైన వేగించిన మరమరాలు తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, మిరపకాయ ముక్కలను కొద్దిగా నూనె వేసి విడివిడిగా వేగించి మిక్సీపట్టిన గుజ్జునీ, తగినంత ఉప్పు, మసాలా పొడిని తీసుకుని మరమరాల పైన పోసి, బాగా కలపాలి. రుచికోసం వేయించిన వేరుశనగపప్పు, జీడి పప్పు వగైరాలు కలిపితే అది గుజరాతీయుల ప్రత్యేక వంటకం.
పులిహోర: ఉడికించిన చింతపండు రసం ఈ మరమరాల మసాలాలో కలిపి తాలింపుపెడితే మరమరాల పులిహోర. మార్వాడీల పోహాకి ఇది పోటీగా నిలిచే వంటకం.
పొరివిళంగాయలు: మరమరాల్ని, పెసర పేలాల్ని మెత్తగా దంచినపిండిలో బెల్లం, నెయ్యి కలిపి కట్టిన ఉండల్ని పొరి విళం గాయలంటారు. పొరి అంటే వేగించినది అని! మినపసున్ని ఉండల్లాగానే ఇవి మరమరాలతో కలిసిన పెసర సున్ని ఉండలు. ప్రయాణాల్లో శక్తినిచ్చే ఆహారం. ఆముక్తమాల్యదలో రాయల వారు వీటిని ప్రస్తావించారు.
మోరుండలు: లేత బెల్లంపాకంలోమరమరాలు కలిపి కట్టిన తెలుగువారి ప్రత్యేకమైన ఈ మోరుండల్ని దిల్లీ వీధుల్లో కూడా అదేపేరుతో అమ్ముతారు.
పేలాలు అనేవి పేదవాడి ఆహారంమాత్రమే కాదు. ఆరోగ్యశాస్త్రం, ఆహార సంస్కృతి, గ్రామీణ జీవన మాధుర్యం కలిసిన తెలుగువారి ఆహార సంపద. నేటి ‘ఇన్‌స్టంట్ ఫుడ్’ యుగంలోనూ, పొయ్యి అవసరం లేని సంప్రదాయ తక్షణాహారాలు శరీరానికీ, సంస్కృతికీ ఒకేసారి పోషణనిస్తాయి.
మరమరాలు తేలికగా అరిగే, తక్కువ క్యాలరీలున్న ఆరోగ్యకర ఆహారం. జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడంలో సహా యపడతాయి. విటమిన్ డి, బి, క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఎముకలకు దృఢ త్వాన్నిస్తాయి. మరమరాల పాయసం, లడ్డూ, ఛాట్, స్నాక్స్ పిల్లల ఎదుగుదలకు తోడ్పడతాయి.
డా. జి వి పూర్ణచందు, 94401 72642