ఫేక్ సమాగమ్ యాప్‌లతో జాగ్రత్త.. పేరెంట్స్‌కు కేవీఎస్ హెచ్చరిక
ABN , Publish Date - Nov 01 , 2026 | 08:30 AM
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న నకిలీ మొబైల్ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బందిని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) హెచ్చరించింది. కేవీఎస్ సమాగం, కేవీఎస్ సంవాద్ పేర్లతో కొన్ని ఫేక్ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో చలామణిలో ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో కేవీఎస్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) పేరుతో గూగుల్ ప్లేస్టోర్‌లో ఉన్న నకిలీ మొబైల్ యాప్‌లతో అప్రమత్తంగా ఉండాలని తల్లిదండ్రులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బందిని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) హెచ్చరించింది. కేవీఎస్ సమాగం, కేవీఎస్ సంవాద్ పేర్లతో కొన్ని ఫేక్ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో చలామణిలో ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో కేవీఎస్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ నకిలీ యాప్‌లతో కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. వాటిని డౌన్‌లోడ్ చేసుకోవడం, వ్యక్తిగత వివరాలు నమోదు చేయడం వంటివి చేస్తే డేటా దుర్వినియోగం కావడంతోపాటు ఆర్థిక మోసాలకూ గురయ్యే ప్రమాదం ఉందని కేవీఎస్ హెచ్చరించింది.
కేవీఎస్ సమాగం సేవలు తమ వెబ్ పోర్టల్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, యూజర్లు https://samagam.kvs.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అయి ఆ పోర్టల్‌ను యాక్సెస్ చేయవచ్చని కేవీఎస్ సూచించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్ల కోసం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాగం మొబైల్ యాప్‌ను విడుదల చేయలేదని తెలిపింది. అలాగే ‘కేవీఎస్ సంవాద్’ పేరుతో ప్రచారంలో ఉన్న పేరెంట్ కనెక్ట్ మొబైల్ యాప్‌ను కూడా ఇంకా ప్రారంభించలేదని వెల్లడించింది. ఈ యాప్‌ను అధికారికంగా ప్రారంభించినపుడు తెలియజేస్తామని పేర్కొంది.
తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి
నకిలీ యాప్‌లపై తల్లిదండ్రులు, విద్యార్థులు, సిబ్బందికి అవగాహన కల్పించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాళ్లను కేవీఎస్ ఆదేశించింది. పాఠశాల వెబ్‌సైట్లు, వాట్సాప్ గ్రూపులు, విద్యాలయ నిర్వహణ కమిటీ (వీఎంసీ) సమావేశాలు, పేరెంట్-టీచర్ సమావేశాల ద్వారా ఫేక్ యాప్‌లపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించింది. కేవీఎస్‌కు చెందినట్లుగా చెప్పుకునే ఏ మొబైల్ యాప్‌నైనా అధికారికంగా ధ్రువీకరించుకున్న తర్వాతే డౌన్‌లోడ్ చేసుకోవాలని, అనుమానాస్పద యాప్‌లలో నమోదు చేసుకోవడం లేదా వ్యక్తిగత వివరాలు అందించడం వంటివి చేయరాదని తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచించాలని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఢిల్లీ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురి మృతి..
పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..