TG News: బిర్యానీ తిని వస్తూ.. అడవి పందిని తప్పించబోయి..
ABN , Publish Date - Jan 03 , 2026 | 07:49 AM
బిర్యానీ తిని ఇంటికి తిరిగి వస్తుండగా.. అడవి పంది అడ్డంగా రావడంతో దానిని తప్పించబోయి.. కారు బోల్తా కొట్టడంతో ఇద్దరు యువకులు దుర్మరణం పాలైన విషాద సంఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
- అదుపుతప్పి పల్టీ కొట్టిన కారు
- ఇద్దరు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
మహేశ్వరం: అడవి పందిని తప్పించబోయి ఓ కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన మహేశ్వరం పోలీస్ స్టేషన్(Maheshwaram Police Station) పరిధిలో చోటుచేసుకుంది. మహేశ్వరం ఎస్సై ప్రసాద్ కథనం ప్రకారం.. మండల పరిధిలోని పోరండ్ల గ్రామానికి చెందిన గిరి, శ్రీకాంత్, శివలు నూతన సంవత్సరం సందర్భంగా గురువారం రాత్రి స్వగామ్రమైన పోరండ్ల నుంచి మహేశ్వరం మండల కేంద్రానికి బిర్యానీ తినేందుకు కారులో వచ్చారు.

అక్కడ బిర్యానీ తిన్న తర్వాత తిరిగి పోరండ్లకు వెళ్తున్న క్రమంలో ఆక్సాన్‌పల్లి గేటు సమీపంలో రోడ్డు పైకి అడవిపంది ఒక్కసారిగా దూసుకు వచ్చింది. దానిని తప్పించబోయే క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్క గుంతలోకి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో గిరి (29), శ్రీకాంత్ (27)లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి(Osmania Hospital)కి తరలించారు. తీవ్ర గాయాలపాలైన శివను చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నువ్వేమీ టీచర్‌వి కాదు.. మాకు పాఠాలు చెప్పొద్దు
ఏవీవైఏవైకు రూ.2.91 కోట్లు విడుదల
Read Latest Telangana News and National News