Share News

కృష్ణమ్మా..కడ వరకూ సాగమ్మా..!

ABN , Publish Date - Oct 04 , 2026 | 01:37 AM

శ్రీసత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను సెప్టెంబరు 12వ తేదీన పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు విడుదల చేశారు. అక్కడి నుంచి మొదలైన ప్రవాహం పీటీఎం మండలం బొంతలపల్లె వద్ద అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించాయి. బొంతలపల్లె చెరువు మొదలు కుప్పంలోని చివరి పరమసముద్రం చెరువును నింపుతున్నారు.

కృష్ణమ్మా..కడ వరకూ సాగమ్మా..!
చెర్లోపల్లె రిజర్వాయర్‌ నుంచి వస్తున్న కృష్ణమ్మ

- శ్రీశైలం టు కుప్పానికి కృష్ణా జలాల పరవళ్లు

- ఎస్‌.ఎ్‌స.ట్యాంకులు, చెరువులు, కుంటలకు చేరుతున్న నీరు

హంద్రీ-నీవా కాలువ ద్వారా కృష్ణమ్మ పరవళ్లు కొనసాగుతున్నాయి. శ్రీశైలంలో ప్రారంభమైన నీటి ప్రవాహం కుప్పం వరకూ కొనసాగుతోంది. తాగునీటి ప్రాధాన్యమైన చెరువులు, కుంటలకు తూము, సైఫన్‌ టెక్నాలజీలో పైపుల ద్వారా నింపుతున్నారు. సీజన్‌ చివరి వరకూ ప్రవాహం కొనసాగి గమ్య స్థానాన్ని కృష్ణమ్మ స్పర్శిస్తుందా? అంటే ఎవరూ ఽకచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

మదనపల్లె, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను సెప్టెంబరు 12వ తేదీన పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు విడుదల చేశారు. అక్కడి నుంచి మొదలైన ప్రవాహం పీటీఎం మండలం బొంతలపల్లె వద్ద అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించాయి. బొంతలపల్లె చెరువు మొదలు కుప్పంలోని చివరి పరమసముద్రం చెరువును నింపుతున్నారు. మధ్యలోని పీటీఎం పెద్దచెరువు, బి.కొత్తకోటలోని కానుగలకుంట, కురబలకోట మండలంలోని తెట్టువంక నుంచి మదనపల్లె మండలంలోని సీటీఎం చెరువుకు, అలాగే కురబలకోటలోని రంగమ్మచెరువుకు వెళ్తున్నాయి. మదనపల్లెలోని అమ్మచెరువుకు, మదనపల్లె మండలంలోని చిప్పిలి, గుట్టకిందపల్లె ఎస్‌.ఎ్‌స.ట్యాంకులకు ఓటీ(తూము) ద్వారా, మిగిలిన వాటికి సైఫన్‌ టెక్నాలజీతో విడతల వారీగా నింపుతున్నారు. మరోవైపు బసినికొండలోని నక్కలకుంట, పొంతల చెరువు, పుంగనూరు మండలంలోని ఈడిగపల్లె చెరువుకు చేరుతున్నాయి. పుంగనూరులోని పుంగమ్మ చెరువులోని ఎస్‌.ఎ్‌స.ట్యాంకుకు, ఇక కుప్పం బ్రాంచి కెనాల్‌పై శాంతిపురం మండలంలో తాగునీటి అవసరాలకు చిన్నపాటి చెరువులు, కుంటలకు మళ్లించారు. తాగునీటి అవసరాలు తీరేలా, వ్యవసాయ బోర్లు రీచార్జి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం కాలువ వెంబడి అధికారుల పర్యవేక్షణతో చుక్కనీరు వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

గమ్య స్థానం చేరికపై అనుమానాలు

కృష్ణా జలాలు గమ్య స్థానం వరకు కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ప్రధాన ఆధారమైన శ్రీశైలం నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా నీటిని తోడేస్తోంది. విద్యుత్తు ఉత్పత్తి పేరుతో వృథా చేస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో 15 రోజుల్లో శ్రీశైలం నుంచి పరిగెత్తే కృష్ణమ్మ పరవళ్లకు బ్రేక్‌పడే అవకాశం ఉందని హంద్రీ-నీవా అధికారులు చెబుతున్నారు. శ్రీశైలం నుంచి ప్రధాన కాలువ ద్వారా 2,800 క్యూసెక్కులు తీసుకుంటున్నా అనంతపురం జిల్లాలోని జీడిపల్లె రిజర్వాయర్‌కు రెండువేల క్యూసెక్కులకు మించి రాలేదు. అక్కడి నుంచి జిల్లాకు ప్రధాన సోర్సుగా చెబుతున్న చెర్లోపల్లెకు 350 క్యూసెక్కులు మాత్రమే విడుదల చేస్తున్నారు. అక్కడి నుంచి మదనపల్లె ప్రాంతానికి 200 క్యూసెక్కులు, కుప్పానికి వెళ్లే పాటికి 120 క్యూసెక్కులకు పడిపోయింది. మఽధ్యలోని చెరువులు, కుంటలకు మూడు క్యూసెక్కుల నుంచి 20 క్యూసెక్కులను పంపుతున్నారు. దీనికితోడు సరఫరాలో నష్టాలు వెరసి పూర్తిస్థాయిలో ఏ వనరునూ నింపే పరిస్థితి కనిపించలేదు. ప్రస్తుతం విడతల వారీగా చెరువులు, కుంటలను నింపుతున్నట్లే..అంతవరకూ ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితులు కళ్లముందు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేయడంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా అటు శ్రీశైలం, ఇటు చెర్లోపల్లె రిజర్వాయర్‌లో నీటి లభ్యత ఆధారంగా కృష్ణమ్మ ప్రవాహం కొనసాగనుంది.

Updated Date - Oct 04 , 2026 | 01:37 AM