సీబీఎస్ఈ పోర్టల్ పునఃప్రారంభానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:55 PM
సీబీఎస్ఈ 12వ తరగతి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ పోర్టల్‌ను తక్షణమే తిరిగి తెరిచేలా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిల్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంపై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది.
ఇంటర్నెట్ డెస్క్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) 12వ తరగతి విద్యార్థుల రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ కోసం ఉపయోగించే ఆన్‌లైన్ సర్వీస్ మెకానిజం(OSM) పోర్టల్‌ను వెంటనే పునఃప్రారంభించాలన్న ఆభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ఈ దశలో పోర్టల్‌ను మరలా తెరిస్తే ఫలితాల తదుపరి ప్రక్రియ ఆలస్యం కావడంతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయే ప్రమాదముందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎన్ఎస్‌యూఐ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(PIL)పై శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. తక్షణ ఉపశమనం కల్పించేందుకు నిరాకరిస్తూ ఈ కేసును తదుపరి విచారణ కోసం రెగ్యులర్ బెంచ్‌కు బదిలీ చేసింది.
విచారణ సందర్భంగా బోర్డు తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ఈ ఏడాది సుమారు 17.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఈ సమయంలో మళ్లీ పోర్టల్ తెరిస్తే ఫలితాల ప్రక్రియపై ప్రభావం పడే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఫలితాలు ఆలస్యం కావడం తమకు ఇష్టం లేదని, వ్యక్తిగతంగా ప్రభావితులైన విద్యార్థులు కోర్టును ఆశ్రయించవచ్చని వ్యాఖ్యానించింది.
కాగా.. ఇటీవల రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ దరఖాస్తుల గడువు ముగిసిన తర్వాత పలువురు విద్యార్థులు పోర్టల్ సరిగా పనిచేయలేదని, లాగిన్ సమస్యలు ఎదురయ్యాయని సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదులు లేవనెత్తారు. 'రోల్ నంబర్ నాట్ ఫౌండ్' అనే మెసేజ్ కనిపించిందని కొందరు, వెబ్‌సైట్ లోడ్ అవ్వలేది మరికొందరు ఆరోపించారు. అయితే.. ఈ ఆరోపణలను సీబీఎస్ఈ ఖండించింది. జూన్ 2 నుంచి 7 వరకు పోర్టల్ పూర్తిస్థాయిలో పనిచేసిందంది. ప్రభుత్వ సాంకేతిక సంస్థలు, ఐఐటీ నిపుణుల పర్యవేక్షణలో పోర్టల్‌ను నిర్వహించామని తెలిపింది. ఆ సమయంలో 1.6 లక్షల మందికి పైగా అభ్యర్థులు.. సుమారు 3.8 లక్షల ఆన్సర్ షీట్స్ వెరిఫికేషన్ కోసం విజయవంతంగా దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించింది.
'రోల్ నంబర్ నాట్ ఫౌండ్' అనే మెసేజ్‌పైనా బోర్డు వివరణ ఇస్తూ.. నిబంధనల ప్రకారం, ఆన్సర్ బుక్ ఫొటో కాపీ కోసం తొలిదశలో దరఖాస్తు చేసిన విద్యార్థులు మాత్రమే తదుపరి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియకు అర్హులని స్పష్టం చేసింది. తొలిదశ పూర్తిచేయని వారికి మాత్రమే ఇలాంటి మెసేజ్ వచ్చి ఉంటుందని పేర్కొంది. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉన్నామని బోర్డు పునరుద్ఘాటించింది.
ఇవీ చదవండి:
మీనాక్షికి దక్కని ఊరట.. జోక్యం చేసుకోలేమన్న సుప్రీం ధర్మాసనం
మేకెదాటు ప్రాజెక్ట్‌కు అనుమతులివ్వాలని పీఎంకు కర్ణాటక సీఎం లేఖ