Share News

సంక్షోభ నివారణా.. అతిజోక్యమా?

ABN , Publish Date - May 08 , 2026 | 06:36 AM

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన విజయ్‌ టీవీకే పార్టీని ఆ గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెజారిటీకి సరిపడా ఎమ్మెల్యేల...

సంక్షోభ నివారణా.. అతిజోక్యమా?

తమిళనాడు గవర్నర్‌ తీరుపై జోరుగా చర్చలు.. లార్జెస్ట్‌ పార్టీనా.. మెజారిటీ చూపిన తర్వాతేనా?

  • ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలి?

  • సుప్రీం మార్గదర్శకాలు, కమిషన్ల సిఫార్సులు ఏం చెబుతున్నాయి?

(సెంట్రల్‌ డెస్క్‌)

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించిన విజయ్‌ టీవీకే పార్టీని ఆ గవర్నర్‌ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెజారిటీకి సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని రావాలని గవర్నర్‌ రాజేంద్ర అర్లేకర్‌ సూచించడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సంక్షోభ నివారణ కోసం గవర్నర్‌ ముందుజాగ్రత్త తీసుకుంటున్నారనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల పిలుపు మేరకు హడావుడిగా ఏర్పాటైన ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో నెగ్గలేక రోజుల్లోనే కూలిపోయాయి. 1996లో కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం 13 రోజుల్లోనే పడిపోయింది. అలాంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు వ్యవహరించాల్సిన తీరుపై ‘ఎస్‌ఆర్‌ బొమ్మై’ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. సర్కారియా, పూంచీ కమిషన్లు కూడా కీలక సూచనలు చేశాయి. వాటిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది.

ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యతా క్రమం

సర్కారియా, పూంచీ కమిషన్ల సూచనలు, సుప్రీం మార్గదర్శకాలు, తీర్పుల ప్రకారం.. రాజకీయ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించేందుకు గవర్నర్లు ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి.

- తొలుత ఎన్నికల ముందే ఏర్పడిన కూటములను (ప్రీపోల్‌ అలయన్స్‌) పరిగణనలోకి తీసుకోవాలి. ఏదైనా కూటమికి ఎక్కువ స్థానాలు వస్తే వారిని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి.

  • ముందుగా ఏర్పడిన ఏ కూటమికీ మెజారిటీ రానప్పుడు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచిన పార్టీ (సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీ)ని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలి.

  • ఎన్నికల తర్వాత పలు పార్టీలు కూటమిగా ఏర్పడి (పోస్ట్‌ పోల్‌ అలయన్స్‌) మెజారిటీ ఉందని గవర్నర్‌ను సంప్రదిస్తే.. ఆ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు.

  • చివరిగా ప్రభుత్వంలో భాగంకాకున్నా బయటి నుంచి మద్దతిచ్చే పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశముంటే పరిశీలించవచ్చు.

  • ఏ పార్టీకీ మెజారిటీ లేని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు చిట్టచివరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయవచ్చు.

  • మద్దతిస్తున్న పార్టీల నుంచి ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను గవర్నర్‌ తీసుకోవాలని.. అవసరమైతే స్వయంగా ధ్రువీకరించుకోవాలని పూంచీ కమిషన్‌ సూచించింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావనా చేయలేదు.


అసెంబ్లీలో బలనిరూపణే కీలకం!

గవర్నర్‌ ఏదైనా పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అంశమైనా, అప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వానికి మెజారిటీ ఉందా లేదా అనే అంశమైనా లోక్‌భవన్‌ (రాజ్‌భవన్‌)లో నిర్ణయించేది కాదని ఎస్‌ఆర్‌ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ మాత్రమే బలనిరూపణకు కీలకమని తెలిపింది. గవర్నర్‌ ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఎమ్మెల్యేల సంతకాల కంటే.. అసెంబ్లీలో ఓటింగ్‌కే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. కర్ణాటకలో నాటి గవర్నర్‌ పి.వెంకటసుబ్బయ్య అప్పటికే కొనసాగుతున్న ఎస్‌ఆర్‌ బొమ్మై ప్రభుత్వాన్ని మెజారిటీ కోల్పోయిందంటూ రద్దు చేసిన కేసు తీర్పులో సుప్రీం ఈ అంశాలను స్పష్టం చేసింది.

వీలైనంత తక్కువ గడువులో బలనిరూపణ

కొత్త ప్రభుత్వానికి అసెంబ్లీలో బల నిరూపణ కోసం 30 రోజులకు మించి గడువు ఇవ్వవద్దని సర్కారియా కమిషన్‌ సూచించగా.. ఎమ్మెల్యేల కొనుగోళ్ల వంటి వి నియంత్రించేందుకు వీలైనంత తక్కువ గడువే ఇవ్వాలని పూంచీ కమిషన్‌ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ సూచనను పరిగణనలోకి తీసుకుంది. 2018లో కర్ణాటకలో, 2019లో మహారాష్ట్రలో గవర్నర్లు ఇచ్చిన గడువులను తగ్గించి.. వెంటనే బలపరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఆ రెండు సార్లు సదరు ప్రభుత్వాలు బలనిరూపణలో విఫలమై కూలిపోవడం గమనార్హం. కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 174 ప్రకారం.. ఏ పార్టీకీ మెజారిటీ లేని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేని సమయంలో గవర్నర్‌ అసెంబ్లీని రద్దు చేసి, మళ్లీ ఎన్నికల నిర్వహణకు సిఫార్సు చేయవచ్చు.

ముందుగా మద్దతు లేఖలు తీసుకుని..

1998 లోక్‌సభ ఎన్నికల్లోనూ హంగ్‌ ఫలితాలు వచ్చాయి. బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది. ఈసారి నాటి రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ కొత్త సంప్రదయానికి తెరతీశారు. జయలలిత అన్నాడీఎంకే పార్టీ సహా మద్దతిస్తున్న పార్టీల నుంచి లేఖలు తీసుకుని.. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 13 నెలలు కొనసాగింది.


13 రోజులు.. ఎన్నో ఆరోపణలు

1996 లోక్‌సభ ఎన్నికల్లో 161 సీట్లతో బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కానీ మెజారిటీకి దూరంగానే ఉండిపోయింది. ఎంపీల బలం లెక్కలు చూడకుండానే నాటి రాష్ట్రపతి శంకర్‌దయాల్‌శర్మ.. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, వాజ్‌పేయితో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయించారు. కేవలం 13రోజులే నిలిచిన ఆ ప్రభుత్వం.. లోక్‌సభలో బలంనిరూపించుకోలేక దిగిపోయింది. సంఖ్యా బలాన్ని పరిగణనలోకి తీసుకోకుండానే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడం, ప్రమాణ స్వీకారాలు చేయించిన అంశంలో అప్పటి రాష్ట్రపతిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

హడావుడి ప్రభుత్వాలు.. కుప్పకూలిన తీరు

  • 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 104 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ప్రభుత్వ ఏర్పాటుకు 113 సీట్లు కావాలి. 80 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌, 37 సీట్లు వచ్చిన జేడీఎస్‌ కలిసి 117 మంది ఎమ్మెల్యేల బలంతో ఎన్నికల అనంతర కూటమిగా ఏర్పడి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యాయి. కానీ అప్పటి గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ బలనిరూపణలో విఫలం కావడంతో మూడు రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది.

  • 2019లో మహారాష్ట్రలో బీజేపీ పెద్ద పార్టీగా నిలిచింది. ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. మరోవైపు శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమిగా ఏర్పడ్డాయి. గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, హడావుడిగా దేవేంద్ర ఫడ్నవీ్‌సతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. కానీ బలనిరూపణలో విఫలమై నాలుగు రోజుల్లోనే ప్రభుత్వం కూలిపోయింది.

ఈ వార్తలు కూడా చదవండి...

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 08 , 2026 | 06:36 AM