కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు డీలా..!
ABN , Publish Date - Oct 23 , 2026 | 12:37 PM
సంప్రదాయ డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. కొన్నేళ్లుగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పడిపోతున్నాయి.
యూనివర్సిటీలో ఏటేటా పడిపోతున్న అడ్మిషన్లు
ఈ దఫా కేయూ పరిధిలో అత్పల్పం
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక ప్రైవేట్ కళాశాలలు దివాలా
బకాయిలతో విద్యార్థుల ఇక్కట్లు
సర్టిఫికెట్లు ఇవ్వని సంస్థలు
వరంగల్: సంప్రదాయ డిగ్రీ కోర్సులకు డిమాండ్ తగ్గుతోంది. కొన్నేళ్లుగా కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా పడిపోతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో ఉన్న సీట్లన్నీ విద్యార్థులు లేక వెలవెలబోతున్నాయి. గతంలో సీట్ల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించే పరిస్థితి నుంచి ఇప్పుడు కళాశాలల యాజమాన్యం ఊరూరా తిరిగి విద్యార్థుల ఇళ్లలోకి వెళ్లి ‘మా కళాశాలలో చేరండి..’ అంటూ బతిమాలాల్సి వస్తోందంటే పరిస్థితి ఎంత మారిందో చెప్పవచ్చు. హనుమకొండ, వరంగల్ నగరంలోని ప్రసిద్ధి చెందిన కళాశాలల్లోనూ సీట్లు నిండని పరిస్థితి డిగ్రీ కోర్సుల అడ్మిషన్లపై ఆందోళన కలిగిస్తోంది. సీట్లు నిండని పరిస్థితి ఒక వైపు ఉంటే.. ఉన్న సీట్లలోనూ విద్యార్థినుల సంఖ్యే అధికంగా కన్పిస్తోంది.
అడ్మిషన్ల పరిస్థితి ఇలా..
కేయూ 2025-2026 ఏడాదికి అడ్మిషన్ల పరిస్థితి మరి ఘోరంగా మారింది. వరంగల్ నగరంలోని సుబేదారిలోని ఆర్ట్స్-సైన్స్ కళాశాల, వడ్డెపల్లి మహిళా పింగళి కళాశాల, హనుమకొండ కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా ఉన్నా మిగతా కళాశాలల్లో అడ్మిషన్ల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అడ్మిషన్ల కోసం స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం అశించిన విధంగా లేదని కళాశాలల యాజమాన్యాలు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. కేయూ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్‌లో ప్రైవేట్, ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలన్నీ కలిసి 211 డిగ్రీ కళాశాలలున్నాయి. వీటిలో సైన్స్, ఆర్ట్స్, కామర్స్ కోర్సులతో పాటు ఇతర కోర్సులలో సుమారు 1,01,260 సీట్లు అందుబాటులో ఉండగా, ఈ దఫా 41,661 మంది అడ్మిషన్లు పొందారు. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ (అటానమస్) కళాశాలలో 1,680 సీట్లకు గాను 1,475 మంది, మాస్టర్జీ డిగ్రీ, పీజీ కళాశాలలో 1,860 సీట్లకు 979 మంది, ఆర్ట్స్ - సైన్స్ కళాశాలలో 1,770 సీట్లకు 1,263 మంది, వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలల్లో 2,400-సీట్లకు 1,983 మంది అడ్మిషన్లు పొందారు.
ఆదిలాబాద్‌లోని ఆర్ట్స్, కామర్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో 600 సీట్లకు 554 మంది, అలాగే ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ కళాశాలలో 660 సీట్లకు 585, అలాగే కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 660 సీట్లకు 600 మంది అడ్మిషన్లు పొందారు. జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 780 సీట్లకు 728 మంది, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 540 సీట్లకు 482 మంది అడ్మిషన్లు పొందారు. హనుమకొండ కేడీసీలో 2,100 సీట్లకు 2,044 మంది, వడ్డెపల్లి పింగళి మహిళా కళాశాలలో 1,260 సీట్లను 946 మంది అడ్మిషన్లు పొందారు. కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో 600 సీట్లకు 349 మంది అడ్మిషన్లు పొందారు. వీటితోపాటు ములుగురోడ్డులోని ఎల్‌బీ కళాశాలలో 720 మందికి 351 మంది, సీకేఎం కళాశాలలో 540 మందికి 226 సీట్లు పొందారు. మహబూబాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 600సీట్లను 331 మంది అడ్మిషన్లు పొందారు. వరంగల్ పోర్టు రోడ్డులోని ఏఎ్‌సఎం డిగ్రీ కళాశాలలో 240 సీట్లకు12 మంది సీట్లు పొందారు. అలాగే వరంగల్ పోస్టాఫీసు వద్ద గల ఎస్‌వీఎ్‌సఏ డిగ్రీ కళాశాలలో 60 సీట్లకు 38 మంది అడ్మిషన్లు పొందారు.
జీరో అడ్మిషన్లు ఉన్న కళాశాలలు ఇవే..
కేయూ పరిధిలో ఈ ఏడాది ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్‌లో 32 కళాశాలల్లో అడ్మిషన్లు జీరోగా మారాయి. జీరో ఉన్న కళాశాలల్లో ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, మొత్తం 211 డిగ్రీ కళాశాలల్లో 100 నుంచి 200 లోపు విద్యార్థుల అడ్మిషన్లు కళాశాలలు సంఖ్య 135గా ఉన్నాయని వర్సిటీ ఉన్నతాధికారుల నివేదికలు వెల్లడిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కళాశాలల్లో మరీ దారుణంగా 2, 6, 9, 10, 12, 17, 18, 24, 25, 32, 39, 43, 46, 52, 56 విద్యార్థులు అడ్మిషన్లు పొందారు.
కొత్త డిగ్రీ కళాశాల్లో అడ్మిషన్లు ఇలా..
రాష్ట్ర ప్రభుత్వ ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్లు పరిస్థితి అశాజనకంగా మారింది. కేసముద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 81, స్టేషన్ ఘన్‌పూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 112 అడ్మిషన్లు నమోదయ్యాయి. అలాగే కొత్తగూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి ఏడాది అడ్మిషన్లు జరుగుతున్నాయి. వీటితో పాటు రంగశాయిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 101, మరిపెడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 42, తొర్రూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 249, ఏటూరునాగారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 317 అడ్మిషన్లు అయ్యాయి. పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలలో 301 అడ్మిషన్లు పొందారు.
ఉన్నత చదువులకు ఆటంకం
డిగ్రీ అర్హతతో చాలా మంది విద్యార్థులు పీజీలతో పాటు బీఈడీ ఇతర త్రా కోర్సులు చదువుతారు. ఉన్నత చదువులు చదవాలంటే కచ్చితంగా టీసీతో పాటు డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన పత్రాలన్నీ సమర్పించాల్సి ఉం టుంది. అయితే డిగ్రీ చదివిన కళాశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షి్‌షలు ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ధ్రువపత్రాలను ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులే డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఫీజుల చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడి విద్యా ర్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారు. ప్రభుత్వం ఇటీవల కొం దరు విద్యార్థులకు ఫీజుల చెల్లింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి సమస్యలను దఫాల వారీగా పరిష్కరిస్తుడడంతో పరిస్థితి కాస్త గాడిలో పడుతోందని తెలుస్తోంది. ప్రభుత్వం విద్యార్థులకు ఫేస్ రికగ్నైజేషన్ అటెండెన్స్‌ను ప్రవేశపెట్టడంతో విద్యార్థులు రెగ్యులర్ కళాశాలలకు రావాల్సిన అనివార్య పరిస్థితులతో స్కాలర్‌షి్‌షల చెల్లింపు సమస్యలకు పరిష్కారం లభిస్తోందని అధ్యాపకులు పేర్కొంటున్నారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక..
ప్రైవేట్, ఎయిడెడ్ డిగ్రీ కళాశాలలు కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీ విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ లు సక్రమంగా చెల్లించకపోవడంతో దివాలా దిశగా అడుగులు వేస్తున్నాయి. సుమారు 35 కళాశాలల్లో జీరో అడ్మిషన్లకు ప్రధాన కారణంగా ఫీజుల చెల్లింపులు రాకపోవడమేనని తెలుస్తోంది. ఫీజులు రీయింబర్స్‌మెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా రూ.36 వేల కోట్లు ఉన్నట్లు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు చెబుతున్నాయి. దీంతో తమ కళాశాలల్లో చదివిన విద్యార్థులకు ఉత్తీర్ణత సాధించిన పత్రాలు, టీసీలు, ఇతరపత్రాలు జారీ చేయడం లేదు. పత్రాలు రాకపోవడంతో ఉన్నత విద్యాభ్యాసం చేసే వీలులేక పీజీ కోర్సుల అడ్మిషన్ల పైనా ప్రభావం చూపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
తెలంగాణ అభివృద్ధిలో ఎస్పీఎఫ్ పాత్ర కీలకం: భట్టి విక్రమార్క
Read Latest AP News And Telangana News And International News And Telugu News