Share News

తొలుత మెజారిటీ చూపాల్సిందే

ABN , Publish Date - May 08 , 2026 | 06:28 AM

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని చూపించాల్సిందేనని తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కు...

తొలుత మెజారిటీ చూపాల్సిందే

విజయ్‌కి మరోమారు తేల్చిచెప్పిన గవర్నర్‌

లేకపోతే తదుపరి చర్యలు అని వెల్లడి

ప్రభుత్వం ఏర్పాటు చేశాక బలనిరూపణ

చేసుకుంటామన్న టీవీకే బృందం

రేపు సుప్రీంకు?.. నిపుణులతో చర్చలు

గవర్నర్‌ అర్లేకర్‌తో సీఎస్‌, డీజీపీ భేటీ

విజయ్‌కు కాన్వాయ్‌ ఏర్పాటుపై అక్షింతలు

చెన్నై, మే 7 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని చూపించాల్సిందేనని తమిళనాడు గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌కు తేల్చిచెప్పారు. వరుసగా రెండోరోజు గురువారం కూడా లోక్‌భవన్‌కు వచ్చిన విజయ్‌.. ఆయనతో అరగంటపాటు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు కు అవసరమైన ఎమ్మెల్యేల మెజారిటీ చూపాల్సిందేనని గవర్నర్‌ తేల్చిచెప్పారు. సంఖ్యాబలం లేకుండా కుదరదని స్పష్టం చేశారు. విజయ్‌ బృందంలోని ఒకరిద్దరు నేతలు.. ప్రభుత్వం ఏర్పాటు చేశాక మెజారిటీ నిరూపించుకుంటామన్నారు. గతంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన సంప్రదాయాలను ఆయనకు వివరించారు. అయితే వారి మాటలను గవర్నర్‌ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. మెజారిటీ చూపించకుంటే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేనని తేల్చిచెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీలో ఉండాల్సినంత మద్దతు టీవీకేకు లేదని.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇది తప్పనిసరని విజయ్‌కు గవర్నర్‌ స్పష్టం చేశారని లోక్‌భవన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

న్యాయనిపుణులతో విజయ్‌ చర్చలు..

బుధవారం మొదటిసారి విజయ్‌ తనను లోక్‌భవన్‌లో కలిసినప్పుడు.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు చూపించాలని గవర్నర్‌ స్పష్టంచేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాత్రి న్యాయనిపుణులతో చర్చించిన విజయ్‌ బృం దం.. గురువారం ఉదయాన్నే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరింది. లోక్‌భవన్‌ నుంచి సానుకూల స్పందన రావడంతో ఉదయం 11 గంటలకు వెళ్లిన బృందం.. 112 మంది ఎమ్మెల్యేలతో కూడిన జాబితాను, ఐదుగురు సభ్యుల కాంగ్రెస్‌ మద్దతు లేఖను ఇచ్చినట్లు తెలిసింది. దానిని పరిశీలించిన గవర్నర్‌.. ఇవి బుధవారం ఇచ్చినవేనని.. సంఖ్యాబలం పెరగలేదని పెదవి విరిచినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల అవసరమున్నందున విజయ్‌ ఇచ్చిన జాబితా సరిపోదని స్పష్టం చేసినట్లు సమాచారం. మరో రోజు సమయం తీసుకుని అయినా.. మెజారిటీ ఎమ్మెల్యేల జాబితాతో రావాలని సూచించినట్లు తెలిసింది. సంఖ్యాబలం చూపించలేని పక్షంలో తదుపరి చర్యలు చేపడతానని చెప్పి పంపినట్లు సమాచారం. అనంతరం నేరుగా పనయూరులోని తన కార్యాలయానికి వెళ్లి న విజయ్‌.. అక్కడ న్యాయనిపుణులతో మరోసారి భేటీ అయ్యారు. మూడు గంటలపాటు సుదీర్ఘ మంతనాలు జరిపారు. గవర్నర్‌ నిర్ణయంపై శుక్రవారం వరకు వేచిచూసి సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.


గవర్నర్‌తో సీఎస్‌, డీజీపీ భేటీ

గవర్నర్‌ అర్లేకర్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్‌, డీజీపీ సందీప్‌ రాయ్‌ రాథోడ్‌ గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ ఇద్దరిపై గవర్నర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎవరి ఆదేశాలతో విజయ్‌కు కాన్వాయ్‌ ఏర్పాటు చేశారని డీజీపీని నిలదీసినట్లు తెలిసింది. అదే విధంగా నెహ్రూ ఇండోర్‌ స్టేడియంలో విజయ్‌ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు ఏ ప్రాతిపదికన చేపట్టారని సీఎ్‌సను గవర్నర్‌ ప్రశ్నించినట్లు సమాచారం.

చిన్న పార్టీలతో టీవీకే మంతనాలు

సాధారణ మెజారిటీకి అవసరమైన మద్దతు సాధించడంపై టీవీకే నాయకత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతివ్వాలని ఇద్దరేసి ఎమ్మెల్యేలున్న సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్‌ను మరోసారి కోరింది. ఇవి మద్దతిస్తే టీవీకే సంఖ్యాబలం 120కి చేరుతుంది. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్‌ ఆహ్వానించక తప్పదు. ఈ నేపథ్యంలో టీవీకే నాయకుడు నిర్మల్‌కుమార్‌ గురువారం లెఫ్ట్‌ నేతలను కలిశారు. శుక్రవారం నిర్ణయం చెబుతామని వారు, వీసీకే నేతలు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి...

మహిళల భద్రతపై కమిషనర్ సుమతి స్పెషల్ ఫోకస్

హైదరాబాద్‌లో బెంగాల్ నటికి వేధింపులు.. నిందితుడికి 7 రోజుల జైలు శిక్ష

బయో టెర్రర్ కుట్రపై ఎన్ఐఏ ఛార్జ్‌షీట్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - May 08 , 2026 | 06:28 AM