Share News

వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్

ABN , Publish Date - Jun 28 , 2026 | 11:10 AM

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ జగన్‌పై మంత్రి నారా లోకేష్ ఫైర్
AP Minister Nara Lokesh

అమరావతి, జూన్ 28: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాజధాని అమరావతిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితోపాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే జగన్‌కి మాత్రం ఇబ్బందిగా ఉందన్నారు.


వైఎస్ఆర్ కడప జిల్లాలో ఐదు స్మార్ట్ కిచెన్లు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని వివరించారు. ఈ స్కూళ్ల ప‌రిధిలో పని చేస్తున్న 233 మంది కుక్ కమ్ హెల్పర్లు యాథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికి ఢోకా లేదన్నారు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయం శక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్లతో పాటు సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయ‌బోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితోపాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారని వైఎస్ జగన్‌ను ఆయన నిలదీశారు. పేద‌లు బాగుప‌డితే చూడ‌లేరా? అంటూ జ‌గ‌న్‌కు చరకలంటించారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేత‌నాలు చెల్లించ‌లేద‌ని జ‌గ‌న్ ఆరోపించిన వైయస్ఆర్ కడప జిల్లాలో ప‌ని చేస్తున్న మొత్తం 3,450 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏప్రిల్ 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించామని తెలిపారు.


మే నెలలో పాఠ‌శాల‌ల‌కు వేసవి సెలవులని.. ఆ కారణంతోనే గౌర‌వ వేత‌నాలు చెల్లింపు ఉండ‌దని ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి వివరించారు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు గుర్తు చేశారు. ఎవ‌రి బ‌కాయిలు గురించి ఫేక్ ఆరోప‌ణ‌లు చేశారో చెప్పాలంటూ వైఎస్ జ‌గ‌న్‌ను డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. పేద పిల్లలకు మంచి భోజనం పెట్టడం, ఆరోగ్యంగా ఉండడం కూడా సహించలేకపోతే ఎలా జగన్? అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎంను మంత్రి నారా లోకేష్ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

Updated Date - Jun 28 , 2026 | 11:59 AM