Share News

వైరల్ పింక్ ఏనుగు మరణం.. అసలు కారణం ఇదే..

ABN , Publish Date - Apr 01 , 2026 | 10:50 AM

ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైరల్ పింక్ ఏనుగు మరణం.. అసలు కారణం ఇదే..
Jaipur pink elephant Chanchal

ఇంటర్‌నెట్ డెస్క్: పింక్ కలర్‌లో ఉన్న ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫొటో షూట్ కోసం ఏనుగుకు రంగు పూయటంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ ఏనుగు చనిపోయిందన్న వార్త తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రంగు వేయటం కారణంగానే ఆ ఏనుగు అనారోగ్యానికి గురై చనిపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఏనుగు యజమాని, ఫొటో షూట్ నిర్వహించిన వారిపై జనం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం.. తనపై వస్తున్న విమర్శలపై ఏనుగు యజమాని సాదిక్ ఖాన్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే.. ‘జైపూర్‌‌కు సమీపంలోని హాథీ గావ్‌కు చెందిన ఆ ఏనుగు పేరు చంచల్. 2025 నవంబర్ నెలలో విదేశీ ఫొటోగ్రాఫర్ పాడుబడ్డ గుడిలో ఆ ఫొటో షూట్ చేశారు. హోళీ సందర్భంగా వాడే రంగును దానికి పూశాము. ఫొటో షూట్ కోసం కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం పట్టింది. 30 నిమిషాల్లో ఏనుగుకు పూసిన రంగును కడిగేశాము. ఏనుగు చనిపోవడానికి రంగు కారణం కాదు. ఏనుగు ఎంతో ఆరోగ్యంగా ఉండేది.


రెండు నెలల తర్వాత అది వృద్ధాప్య సంబంధిత సమస్యలతో అనారోగ్యంపాలైంది. తర్వాత కొన్ని రోజులకు చనిపోయింది. అది కూడా 70 ఏళ్ల వయసులో చనిపోయింది. ఫొటో షూట్‌కు దాని మరణానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ రంగు సహజ సిద్ధమైనది’ అని చెప్పుకొచ్చారు. 2025లో ఏనుగుకు సంబంధించిన వీడియో మొదటి సారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే, అప్పుడు ఇంత ప్రచారం జరగలేదు. 2026, మార్చి నెలలో మరోసారి ఆ వీడియో వైరల్ అయింది. ఈ సారి ఆ వీడియో సోషల్ మీడియా తీవ్ర దుమారం రేపింది.


ఇవి కూడా చదవండి

చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

తండ్రి చేసే ఈ తప్పులు కూతురి భవిష్యత్తును దెబ్బతీస్తాయి

Updated Date - Apr 01 , 2026 | 11:00 AM