వాగులే దారులు
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:18 AM
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ గంగవరం, దుప్పులవాడ పంచాయతీ డి. అగ్రహారం వద్ద వాగులపై వంతెనలు కొట్టుకుపోయి పది రోజులు గడిచినా ఇంతవరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు.
వర్షాలకు రెండుసార్లు కొట్టుకుపోయిన గంగవరం వంతెన
వరద ఉధృతి తగ్గిన చేపట్టని తాత్కాలిక వంతెన పనులు
రాకపోకలకు ఇబ్బంది పడుతున్న 25 గ్రామాల గిరిజనులు
వాగు నీటిలోనే ప్రాణాలకు తెగించి రాకపోకలు
సీలేరు, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి):
జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీ గంగవరం, దుప్పులవాడ పంచాయతీ డి. అగ్రహారం వద్ద వాగులపై వంతెనలు కొట్టుకుపోయి పది రోజులు గడిచినా ఇంతవరకు పునరుద్ధరణ చర్యలు చేపట్టలేదు. దీంతో గంగవరం, డి.అగ్రహారం వాగుల అవతల ఉన్న 25 గ్రామాల ప్రజల రాకపోకలకు అవస్థలు తప్పడం లేదు. తీవ్ర వాయుగుండంతో కురిసిన భారీ వర్షాలకు వాగులపై ఉన్న గంగవరం, డి.అగ్రహారం వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే వరద ఉధృతి తగ్గి పది రోజులు గడుస్తున్నా..వాగుల అవతల ఉన్న ప్రజల రాకపోకలకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. కనీసం తాత్కాలిక చర్యలైనా చేపట్టకపోవడంపై ఈ ప్రాంత గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గంగవరం వాగు వద్ద వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశాలతో అధికారులు కంటితుడుపు చర్యగా తూరలను, ఎక్స్‌కవేటర్‌ని తీసుకువచ్చి తాత్కాలిక రోడ్డు వేశారు. సెప్టెంబరు 23వ తేదీన కురిసిన వర్షాలకు వాగు ఉధృతికి ఆ వంతెన కూడా కొట్టుకుపోవడంతో అధికారులు తూరలను ఎక్స్‌కవేటర్‌తో తెచ్చి హడావిడి చేసి వెళ్లిపోయేరే తప్ప పనులు ఏవీ చేయలేదని గిరిజనులు వాపోయారు. అప్పటి నుంచి ఇప్పటివరకు అక్కడ ఎటువంటి పనులు చేపట్టలేదు. దీంతో ప్రాణాలకు తెగించి వాగులో నడుచుకుంటూ రాకపోకలు సాగిస్తున్నారు. కొంతమంది ద్విచక్రవాహనాలతో వాగులోని నీటిలో దిగి రావలసి వస్తోంది. అదే రాత్రి వేళల్లో ఏదైనా అత్యవసరమైతే మా పరిస్థితి ఏమిటని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. కనీసం తాత్కాలికంగా అయినా రాకపోకలను పునరుద్ధరిస్తే అత్యవసరవేళలో ప్రజల రాకపోకలకు కాస్త ఊరటగా ఉంటుందని వారంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు యుద్ధప్రాతిపదికన గంగవరం, డి.అగ్రహారం వాగులపై శాశ్వత వంతెనల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంతీయులు కోరుతున్నారు.