Share News

వశిష్ఠ వారధికి టెండర్లు ఖరారు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:23 AM

పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను కలుపుతూ రాజుల్లంక – రామేశ్వరం మధ్య నిర్మించ తలపెట్టిన వంతెన టెండర్లు ఖరారయ్యాయి. గత నెల 18న అధికారులు ఈ టెండర్లను తెరిచారు.

వశిష్ఠ వారధికి టెండర్లు ఖరారు
వారధి ఊహాచిత్రం

రెండేళ్లలో రాజుల్లంక–రామేశ్వరం వంతెన, 25 కి.మీ బైపాస్‌ పనులు పూర్తిచేయాలి

రూ.416 కోట్ల అంచనా.. రూ.299 కోట్లకే టెండరు దక్కించుకున్న బీఆర్‌కే సంస్థ

నరసాపురం, అక్టోబ రు 3(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాలను కలుపుతూ రాజుల్లంక – రామేశ్వరం మధ్య నిర్మించ తలపెట్టిన వంతెన టెండర్లు ఖరారయ్యాయి. గత నెల 18న అధికారులు ఈ టెండర్లను తెరిచారు. రూ.416 కోట్ల అంచనాతో జాతీయ రహదారుల సంస్థ అధికారులు టెండర్లు ఆహ్వానించగా, నాలుగు నిర్మాణ సంస్థలు పోటీపడ్డాయి. వీటిలో బీఆర్‌కే సంస్థ అత్యంత తక్కువగా.. రూ.299 కోట్లకే టెండర్‌ దాఖలు చేసింది. అతి తక్కువ మొత్తానికి కోట్‌ చేయడంతో నేషనల్‌ హైవే అధికారులు ఈ టెండర్‌కు ఆమోదం తెలిపారు. త్వరలోనే ఆ సంస్థతో అధికారికంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది.

రెండేళ్లలోగా పనులు పూర్తి..

ఒప్పంద ప్రక్రియ పూర్తికాగానే బీఆర్‌కే సంస్థకు నిర్మాణ పనులు చేపట్టే స్థలాన్ని అధికారులు అప్పగిం చనున్నారు. జాతీయ రహదారుల సంస్థ, సదరు నిర్మాణ సంస్థ మధ్య ఒప్పందం పూర్తయిన నాటి నుంచి రెండేళ్లలో వంతెన పనులను పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ డివిజన్‌ స్థాయి అధికారి ఒక రు ఆంధ్రజ్యోతికి తెలియజేశారు. త్వరలోనే క్షేత్ర స్థాయిలో పనులు ప్రారంభించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ప్రాజెక్టు లో భాగంగా వంతెనతోపాటు బైపాస్‌ రోడ్డును నిర్మించనున్నారు. కోనసీమ జిల్లా పరిధిలోని గుడిమెళ్లలంక నుంచి మలికిపురం, రామేశ్వరం, రాజు ల్లంక వంతెన మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి 214వ నంబరు జాతీయ రహదారికి అనుసంధానం గా ఈ బైపాస్‌ రానుంది. ఇది సీతారాంపురం వద్ద ప్రధాన జాతీయ రహదారితో కలుస్తుంది. సుమారు 25 కిలోమీటర్ల మేర నిర్మించే ఈ బైపాస్‌ రహదారి పనులను వంతెన దక్కించుకున్న సంస్థే పూర్తి చేయాలి. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో బైపాస్‌ రహదారికి అవసరమైన భూసేకరణ పూర్తయింది. నిర్వాసిత రైతులకు పరిహారం చెల్లించారు. ఈ కారణంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పనులు ప్రారంభమై, నిర్ణీత గడువులోపు ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Oct 04 , 2026 | 12:23 AM