వారికి డప్పులే లేవు
ABN , Publish Date - Oct 04 , 2026 | 12:20 AM
More Applications for pensions కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించిన వేళ.. పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం సౌండ్‌బాక్స్‌లు, డీజేలు వచ్చిన తర్వాత డప్పు కళాకారులు ఆదరణ కోల్పోయారు. అలాగే చెప్పులు కుట్టే చర్మకారులు కూడా సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన చర్మ, డప్పు కళాకారులకు ప్రతినెలా రూ.4వేల చొప్పున పింఛన్ అందజేస్తోంది.
అయినా పింఛన్ల కోసం దరఖాస్తులు
కుప్పలు తెప్పలుగా వచ్చిన వైనం
క్షుణ్నంగా పరిశీలిస్తున్న అధికారులు
అర్హులను గుర్తించే పనిలో నిమగ్నం
మెళియాపుట్టి, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి):
మెళియాపుట్టి మండలం చాపర గ్రామంలో కొత్త పింఛన్ల కోసం 25 మంది డప్పు కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు. వాస్తవానికి ఇక్కడ డప్పు వాయించే కళాకారులు లేరు. అసలు వాయించటానికి డప్పులే లేవు. ఈ నేపథ్యంలో పింఛన్ల కోసం డప్పు కళాకారుల ఎంపికపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.
కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించిన వేళ.. పలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ప్రస్తుతం సౌండ్‌బాక్స్‌లు, డీజేలు వచ్చిన తర్వాత డప్పు కళాకారులు ఆదరణ కోల్పోయారు. అలాగే చెప్పులు కుట్టే చర్మకారులు కూడా సరైన ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 50 ఏళ్లు నిండిన చర్మ, డప్పు కళాకారులకు ప్రతినెలా రూ.4వేల చొప్పున పింఛన్ అందజేస్తోంది. ఇటీవల కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించగా.. చాలామంది అక్రమ మార్గాలు అనుసరించారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 1,840 మంది చర్మ, డప్పు కళకారులకు పింఛన్లు అందజేస్తున్నారు. కొత్తగా 1,398 మంది దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కాగా వైసీపీ పాలనలో కొంతమంది అనర్హులు.. డప్పు కళాకారుల గుర్తింపు కార్డులు పొందారు. ప్రస్తుతం ఆ కార్డులతోనే కొంతమంది దరఖాస్తు చేసుకున్నారు. మరికొందరు గుర్తింపు కార్డులు లేకపోయినా డిక్లరేషన్ ఇచ్చి.. పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారు. అలాగే కొంతమంది చెప్పులు కుట్టడం రాకపోయినా పింఛన్ కోసం అడ్డదారులు తొక్కుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా, మండల కేంద్రాల్లో చెప్పులు కుట్టే వ్యక్తుల వద్దకు కొంతమంది వెళ్లి.. వారికి రూ.500 ఇచ్చి అక్కడ ఫొటో దిగారు. మరికొందరు డప్పులు అద్దెకు తెచ్చి.. వాటిని వాయిస్తున్నట్టు ఫొటో తీసుకున్నారు. ఆ ఫొటోలతోపాటు ఏడేళ్లుగా చర్మ, డప్పు కళాకారులుగా కొనసాగుతున్నట్టు న్యాయవాది వద్ద సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాన్ని పొందారు. వీటిని జతచేసి.. స్థానిక నాయకుల సహకారంతో.. పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు పరిశీలనకు రాగా.. అద్దె డప్పులు తీసుకువస్తున్నారు. ఇటువంటి అనర్హులను తొలగించి.. అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అనర్హులను తొలగించి.. అర్హులకు పింఛన్లు మంజూరు చేయాలని పలువురు దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఈ విషయమై మెళియాపుట్టి ఎంపీడీవో ప్రసాద్‌పండా వద్ద ప్రస్తావించగా.. ‘చర్మ, డప్పు కళాకారుల పింఛన్ల దరఖాస్తులను పరిశీలిస్తున్నాం. గ్రామాల్లో విచారణ చేస్తున్నాం. సరైన ధ్రువపత్రాలు చూపిన వారికే పింఛన్లు మంజూరు చేస్తామ’ని తెలిపారు.