Share News

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం

ABN , Publish Date - Jun 03 , 2026 | 11:14 AM

కేంద్ర విద్యా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఎస్ఈకి కొత్త చీఫ్, కార్యదర్శులను నియమించింది.

సీబీఎస్ఈ నూతన చీఫ్‌గా ప్రశాంత్ సీతారామ్ నియామకం
CBSE New Chairman Prashant Sitaram

ఇంటర్నెట్ డెస్క్: ఆన్-స్క్రీన్ మార్కింగ్(OSM) విధానంపై వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(CBSE) నూతన చీఫ్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి లోఖండే ప్రశాంత్ సీతారామ్‌ను నియమించింది. అలాగే.. ఐఐఎస్ ఆఫీసర్, సీనియర్ బ్యూరోక్రాట్ అయిన వరుణ్ భరద్వాజ్‌కు సీబీఎస్ఈ కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో సీబీఎస్ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాన్షు గుప్తాలను జాతీయ విద్యా మండలి నుంచి బదిలీ చేసిన కొన్ని గంటలకే ఈ నియామకాలు జరిగాయి.


అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, ఇతర కేంద్రపాలిత ప్రాంతాల(AGMUT) కేడర్‌కు చెందిన 2001 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(IAS) అధికారి అయిన సీతారాం, ప్రస్తుతం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కాగా, 2008 ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(IIS) బ్యాచ్‌కు చెందిన భరద్వాజ్ ప్రస్తుతం విద్యా మంత్రిత్వ శాఖలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.


సీబీఎస్ఈ ఓఎస్ఎమ్ వ్యవస్థ సంబంధిత సేవలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం తాజాగా ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సామర్థ్య నిర్మాణ కమిషన్ ఛైర్‌పర్సన్ ఎస్.రాధా చౌహాన్ నేతృత్వం వహించనున్నారు. ఒక నెలలోగా సిబ్బంది, శిక్షణ విభాగానికి తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ ప్యానెల్‌కు అప్పగించింది. కాగా.. బోర్డు అప్‌లోడ్ చేసిన తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీలు తమ చేతిరాతతో సరిపోలడం లేదని కొంతమంది 12వ తరగతి విద్యార్థులు ఆరోపించిన నేపథ్యంలో సీబీఎస్ఈలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే.

CBSE Chariman Prashant Sitaram and Secretary Varun Bharadwaz.jpgCBSE Chariman Prashant Sitaram and Secretary Varun Bharadwaz


ఇవీ చదవండి:

సీబీఎస్ఈ పోర్టల్‌పై సైబర్ దాడి.. 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్

టీజీపీఎస్సీ నుంచి మరో జాబ్ నోటిఫికేషన్

Updated Date - Jun 03 , 2026 | 11:28 AM