Share News

విదేశీ ఎంబీబీఎస్‌ పట్టాలపై.. ఎన్‌ఎంసీ గందరగోళ ప్రకటనలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 03:29 AM

విదేశాల్లో వైద్య విద్య (ఎంబీబీఎస్‌) అభ్యసించే భారతీయ విద్వార్థులు స్వదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు అర్హతల విషయంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) పరస్పర విరుద్ధ ప్రకటనలు..

విదేశీ ఎంబీబీఎస్‌ పట్టాలపై.. ఎన్‌ఎంసీ గందరగోళ ప్రకటనలు

  • చదివిన దేశంలో ప్రాక్టీస్‌ అర్హత ఉంటేనే భారత్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు అర్హులని ప్రకటన

  • ఆ రూల్‌పై సమీక్ష జరుగుతోందని మరో ప్రకటన

న్యూఢిల్లీ, అక్టోబరు 31: విదేశాల్లో వైద్య విద్య (ఎంబీబీఎస్‌) అభ్యసించే భారతీయ విద్వార్థులు స్వదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు అర్హతల విషయంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయటంతో గందరగోళం నెలకొంది. జార్జియాలో ఎంబీబీఎస్‌ చదవాలని భావిస్తున్న ఇద్దరు విద్యార్థులు ప్రధాని గ్రీవెన్స్‌ పోర్టల్‌ ద్వారా అడిగిన ఒకే ప్రశ్నకు ఎన్‌ఎంసీ రెండు భిన్నమైన సమాధానాలిచ్చింది. జార్జియాలో ఆరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సు చదివితే మనదేశంలో ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు అవసరమైన ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌ ఎగ్జామినేషన్‌(ఎఫ్‌ఎంజీఈ) పరీక్షకు అర్హత ఉంటుందా? అని ఇద్దరు విద్యార్థులు ఎన్‌ఎంసీని వేర్వేరుగా అడిగారు. మొదటి విద్యార్థికి ఎన్‌ఎంసీ సెప్టెంబరు 24న సమాధానమిస్తూ.. ‘జార్జియాలో ఆరేళ్ల ఎంబీబీఎస్‌ కోర్సు పూర్తిచేసిన తర్వాత.. అక్కడ స్వతంత్రంగా వైద్య ప్రాక్టీస్‌ చేసుకొనేందుకు ఆ దేశం అనుమతి ఇస్తేనే.. ఎఫ్‌ఎంజీఈ పరీక్షకు అర్హత ఉంటుంది. ఇందుకు సంబంధించి ఎన్‌ఎంసీ నిబంధనలు-2021లోని క్లాజ్‌ 4బీని కచ్చితంగా పాటించాల్సిందే’ అని పేర్కొంది.


రెండో విద్యార్థి అడిగిన అదే ప్రశ్నకు ఈ నెల 13న సమాధానమిస్తూ.. ‘ఇండిపెండెంట్‌ ప్రాక్టీస్‌ నిబంధనను నిపుణుల కమిటీతోపాటు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు’ అని తెలిపింది. అయితే, ఈ సమీక్షకు సంబంధించి ఎన్‌ఎంసీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవటంతో ఆ సంస్థ చెప్పిన సమాధానాల్లో ఏది నిజమో తెలియక విద్యార్థులు గందరగోళంలో పడ్డారు. జార్జియాలో దాదాపు 30 వేల మంది భారతీయ విద్యార్థులు ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కాగా, తమదేశంలో ఎంబీబీఎస్‌ పూర్తిచేసినవారికి ‘జూనియర్‌ డాక్టర్‌’ అర్హత ఇస్తామని, స్వతంత్ర ప్రాక్టీస్‌ అర్హత రావాలంటే రెండేళ్ల పీజీ కోర్సుతోపాటు స్థానిక (జార్జియాలోని భాషలు) నేర్చుకొని ఉండాలని స్పష్టంచేసింది.

Updated Date - Nov 01 , 2026 | 03:30 AM