Share News

గడ్డి స్నానం.. మర్దనలో ఇదోరకం!

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:05 PM

ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారా? అయితే కాసేపు గడ్డిలో సేదతీరండి. ఇట్టే నొప్పులన్నీ మాయమవుతాయి.

గడ్డి స్నానం.. మర్దనలో ఇదోరకం!
Hay Bath Therapy

ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారా? అయితే కాసేపు గడ్డిలో సేదతీరండి. ఇట్టే నొప్పులన్నీ మాయమవుతాయి. నిద్రలేమి వేధిస్తోందా? మంచం, దిండు పక్కన పెట్టేసి గడ్డిలో విశ్రమించండి. ఇట్టే కునుకు పడుతుంది. అదేంటి? గడ్డిలో సేదతీరితే నొప్పులు తగ్గుతాయా? నిద్ర సమస్యలు దూరమవుతాయా? అంటే అవుననే అంటున్నాయి యూరప్‌ లోని స్పా సెంటర్లు. గడ్డి స్నానం (హే బాత్‌) అని పిలిచే ఈ చికిత్సా విధానానికి దశాబ్దాల చరిత్ర ఉంది మరి. యూరప్‌లో కొన్ని హోటళ్లు ఈ పురాతన వెల్‌నెస్‌ ట్రీట్‌మెంట్‌ను సరికొత్తగా అందిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.

గడ్డి... పశువులకు మేతగా తప్ప ఇక దేనికీ ఉపయోగపడదన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతుందని అంటున్నారు యూరప్‌వాసులు. గడ్డి అనేది ఒళ్లు నొప్పులు, జీర్ణసమస్యలకు, నిద్రలేమి వంటి వాటికి ఉపశమనాన్ని అందిస్తుందన్నది వాళ్ల మాట. అంతేకాదు... ఇప్పటిదాకా సుగంధ పుష్పాలు, ద్రవ్యాలతో మర్దనలు చేసిన ఆధునిక స్పా సెంటర్లలో గడ్డితో మసాజ్‌, బాత్‌ సేవలు అందిస్తూ కస్టమర్లకు ఉపశమనాన్ని అందిస్తున్నారు.


  • శారీరక శ్రమ...ఇట్టే మాయం...

యూరప్‌లోని ఆల్ఫ్స్‌ పర్వత ప్రాంతాల్లో నివసించే గొర్రెల కాపరులు, రైతులు అత్యధిక రోగనిరోధక శక్తి కలిగి ఉంటారు. దానికి కారణం స్వస్థతను చేకూర్చే గుణాలున్న గడ్డిలో ఆ కాపరులు విశ్రమిస్తుండటమే అని పరిశోధకులు తేల్చారు. ఇంకా చెప్పాలంటే కష్టించి అలసిపోయి, గడ్డివాములపై కునుకు తీసే రైతుల నుంచి ఈ చికిత్స ఉద్భవించింది. శారీరక శ్రమతో అలసిపోయిన రైతులు గడ్డిపై పడుకున్న తరువాత నొప్పుల నుంచి ఆశ్చర్యకరంగా ఉపశమనం పొందేవారు. అంతే కాకుండా నిద్ర లేవగానే తిరిగి ఉత్సాహంగా పనుల్లో పాల్గొనేవారు. కాలక్రమంలో అది చికిత్సా విధానంగా మారింది.


book7.2.jpg

  • స్పా సెంటర్లలో...

గడ్డి స్నానం కోసం స్పా సెంటర్‌ నిర్వాహకులు... 2 వేల మీటర్ల ఎత్తులో కొండప్రాంతాల్లో పెరుగుతూ, సువాసనలు వెదజల్లే అల్పైన్‌ గడ్డిని సేకరిస్తారు. ఈ ఎండుగడ్డిలో ఎడెల్వెసిస్‌, అర్నికా, యారో వంటి మూలికలుంటాయి. ముందుగా గడ్డిని తడిపి సహజంగా పులిసేందుకు వదిలేస్తారు. ఈ పులియబెట్టే ప్రక్రియలో విడుదలైన ఉష్ణోగ్రతల వల్ల గడ్డిలో నుంచి సుగంధ తైలాలు విడుదలవుతాయి. తరువాత ఆవిరి వెదజల్లుతున్న గడ్డిలో వ్యక్తిని పడుకోబెడతారు. చెమట ద్వారా విషపదార్థాలు బయటకు పోయిన తరువాత... నార దుప్పట్లు చుట్టి వాటర్‌బెడ్‌పై పడుకోబెడతారు. ఈ చికిత్స 15 నుంచి 20 నిమిషాల పాటు కొనసాగుతుంది. పులియబెట్టిన గడ్డిలో సేదతీరడం వల్ల కీళ్ల నొప్పులు, కీళ్లవాతం, నిద్రలేమి, జీర్ణసమస్యలు... ఇలా అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తోంది.


ఇటలీలోని కొన్ని హోటళ్లు, స్పా సెంటర్లలో ఈ చికిత్సా విధానాన్ని ప్రారంభించాయి. గడ్డితో మర్దన, హే బాత్‌ వంటి వాటితో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. హోటల్‌ హ్యూబాడ్‌ స్పా ‘ది ఒరిజినల్‌ హేబాత్‌’ పేరుతో చికిత్సను అంది స్తోంది. ‘‘గడ్డిలో విషాన్ని హరించే గుణాలు, శుద్ది చేసే గుణాలున్నాయి. గడ్డిలో విశ్రమిం చడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తప్రసరణ మెరుగవుతుంది’’ అని అంటారు స్పా నిర్వాహకులు. ఇటలీలోని సౌత్‌ టైరోల్‌, ఆస్ట్రియాలోని సీఫీల్డ్‌ గ్రామ ప్రాంతాల్లో గడ్డిని ఎక్కువగా సేకరిస్తారు. ఈ గడ్డి వైద్యం భలేగా ఉంది కదూ!


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఇవే..

బంగాళదుంపలు ఉడికించిన నీటిని పారబోస్తున్నారా?

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 28 , 2026 | 12:07 PM