మజ్జిగ Vs కొబ్బరి నీళ్లు - ఏది బెస్ట్ హైడ్రేషన్?
ABN , Publish Date - Mar 12 , 2026 | 04:44 PM
వేసవి కాలంలో ఉపశమనం పొందడానికి, శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, డీహైడ్రేషన్ నివారించడం, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో అవసరం.
ఇంటర్నెట్ డెస్క్: వేసవిలో మన శరీరం నీటిని, శక్తిని త్వరగా కోల్పోతుంది. వేసవి తాపం (ఎండ వేడి) తట్టుకోవడానికి నిమ్మ రసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, కర్బూజా జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. ఈ సమయంలో హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అయితే, వేసవి కాలంలో మజ్జిగ, కొబ్బరి నీళ్లకు చాలా ప్రాధాన్యతనిస్తారు. మరి ఈ రెండింటిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఏవి ఉంచుతాయో తెలుసుకుందాం.
కొబ్బరి నీళ్లు:
కొబ్బరి నీళ్లు కేవలం దాహాన్ని తీర్చే పానియం మాత్రమే కాదు, ఇది ప్రకృతి అందించిన ఒక అద్భుతమైన 'ఎలక్ట్రోలైట్ సొల్యూషన్'. ఇందులో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, సహజ చక్కెరలు సమపాళ్లలో ఉంటాయి. ఎండలో తిరగడం వల్ల లేదా వ్యాయామం వల్ల కలిగే అలసటను వెంటనే దూరం చేస్తుంది. కొబ్బరి నీరు ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇందులో యాంటి ఆక్సిడెంట్స్ చర్మాన్ని తాజాగా ఉంచుతాయి. ఎండలో తిరిగి అలసిపోయినప్పుడు కొబ్బరి నీరు తాగడం చాలా మంచిది.
ఇది మీ రక్తపోటును నియంత్రించడంలో, తక్షణమే ఎలక్ట్రోలైట్లను అందించడంలో సహాయపడుతుంది. వేసవిలో బాడీ హీట్ పెరగడం వల్ల కళ్లు మండటం, మూత్రంలో మంట వంటి సమస్యలు వస్తాయి. కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం లోపలి నుంచి చల్లబడి, ఉష్ణోగ్రత క్రమబద్దీకరించబడుతోంది. కొబ్బరి నీరు రక్త ప్రసరణను మెరుగు పరిచి, మెదడు, గుండెకు అవసరమైన పోషకాలను అందిస్తోంది. తద్వారా వడదెబ్బ ప్రభావం తగ్గుతోంది. వేసవి కాలంలో జీర్ణక్రియ మందగించి అజీర్తి, కడుపు మంట, గ్యాస్ వంటి సమస్యలు ఎదురవుతాయి. కొబ్బరి నీరు జీర్ణవ్యవస్థను శుభపరిచి, ఎసిడిటీని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
మజ్జిగ:
భారతీయ ఇళ్లలో మజ్జిగకు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. మజ్జిగ సహజంగానే చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. వేసవిలో వచ్చే ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ B12, కాల్షియం ఎముకల బలానికి తోడ్పడుతుంది. భోజనం చేసిన తర్వాత మజ్జిగ తాగడం ఉత్తమం. ఎందుకంటే ఆహారం త్వరగా అరగడానికి ఇది సహాయపడుతుంది.
మజ్జిగలో క్యాలరీలు చాలా తక్కువ, కాబట్టి డైట్‌లో ఉండేవారికి ఇది చాలా మంచిది. మజ్జిగలో నీటి శాతంతో పాటు తగినంత సోడియం, పొటాషియం, కాల్షియం ఉంటాయి. ఇవి శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడుతూ, ఎండ వల్ల కలిగే నీరసం, అలసట నుంచి ఉపశమనం కలిగిస్తాయి. మసాలా ఆహారాలు తిన్నప్పుడు కడుపులో మంట లేదా ఎసిడిటి రావడం సహజం. మజ్జిగ తాగితే కడుపు చల్లగా ఉంటుంది.
నిజానికి వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు, మజ్జిగ రెండూ ప్రకృతి ప్రసాదించిన అమృతాలే. ఒక రకంగా చెప్పాలంటే.. కొబ్బరి నీళ్లు శరీరానికి ‘రీఛార్జ్’ లాంటిది అయితే, మజ్జిగ శరీరానికి ‘రిలాక్సేషన్’ లాంటిది. అందుకే కృత్రిమ పానియాల జోలికి వెళ్లకుండా, సమయం, సందర్భాన్ని బట్టి ఈ రెండు పానియాలు తీసుకుంటే మంచి హైడ్రేటెడ్‌గా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read
వేసవిలో బయటకు వెళ్లే ముందు ఈ స్కిన్‌కేర్ తప్పనిసరి
బొప్పాయి తినడానికి సరైన సమయం తెలుసా?
For More Latest News