3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటే..
ABN , Publish Date - Feb 05 , 2026 | 01:18 PM
మరో మూడు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా.. జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఉద్యోగులు దుర్మరణం చెందిన విషాద సంఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట హోలిక్రాస్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ శ్రీసిటీ ఉద్యోగులు దుర్మరణం చెందారు. పోలీసుల కథనం మేరకు శ్రీసిటీ ప్రైమరీ ఎలక్ర్టికల్ పరిశ్రమలో పనిచేసే తమిళనాడుకు చెందిన రాజశేఖర్ (33), సూళ్లూరుపేట గాండ్లవీధికి చెందిన గోపిశెట్టి శ్రావణి (31) విధి నిర్వహణ ముగించుకుని మోటారు సైకిల్‌పై వస్తుండగా హోలిక్రాస్ సర్కిల్ వద్ద జాతీయ రహదారిపై సూళ్లూరుపేటకు వచ్చేందుకు తిరుగుతుండగా అదేవైపు వస్తున్న కంటైనర్ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో వివాహిత శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్ర గాయాలపాలై ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజశేఖర్(Rajashekhar)ను హైవే మొబైల్ వాహనం ద్వారా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తమిళనాడు ఆరణి ధర్మారంకు చెందిన రాజశేఖర్ సూళ్లూరుపేటలోనే అద్దె ఇంట్లో ఉంటూ రోజూ శ్రీసిటీకి వెళ్లేవాడు. సూళ్లూరుపేటకు చెందిన శ్రావణి కూడా అదే పరిశ్రమలో పనిచేస్తుంది. మంగళవారం నైట్ షిప్ట్ కావడంతో డ్యూటీకి వెళ్లింది.
డ్యూటీ ముగించుకుని రాజశేఖర్‌తో కలిసి మోటారు సైకిల్‌పై వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మరో 3 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శ్రావణికి భర్త, ఇద్దరూ ఆడ పిల్లలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
‘కల్తీ నెయ్యి’పై త్వరలో సిట్ పూర్తి నివేదిక
Read Latest Telangana News and National News