భార్యను చంపిన భర్త
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:19 PM
అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు.
మతిస్థిమితం లేదంటున్న బంధువులు
గుత్తి(అనంతపురం): అనంతపురం జిల్లా గుత్తి మండలం పూలకుంట గ్రామ శివారులో కొట్టేల లక్ష్మి(45) అనే మహిళను ఆమె భర్త బండరాళ్లతో మోది మంగళవారం చంపేశాడు. హతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపిన మేరకు, గుంతకల్లు మండలం మైనాపురం గ్రామానికి చెందిన శివలింగయ్య, లక్ష్మి దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మూడు నెలలుగా శివలింగయ్య మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. పిచ్చి పట్టినవాడిలా వ్య వహరిస్తున్నాడు. భార్యతో తరచూ గొడవపడేవాడు.
వేధింపులు భరించలేక కొన్నాళ్లుగా లక్ష్మి గొల్లలదొడ్డిలోని తన పెద్ద కూతురు వద్ద ఉంటోంది. ఈ క్రమంలో చిన్న కూతురు స్పందనకు పెళ్లి సంబంధం కుదరడంతో రెండు రోజుల కిందట గుంతకల్లు మండలం కదిరిపల్లిలోని తన అన్న వద్దకు వెళ్లింది. విషయం తెలుసుకున్న శివలింగయ్య, కదిరిపల్లికి వెళ్లాడు. బళ్ళారిలో దేవర ఉండటంతో బైక్పై భార్యను ఎక్కించుకుని, బంధువులతో కలిసి మంగళవారం ఉదయం బయలుదేరాడు. అందరూ బళ్లారి వైపు వెళ్లగా, శివలింగయ్య వారి కళ్లుగప్పి, తన భార్యను తీసుకుని పూలకుంట వైపు వెళ్లాడు. గ్రామ శివారులోని ఓ క్రషర్ మిషన్ వద్ద లక్ష్మిని బండరాళ్ళతో మోది చంపేశాడు.
దంపతులు ఎంతసేపటికీ రాకపోవడంతో బంధువులు వెనుదిరిగి వచ్చారు. వారికి శివలింగయ్య కనిపించడంతో నిలదీశారు. దీంతో సంఘటనా స్థలానికి తీసుకువెళ్లి, తన భార్య మృతదేహాన్ని చూపించాడు. వారు వెంటనే గుత్తి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాస్, సీఐ రామారావు, ఎస్ఐ సురేష్ అక్కడికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
రైలు ప్రయాణికులకు షాక్.. రీఫండ్ నియమాల్లో మార్పులు..
బీజాపూర్లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు
Read Latest Telangana News and National News