Share News

సమర్థించరు.. వ్యతిరేకించరు!

ABN , Publish Date - Apr 01 , 2026 | 05:49 AM

రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టసవరణ బిల్లుపై వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

సమర్థించరు.. వ్యతిరేకించరు!

  • అమరావతి బిల్లుపై వైసీపీ వైఖరిదే!!

  • మూడు ముక్కలాటకే మద్దతు

  • మూడు రాజధానుల్లోనూ అమరావతి ఉందంటూ సజ్జల నొక్కులు ‘చట్టబద్ధత’ తీర్మానం చెల్లదన్న బొత్స

అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేందుకు కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతున్న చట్టసవరణ బిల్లుపై వైసీపీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. బుధవారం ఢిల్లీలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ మిథున్‌రెడ్డి అధ్యక్షతన భేటీ అవుతోంది. అమరావతిని ఏకవాక్యంలో సమర్థిస్తున్నట్లో.. వ్యతిరేకిస్తున్నట్లో చెప్పకూడదని ప్రాథమికం గా నిర్ణయించినట్లు ఆ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడొకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అమరావతికి అనుకూలమేనని గతంలోనూ చెప్పామని.. ఇప్పు డూ చెబుతున్నామని.. కానీ అవినీతికే తాము వ్యతిరేకమని వెల్లడించాలనే యోచనలో ఉన్నామన్నారు. దీనర్థం అమరావతిని వ్యతిరేకించడమేనని రా జకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఎటూ తేల్చకపోవడం ద్వారా ప్రజల ను అయోమయంలోకి నెట్టేయాలన్న కుట్ర కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నాయి. వాస్తవానికి వైసీపీ అధ్యక్షుడు జగన్‌, ఆ పార్టీ నేతలు మొదటి నుంచీ అమరావతిపై విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. అమరావతే రాజధానిగా కొనసాగుతుందని నమ్మించి.. తీరా అధికారంలోకి వచ్చాక.. దానిని నాశనం చేసి మూడు ముక్కలాట ఆడారు. ఇప్పటికీ అదే వైఖరితో ఉన్నారు. రాజధాని అమరావతికి కేంద్రం చట్టబద్ధత కల్పించనుందని తెలియగానే.. మళ్లీ గళమెత్తారు. వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లి ప్యాలె్‌సలో మీడియాతో మాట్లాడుతూ.. తాము తొలి నుంచీ అమరావతికి వ్యతిరేకం కాదని.. 3 రాజధానుల్లో అమరావతి కూడా ఉందని సన్నాయి నొక్కులు నొక్కారు.

సోమవారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధానికి చట్టబద్ధత కల్పించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానం చెల్లదన్నారు. సంపదంతా అమరావతిలోనే పెడుతున్నారని.. అభివృద్ధి మొత్తాన్నీ దాని చుట్టూనే కేంద్రీకరిస్తూ, ఉత్తరాంధ్రను గాలికొదిలేశారని మరో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు. తద్వారా 3 రాజధానుల విషయంలో జగన్‌ వైఖరి మారలేదని తేటతెల్లమవుతోందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Updated Date - Apr 01 , 2026 | 08:23 AM