ఎలిమెంటరీ కోర్సుకు యమ డిమాండ్
ABN , Publish Date - Jun 13 , 2026 | 11:02 AM
ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది.
ఎక్కువ మంది విద్యార్థుల మొగ్గు చూపు
గతంలో కన్నా గణనీయంగా పెరిగిన పోటీ
ఉమ్మడి జిల్లాలో సుమారు 2200 మంది వెబ్‌ఆప్షన్
హనుమకొండ: ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) కళాశాలలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్‌ఐడీ) కోర్సుకు ఎనలేని డిమాండ్ ఏర్పడింది. ప్రారంభంలో దీన్ని టీటీఎస్‌గా, మొన్నటి వరకు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సుగా పిలిచేవారు. సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) పోస్టుకు ఈ కోర్సు చేసిన విద్యార్థులే అర్హులు, ఇటీవల ప్రభుత్వాలు ఎస్జీటీ పోస్టుల భర్తీకి ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో ఈ కోర్సు వైపు చాలా మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. వీరిలో పీజీ, బీఈడీ పూర్తి చేసిన వారు పెద్ద సంఖ్యలో ఉంటున్నారు.
2200 మంది
హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన సుమారు 2200 మంది విద్యార్థులు హనుమకొండ డైట్ కళాశాలకు వెబ్ ఆప్షన్ పెట్టుకున్నారు. గతంలో కన్నా ఈసారి ఎక్కువమంది ఇందులో చేరేందుకు మొగ్గు చూపారు. ఈనెల 2 నుంచి 6వ తేదీ వరకు హనుమకొండలోని డైట్ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. ఈనెల 8 వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఈనెల 14న మొదటి విడతగా సీట్లను కేటాయిస్తారు. ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగు జిల్లాల అభ్యర్థులు ఎక్కువ మంది పోటీపడుతున్నారు.
డిగ్రీ, పీజీ విద్యార్థులు సైతం
ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారు డీఈఎల్‌ఐడీ ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులు. ఇందుకు భిన్నంగా డిగ్రీ, పీజీ అర్హతలున్న అనేక మంది ప్రవేశ పరీక్ష రాసి సీట్ల కోసం పోటీపడుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ధ్రువపత్రాల పరిశీలన గమనిస్తే ఎంటెక్, ఎంఈడీ, ఎంఫార్మసీ, ఎమ్మెస్సీ పూర్తి చేసినవారు ఉండడం విశేషం. అందులో విద్యార్థినులు ఎక్కువ మంది ఉన్నారు. ఉపాధ్యాయ కొలువలకు అర్హత ఉండే బీఈడీ చేసిన వారు సైతం తాజాగా డీఎల్‌ఐఈడీ కోర్సులో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు.
326 సీట్లు..
హనుమకొండతో పాటు నర్సంపేట, వరంగల్, హనుమకొండలో మరో నాలుగు ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. మొత్తం 326 సీట్లు ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన డీసెట్ ద్వారా డైట్ కళాశాలల్లో లేదా ప్రైవేట్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్లలో సీట్లు కేటాయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులుగా నియమితులవడానికి ఈ కోర్సు ప్రాథమిక అర్హత అయినప్పటికీ డీఎస్సీ, లేదా టీఆర్‌టీ ద్వారా వచ్చే పోస్టులకు పోటీ ఎక్కువగా ఉంటోంది.
ప్రభుత్వ రంగంలోనే కాకుండా ప్రైవేటు పాఠశాలలు, డేకేర్ సెంటర్లు, ప్రీ స్కూల్స్‌లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు మంచి డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ప్రీ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తుండడంతో ఈ సారి డీఈఎల్‌ఐడీకి డిమాండ్ మరింత పెరిగింది. ప్రీస్కూల్స్‌ను విస్తరించడంతో పాటు వాటిని బలోపేతం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్న నేపథ్యంలో విద్యార్థులు ఎక్కువగా ఈ కోర్సుల చేరడానికి మొగ్గు చూపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో గొప్ప మైలురాయి
Read Latest AP News And Telangana News And International News And Telugu News