Share News

ఇక్కడా... అక్కడా ఒకటి మిస్‌!

ABN , Publish Date - Oct 04 , 2026 | 02:02 AM

‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని అంటారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల పనితీరు, వారి వ్యవహార శైలిపై ప్రధాన రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు వ్యక్తంచేస్తున్న...

ఇక్కడా... అక్కడా ఒకటి మిస్‌!

రాజకీయ ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడంలో తెలంగాణ సీఎం చూపిస్తున్న తెగువను ఏపీ సీఎం చంద్రబాబు ఒంటబట్టించుకోవాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు భావిస్తూ ఉండగా.. నాయకులు, కార్యకర్తలను కలుపుకొని వెళ్లడంలో చంద్రబాబును చూసి తమ సీఎం రేవంత్‌ నేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కోరుకుంటున్నారు.

రేవంత్‌లో అంతులేని తెగువ ఉంది. రాజకీయ రణ క్షేత్రంలో ప్రత్యర్థులను మాటలతో చీల్చి చెండాడడంలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన ఏ మాత్రం తీసిపోరు. అధికారంలో ఉండి కూడా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేయగల నేర్పరితనం రేవంత్‌ సొంతం. అయితే పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లడంలో మాత్రం ఆయనకు మైనస్‌ మార్కులే వేయాల్సి ఉంటుంది.

ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడల్లా రేవంత్‌ అఫెన్స్‌ మార్గాన్ని ఎంచుకుంటారు. రాజకీయాల్లోనే కాదు ఏ అంశంలోనైనా డిఫెన్స్‌లో ఉండటం కన్నా అఫెన్స్‌లో ఉండటమే వాంఛనీయం.

తెలంగాణ వనరులను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం ద్వారా తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల నుంచి ఆయన ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో అత్యధికులు రేవంత్‌ వ్యవహార శైలి పట్ల సంతోషంగా లేని మాట వాస్తవం. ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులలో ఏదో తెలియని అసంతృప్తి! ఎమ్మెల్యేలలో కూడా ఇదే పరిస్థితి. రాజకీయ ప్రత్యర్థులను అలవోకగా ఆత్మరక్షణలో పడవేయగలుగుతున్న రేవంత్‌ ఆయా సందర్భాలలో లౌక్యం కొరవడటం, అందరినీ కలుపుకొని వెళ్లలేక పోవడం వల్ల సొంత పార్టీ వ్యవహారాల్లో ఆత్మరక్షణలో పడుతున్నారు.

రాజకీయ గురువు చంద్రబాబుతో పోల్చితే రేవంత్‌లో తెగువ, తెంపరితనం ఎక్కువ. అయితే సహనం విషయంలో మాత్రం రేవంత్‌ చంద్రబాబుకు సరిరారు. భూదేవికి ఉన్నంత ఓర్పు చంద్రబాబుకు ఉంటుంది. రాజకీయంగా తనను తీవ్రంగా దూషించే వాళ్లను కూడా కలుపుకొని వెళ్లగల నేర్పు, ఓర్పు ఆయన సొంతం.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు మాత్రమే చేస్తారు. రాజకీయమే శ్వాసగా జీవిస్తారు. సంక్షోభాలు ఎదురైనప్పుడు చురుగ్గా వ్యవహరిస్తారు. అధికారంలోకి వచ్చాక ఆయన రాజకీయాలకు ప్రాధాన్యం తగ్గించి ప్రభుత్వ వ్యవహారాల సమీక్షలకే తన సమయమంతా కేటాయిస్తారు. చంద్రబాబులోని ప్రధాన లోపం ఇదే!


‘పొరుగింటి పుల్లకూర రుచి’ అని అంటారు. తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల పనితీరు, వారి వ్యవహార శైలిపై ప్రధాన రాజకీయ పార్టీల అభిమానులు, కార్యకర్తలు వ్యక్తంచేస్తున్న అభిప్రాయాలు వింటున్నప్పుడు ఈ సామెత గుర్తుకువస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మెచ్చుకుంటూ ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు కోరుకుంటున్నారు. ఆయా పార్టీల నాయకులు, అభిమానులు తమ అధినేతల విషయంలో ఎందుకు పెదవి విరుస్తున్నారు? అని ప్రశ్నించుకుంటే ఇరువురు ముఖ్యమంత్రులూ తమ శ్రేణుల అభిమతానికి అనుగుణంగా వ్యవహరించడం లేదని భావించవలసి ఉంటుంది. రాజకీయ ప్రత్యర్థులను ఆత్మరక్షణలోకి నెట్టడంలో తెలంగాణ ముఖ్యమంత్రి చూపిస్తున్న తెగువను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒంటబట్టించుకోవాలని తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు భావిస్తూ ఉండగా.. నాయకులు, కార్యకర్తలను కలుపుకొనివెళ్లడంలో చంద్రబాబును చూసి తమ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కోరుకుంటున్నారు. నిజానికి ఇరువురు ముఖ్యమంత్రులలో ఎవరి బలాలు, ఎవరి బలహీనతలు వారికి ఉన్నాయి. ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విషయానికి వద్దాం. రేవంత్‌రెడ్డిలో అంతులేని తెగువ ఉంది. రాజకీయ రణ క్షేత్రంలో ప్రత్యర్థులను మాటలతో చీల్చి చెండాడడంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ఏ మాత్రం తీసిపోరు. అధికారంలో ఉండి కూడా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేయగల నేర్పరితనం రేవంత్‌రెడ్డి సొంతం. అయితే పార్టీలో అందరినీ కలుపుకొని వెళ్లడంలో మాత్రం ఆయనకు మైనస్‌ మార్కులే వేయాల్సి ఉంటుంది. తెలంగాణలో 22–ఎ పేరిట ప్రైవేటు భూములు, ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారన్న విమర్శలు జోరందుకున్న తరుణంలో కేసీఆర్‌ కుటుంబీకుల భూముల వివరాలు వెల్లడించి ప్రత్యర్థులకు సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి కల్పించారు. శాసనసభలో ఆయన ప్రతిపక్షాన్ని ఒంటిచేత్తో ఆత్మరక్షణలోకి నెట్టారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు ఫిదా అయిపోయారు. ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడల్లా రేవంత్‌రెడ్డి అఫెన్స్‌ మార్గాన్ని ఎంచుకుంటారు. రాజకీయాల్లోనే కాదు ఏ అంశంలోనైనా డిఫెన్స్‌లో ఉండటం కన్నా అఫెన్స్‌లో ఉండటమే వాంఛనీయం. ఈ ఫార్ములాను రేవంత్‌రెడ్డి తు.చ. తప్పకుండా అనుసరిస్తున్నారు.


అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడచిన సందర్భంలో అధికార పార్టీపై సహజంగానే ఆరోపణలు కమ్ముకుంటాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలకు కొదవలేదు. అయితే సదరు ఆరోపణల కంటే కేసీఆర్‌ కుటుంబంపై రేవంత్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలకే అధిక ప్రాచుర్యం లభిస్తోంది. తెలంగాణ వనరులను కేసీఆర్‌ కుటుంబం దోచుకుందని ప్రజలను నమ్మించే ప్రయత్నం ద్వారా తమ ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణల నుంచి ఆయన ప్రజల దృష్టి మళ్లిస్తున్నారు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ దగ్గర కేటీఆర్‌కు స్టార్‌ హోటళ్లు ఉన్నాయని ముఖ్యమంత్రి తాజాగా ఆరోపించారు. ‘అవును–2006లో నేను ప్రారంభించిన హోటల్‌ ఇప్పుడు మూడు హోటళ్లుగా విస్తరించింది’ అని కేటీఆర్‌ చెప్పుకోవలసి వచ్చింది. అంతకుముందు భూముల విషయంలో కూడా ఇదే జరిగింది. రాజకీయాల్లో ఎదురు దాడి అనే ఎత్తుగడను ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి మొదలెట్టారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్‌ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అదే బాటలో ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఆరోపణలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రత్యర్థులను వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం చేసే ఎత్తుగడలను కూడా రేవంత్‌రెడ్డి అమలుచేస్తున్నారు. బహుశా ఆయన ఈ ఎత్తుగడను ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నుంచి కాపీ కొట్టినట్టు ఉన్నారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. దీంతో నియోజకవర్గంలో పట్టు జారిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితి చంద్రబాబుకు ఎదురైంది. కుప్పంలో స్వేచ్ఛగా తిరగడానికి కూడా అప్పట్లో చంద్రబాబు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇదే వ్యూహాన్ని బీఆర్‌ఎస్‌ ముఖ్య నాయకులు కేటీఆర్‌, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, సిద్దిపేటల్లో అమలుకు పూనుకున్నారు. నిజానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌పై దృష్టి కేంద్రీకరించి 2018 ఎన్నికల్లో ఓడించారు. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి ఆ తర్వాత మల్కాజ్‌గిరి నుంచి ఎంపీ సీటుకు పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు కేసీఆర్‌–జగన్‌ బాటలో తన రాజకీయ ప్రత్యర్థులను వారి సొంత నియోజకవర్గాలకే పరిమితం చేసే పనిలో రేవంత్‌రెడ్డి ఉన్నారు.


ఈ కారణంగానే ఆయన సిరిసిల్లలో భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగసభలో ప్రసంగించారు. వర్తమాన రాజకీయాలలో నెట్టుకురావాలంటే ఏ రాజకీయ నాయకుడైనా ఇదే విధంగా వ్యవహరించాలి. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి పోకడలను, రాజకీయ ఎత్తుగడలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగుదేశం నాయకులు, శ్రేణులు అభినందిస్తున్నాయి. పొరుగు రాష్ర్టానికి చెందిన వారి అభినందనలు అందుకుంటున్న రేవంత్‌రెడ్డి, సొంత రాష్ట్రంలో సొంత పార్టీ శ్రేణులు, నాయకుల అభినందనలు అందుకోలేకపోవడానికి కారణం ఏమిటి? కాంగ్రెస్‌ పార్టీలో అత్యధికులు రేవంత్‌రెడ్డి వ్యవహార శైలి పట్ల సంతోషంగా లేని మాట వాస్తవం. ఒకరిద్దరు మినహా మిగతా మంత్రులలో ఏదో తెలియని అసంతృప్తి! ఎమ్మెల్యేలలో కూడా ఇదే పరిస్థితి. ఈ పరిస్థితికి కారణం ఏమిటి? అని కాంగ్రెస్‌ నాయకులను ప్రశ్నించగా ముఖ్యమంత్రి అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరినీ సంప్రదించడం లేదని చెబుతున్నారు. ఉదాహరణకు.. రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను తాజాగా ప్రకటించారు. ఈ అభ్యర్థులలో ఒకరు నల్లగొండ జిల్లాకు చెందిన వ్యక్తి. అయినా అభ్యర్థిని ప్రకటించే ముందు ముఖ్యమంత్రి తమతో మాట మాత్రమైనా చెప్పకపోవడం ఏమిటి? అని నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రులు కినుక వహించారు. ఆ మంత్రుల ఆవేదనలో అర్థం ఉంది. అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్‌ అధిష్ఠానమే ఖరారు చేసి ఉండవచ్చును గానీ పేర్లు ప్రకటించే ముందు, లేదా పేర్లు ప్రతిపాదించే సమయంలో సంబంధిత జిల్లా మంత్రులను సంప్రదించడం అభిలషణీయం. ఇలాంటి అంశాలలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రాంతీయ పార్టీలో వలె కాంగ్రెస్‌ పార్టీలో ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్కృతి కుదరదు. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ అయినప్పటికీ అభ్యర్థుల ఎంపిక సమయంలో చంద్రబాబు నాయుడు అందరినీ సంప్రదించడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి అంశాలలో చంద్రబాబును చూసి రేవంత్‌రెడ్డి నేర్చుకోవాలని తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కోరుతున్నారు. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి పలు సందర్భాలలో ఒంటరి పోరాటం చేయవలసి వచ్చింది. ముఖ్యమంత్రి తరఫున వకాల్తా పుచ్చుకొని మాట్లాడుతున్నది కూడా కొద్ది మందే. రాజకీయ ప్రత్యర్థులను అలవోకగా ఆత్మరక్షణలో పడవేయగలుగుతున్న రేవంత్‌రెడ్డి ఆయా సందర్భాలలో లౌక్యం కొరవడటం, అందరినీ కలుపుకొని వెళ్లలేకపోవడం వల్ల సొంత పార్టీ వ్యవహారాల్లో ఆత్మరక్షణలో పడుతున్నారు. రాజకీయ గురువు చంద్రబాబుతో పోల్చితే రేవంత్‌రెడ్డిలో తెగువ, తెంపరితనం ఎక్కువ. ఈ లక్షణాలే కలిసొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సహనం విషయంలో మాత్రం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు సరిరారు. భూదేవికి ఉన్నంత ఓర్పు చంద్రబాబుకు ఉంటుంది. రాజకీయంగా తనను తీవ్రంగా దూషించే వాళ్లను కూడా కలుపుకొని వెళ్లగల నేర్పు, ఓర్పు ఆయన సొంతం. ఈ అంశంలో రేవంత్‌రెడ్డి సొంత పార్టీ వాళ్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు.


గెలిచాకా.. రాజకీయం అవసరమే!

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయానికి వద్దాం. ఆయన వ్యవహార శైలిపై సొంత పార్టీ నేతలు ఎందుకు పెదవి విరుస్తున్నారు? ముఖ్యమంత్రిగా ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఉందో లేదో తెలియదు గానీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మాత్రం అసంతృప్తి ఉందని కచ్చితంగా చెప్పవచ్చు. ఈ పరిస్థితికి కారణాలు లేకపోలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు రాజకీయాలు వేరు.. అధికారంలో ఉన్నప్పుడు చేసే రాజకీయాలు వేరేగా ఉంటాయి. సూటిగా చెప్పాలంటే చంద్రబాబులో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన రాజకీయాలు మాత్రమే చేస్తారు. రాజకీయమే శ్వాసగా జీవిస్తారు. సంక్షోభాలు ఎదురైనప్పుడు చురుగ్గా వ్యవహరిస్తారు. అధికారంలోకి వచ్చాక ఆయన రాజకీయాలకు ప్రాధాన్యం తగ్గించి ప్రభుత్వ వ్యవహారాల సమీక్షలకే తన సమయమంతా కేటాయిస్తారు. చంద్రబాబులోని ప్రధాన లోపం ఇదే! ఇటీవల జరిగిన ఎంపీల సమావేశంలో ఈ విషయాన్ని ఆయనే స్వయంగా అంగీకరించారట. ‘అదేమిటో గానీ అధికారంలోకి రాగానే నా మనసంతా సమీక్షల వైపే వెళుతుంది’ అని చంద్రబాబు స్వయంగా చెప్పుకొన్నారట. ఈ కారణంగా ప్రత్యర్థులను ఆత్మరక్షణలో పడవేయగల ఎత్తుగడల గురించి అధికారంలో ఉన్నప్పుడు ఆయన పెద్దగా దృష్టి పెట్టరు. రేవంత్‌రెడ్డి వలె ఆయా సందర్భాలలో చంద్రబాబు తెగువ ప్రదర్శించడం లేదని తెలుగుదేశం అభిమానులు భావిస్తుంటారు. తెలంగాణలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అంత బలంగా లేదు. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు వీరంగం వేయగలుగుతున్నారంటే అందుకు ప్రభుత్వ మెతక వైఖరే కారణం అన్న భావన తెలుగుదేశం శ్రేణుల్లో ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ నాయకులకు చంద్రబాబు నిరంతరం అందుబాటులో ఉంటారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులకు మాత్రమే అందుబాటులో ఉంటారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల మాట ఆయనకు శిరోధార్యంగా ఉంటుంది. అలా అని కట్టు తప్పిన మంత్రులు, ఎమ్మెల్యేలను కట్టడి చేస్తారా అంటే అదీ లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు అధినేతను కలిసే అవకాశం పొందిన వాళ్లు, ఫోన్ల ద్వారా మాట్లాడగలిగిన వాళ్లు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అవకాశాన్ని కోల్పోతున్నారు. కలసి మాట్లాడటానికే చంద్రబాబు సమయం ఇవ్వడం లేదని, పదే పదే కోరగా కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేశ్‌ను కలవమని సూచిస్తున్నారని, అక్కడకు వెళితే జోనల్‌ కోఆర్డినేటర్లను కలుసుకోవలసిందిగా సూచిస్తున్నారని సీనియర్‌ ఎమ్మెల్యేలు సైతం వాపోతున్నారు.


వివాహాది శుభకార్యాలలో పాల్గొనడానికి హైదరాబాద్‌ వస్తున్న తెలుగుదేశం నాయకులు ఈ విషయమై తెలంగాణకు చెందిన పాత మిత్రుల వద్ద గోడు వెళ్లబోసుకుంటున్నారు. కార్యకర్తల వేదన మరో లెవల్లో ఉంటోంది. జగన్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కష్టనష్టాలకు ఓర్చి పార్టీని అంటిపెట్టుకొని ఉన్న తమను ఇప్పుడు పట్టించుకునే వారే లేరని పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. వారి ఆవేదనలో అర్థం ఉంది. 2019లో పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు అధికారం చలాయిస్తున్న పలువురు మంత్రులు, శాసనసభ్యులు పక్క చూపులు చూసినప్పటికీ కార్యకర్తలు మాత్రమే నిలబడ్డారు. కొవిడ్‌ కారణం వల్ల అయితేనేమి, జగన్‌రెడ్డి భయపెట్టడం వల్ల అయితేనేమి ఓడిపోయిన మూడేళ్ల వరకు పార్టీ నాయకులు బయటకు రాలేదు. ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు కార్యకర్తలు పోటెత్తిన తర్వాత నాయకుల్లో ఆత్మస్థైర్యం ఏర్పడి బయటకు వచ్చారు. కష్ట కాలంలో పార్టీని గ్రామాలలో నిలబెట్టిన తమ ఆలనా పాలనా పట్టించుకునేవారు కనిపించడం లేదని కార్యకర్తలు వాపోతుండగా, సీనియర్లుగా ఉన్న తమకు కూడా చంద్రబాబును కలుసుకొనే అవకాశం లభించకపోవడం ఏమిటి? తమకంటే ఎంతో జూనియర్లు అయిన జోనల్‌ కోఆర్డినేటర్లను కలవాల్సిన దుస్థితి ఏమిటి? అని సీనియర్‌ నాయకులు వాపోతున్నారు. అధినేత చంద్రబాబును కలుసుకుని కష్టసుఖాలు చెప్పుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? సమస్య పరిష్కారం కాకపోయినా కనీసం చెప్పుకొనే అవకాశమైనా లభించకపోవడం పార్టీకి మంచి చేయదు. ఎ లీడర్‌ మస్ట్‌ బి లీజర్‌ అండ్‌ ఇంటెలిజెంట్‌ అంటారు. నాయకుడు క్షణం తీరిక లేకుండా ఉండటం ఏమిటి? పార్టీ ఓడిపోయినప్పుడు అధికారులు ఎవరూ పక్కన ఉండరు. కార్యకర్తలే అండగా నిలబడతారు. ఈ వాస్తవాన్ని అధినేత చంద్రబాబు విస్మరిస్తున్నారని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమను ఇబ్బందిపెట్టిన వారిపై కసి తీర్చుకోవాలని తెలుగుదేశం కార్యకర్తలు కోరుకుంటున్నారు. ఈ కారణంగానే తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి వలె తమ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తెగువ ప్రదర్శించాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోరుకుంటున్నాయి.


రప్పా.. రప్పాకు జవాబేదీ?

‘నేను తలచుకుంటే చర్యలు తీసుకోవడానికి నిమిషం పట్టదు. నన్ను జైల్లో పెట్టినట్టుగా జగన్‌రెడ్డిని జైలుకు పంపడం ఎంతసేపు?’ అని చంద్రబాబు తరచుగా అంటుంటారు. జగన్‌రెడ్డి సంగతి తర్వాత, కింది స్థాయి నాయకులు నోరుపారేసుకుంటున్నప్పటికీ కనీస చర్యలు లేకపోవడం ఏమిటి? జగన్‌ తిరిగి అధికారంలోకి వస్తే రప్పా రప్పా అని వైసీపీ శ్రేణులు బెదిరిస్తున్నప్పటికీ అధికారంలో ఉండి కూడా పక్కకు తప్పుకోవలసి వస్తోందని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. జగన్‌రెడ్డి పాలనలో చేసినట్టుగా అరాచకంగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వం అంటే కనీస భయం ఉండాలి కదా? అధికారంలో ఉండి భయపడాల్సిన దుస్థితి ఏమిటి? అని తెలుగుదేశం శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. వైసీపీ నుంచి ప్రభుత్వానికి సవాళ్లు ఎదురవుతున్నాయి గానీ, ప్రభుత్వం నుంచి ప్రతిపక్షానికి సవాళ్లు విసరలేకపోవడం ఏమిటి? అనే ప్రశ్నను పార్టీ వర్గాలు సంధిస్తున్నాయి. ఈ కారణంగానే రేవంత్‌రెడ్డి పోకడలను తెలుగుదేశం శ్రేణులు అభిమానిస్తున్నాయి. ఏ పార్టీకైనా కళ్లు.. చెవులు కార్యకర్తలే. అలాంటప్పుడు అధికారుల మాటకు ఇచ్చే విలువను కష్ట కాలంలో పార్టీని నిలబెట్టిన కార్యకర్తలు, నాయకులకు ఇవ్వకపోవడం ఏమిటి? అని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. కూటమి నాయకుల మధ్య సమన్వయంతో ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు, సొంత పార్టీలో అసంతృప్తిని తొలగించలేరా? కార్యనిర్వాహక అధ్యక్షుడిగా లోకేశ్‌ నియమితుడైనప్పటికీ పార్టీ శ్రేణులు మాత్రం అప్పుడప్పుడైనా అధినేత చంద్రబాబును కలుసుకోవాలనే కోరుకుంటాయి. ఎన్టీఆర్‌ హయాంలో చంద్రబాబు అందుబాటులో ఉన్నప్పటికీ ఎన్టీఆర్‌ను కలసి మాట్లాడిన తర్వాతే నాయకులు, కార్యకర్తలు తృప్తిగా తిరిగి వెళ్లేవారు. ఈ విషయం చంద్రబాబుకు తెలియంది కాదు. పార్టీ శ్రేణుల మనోగతం తెలుసుకొనే ప్రయత్నం చేయకుండా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎన్ని ప్రాజెక్టులు తెచ్చినా, ఎన్ని పెట్టుబడులు తెచ్చినా అవి ఓట్లు తెచ్చి పెట్టవు. కొంత మంది ఎమ్మెల్యేల అరాచకపు పోకడల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా లోపాలు సరిదిద్దుకొనే ప్రయత్నం చేయాలి. లేని పక్షంలో రాజకీయంగా నష్టపోవలసి వస్తుంది.


1999లో రెండవ పర్యాయం ఎందుకు గెలిచాం? 2019లో ఎందుకు గెలవలేకపోయాం? అని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాజకీయం అంటే ఉరుకులూ పరుగులూ కాదు. ప్రతిపక్షానికి ఎజెండా సెట్‌ చేయాలి గానీ, ప్రతిపక్షమే ప్రభుత్వానికి ఎజెండా సెట్‌ చేయడం ఏమిటి? ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనితీరుకు కొత్తగా సర్టిఫికెట్‌ అవసరం లేదు. శుక్రవారంనాడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేతుల మీదుగా లక్ష కోట్లు ఖర్చయ్యే హార్టికల్చర్‌ హబ్‌ రాయలసీమలో ప్రారంభం కావడమే చంద్రబాబు పనితీరుకు నిదర్శనం. ఇలాంటివి సాధించడం ఆయనకు మాత్రమే సాధ్యం. ఇప్పుడు చంద్రబాబు రుజువు చేసుకోవాల్సింది వేరే ఉంది. ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఆయన రాజకీయాన్ని వదలరు, మళ్లీ మళ్లీ అధికారంలోకి రావడానికి వ్యూహ రచనకు ప్రాధాన్యమిస్తారు అని రుజువు చేసుకోవాలి. అధికారిక సమీక్షలు తగ్గించుకొని క్షేత్ర స్థాయి పరిస్థితులు తెలుసుకోవడానికి పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుసుకోవాలి. పొరుగింటి పుల్లకూర రుచి అన్న సామెత ఉన్నట్టుగానే ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ సామెత కూడా ఉంది. చంద్రబాబు అయినా, రేవంత్‌రెడ్డి అయినా ఈ సామెతను ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ‘ఇంట్లో ఈగల మోత.. బయట పల్లకీ మోత’ అన్నట్టుగా మిగలకూడదు. తస్మాత్‌ జాగ్రత్త!

ఆర్కే

ఈ వార్తలు కూడా చదవండి..

రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు

కృష్ణమ్మా..కడ వరకూ సాగమ్మా..!

ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్

Read Latest AP News And Telangana News And National News

Updated Date - Oct 04 , 2026 | 02:22 AM