అంగట్లో టీటీడీ టికెట్లు
ABN , Publish Date - Jul 28 , 2026 | 09:27 AM
ఒకాయన టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు. మరొకాయన వైసీపీ నేత. టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడితోనూ, ఆయన పీఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు.
దుకాణం పెట్టిన వైసీపీ నేత కుమారుడు
వీఐపీ బ్రేక్ దర్శనానికి 25 నుంచి 30 వేలు
ప్రత్యేక దర్శనానికి 2-5 వేలు వసూలు
(గుంటూరు-ఆంధ్రజ్యోతి)
ఒకాయన టీడీపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు. మరొకాయన వైసీపీ నేత. టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడితోనూ, ఆయన పీఏతోనూ వైసీపీ నేత కుమారుడు సన్నిహితంగా ఉంటారు. ఎవరైనా తిరుమల వెంకన్న దర్శనం టికెట్ల సిఫారసు కోసం సదరు టీటీడీ బోర్డు సభ్యుడిని కలిస్తే పని జరగదు. వైసీపీ నేత కుమారుడ్ని కలవాలని అక్కడున్నవారు చెబుతారు. ఇంకేముంది... వైసీపీ నేత కొడుకు దుకాణం పెట్టేశారు. వీఐపీ బ్రేక్ దర్శనానికి ఇంత.. ప్రత్యేక (సుపథం) దర్శనానికి ఇంత అంటూ రేటు కట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు.
పల్నాడు జిల్లాలోని గురజాల ఇందుకు వేదికైంది. గురజాలకు చెందిన వైసీపీ ముఖ్య నేత కుమారుడు చాలామంది వద్ద వీఐపీ దర్శనం కోసం రూ.25 వేల నుంచి రూ.30 వేలు, ప్రత్యేక దర్శనం కోసం రూ.2వేలు నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారం తాజాగా బయటపడింది. వీఐపీ దర్శనం కోసం భక్తుల నుంచి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు వసూలు చేసిన వైసీపీ నేత కుమారుడు ఊరి నుంచి పరారయ్యారు. దాంతో డబ్బులు ఇచ్చిన వాళ్లు లబోదిబోమంటూ రోడ్డెక్కారు. అక్కడ తీగ లాగితే అసలు డొంక కదిలింది.
ప్రస్తుతం ఈ వ్యవహారం గురజాల నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారింది. కూటమి నాయకులు సైతం టీటీడీ దర్శనం సిఫారసు లెటర్ కోసం వెళితే ఇప్పుడు ఖాళీ లేదు.. రెండు, మూడు నెలలు తర్వాత రండి అని సమాధానం చెబుతూ.. ఇలా బ్రోకర్లను ఏర్పాటు చేసుకొని టికెట్లు అమ్మకానికి పెట్టడంపై నిరసన వ్యక్తమవుతోంది. తిరుపతి టికెట్ల సిఫారసుల బాగోతం బయటకు పొక్కడంతో వైసీపీ నేతలు అప్రమత్తమయ్యారు. నగదు తీసుకున్న వారి ఇళ్లకెళ్లి సొమ్ము తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
నకిలీ టీటీడీ టికెట్లతో భక్తులకు టోకరా
శావల్యాపురం: తిరుమలలో వెంకన్న దర్శనానికి, సేవకు టికెట్లు ఇప్పిస్తానని ఓ వ్యక్తి భక్తులను నమ్మించి నకిలీ టికెట్లు ఇచ్చి మోసం చేశాడు. భక్తులు తిరుమలకు వెళ్లాక అసలు విషయం తెలిసింది. పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కొత్తలూరులో ఈ ఘటన జరిగింది. ఇటీవల కొత్తలూరుకు చెందిన 26మంది భక్తులు తిరుమలకు వెళ్లేందుకు సిద్ధం కాగా.. పాపిశెట్టి శ్రీనివాసరావు తిరుమలలో తనకు తెలిసినవారున్నారని, దర్శనం టికెట్లు, సేవా టికెట్లు ఇప్పిస్తానని చెప్పాడు. దీంతో ఒక్కొక్కరూ రూ.2వేలు చొప్పున ఆయనకు ఇచ్చారు. ఆయన వారికి టికెట్లు ఇచ్చాడు. తిరుమలకు వెళ్లాక కౌంటర్‌లో టికెట్లు చూపించగా.. అవి నకిలీ టికెట్లని తేలింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News