Share News

బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల

ABN , Publish Date - Mar 16 , 2026 | 06:35 AM

బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిందో మహిళ. ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్నేసి మరికొందరితో కలిసి చోరీకి తెగబడింది.

బంధువని ఆశ్రయమిస్తే.. ఇల్లు గుల్ల

  • నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి చోరీ

  • రూ. 50 లక్షల విలువైన నగలతో పరారైన మహిళ

  • ప్రధాన నిందితురాలు సహా మరో ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ: బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన దూరపు బంధువుపై జాలిపడి ఇంట్లో ఆశ్రయం కల్పిస్తే.. అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేసిందో మహిళ. ఇంట్లో ఉన్న బంగారు నగలపై కన్నేసి మరికొందరితో కలిసి చోరీకి తెగబడింది. ఆశ్రయం ఇచ్చిన వారికి నిమ్మరసంలో మత్తుమందు కలిపి ఇచ్చి.. ఇంట్లో ఉన్న సుమారు రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలను చోరీ చేసి ఉడాయించింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు 24 గంటల్లోపే నిందితులను పట్టుకున్నారు. ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన హిమబిందు(Himabindu) దంపతులు కొన్నేళ్ల బాలానగర్‌ పరిధిలోని ఆదర్శనగర్‌లో నివసిస్తున్నారు.


హిమబిందు భర్త పూజారిగా పనిచేస్తున్నారు. ఆమెకు దూరపు బంధువైన గుంటూరుకు చెందిన చెరుకుపల్లి లక్ష్మీసర్వాని బతుకుదెరువు కోసం హైదరాబాద్‌ వచ్చింది. తమకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో జాలిపడిన హిమబిందు ఆమెకు తన ఇంట్లోనే ఆశ్రయం కల్పించి పనిలో పెట్టుకుంది. ఆరునెలుగా వారి ఇంట్లో నమ్మకంగా ఉన్నట్లు నటించిన లక్ష్మి హిమబిందు బంగారు అభరణలపై కన్నేసింది. ఎలాగైనా వాటిని చోరీ చేయాలనుకుంది. వేసవిలో ఉపశమనం కలుగుతుందని నమ్మించి ఈనెల 13వ తేదీ రాత్రి నిమ్మరసంలో నిద్రమాత్రలు కలిపి హిమబిందు, ఆమెభర్తకు ఇచ్చింది.


వారు మత్తులోకి జారుకున్న తర్వాత నగరంలో ఉంటున్న తన అనుచరులు పర్వతం కిరణ్‌కుమార్‌(30), కొనపర్తి యశ్వంత్‌(19), దిలీప్‌(23), శివ సహాయంతో ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, 2.5 కిలోల వెండి ఆభరణాలు దొంగిలించి పరారైంది. మత్తు నుంచి తేరుకున్న బాధితులు.. పనిమనిషి లక్ష్మి ప్లాన్‌ ప్రకారమే చోరీకి పాల్పడిందని గుర్తించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన బాలానగర్‌ పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితురాలు లక్ష్మీసర్వానితో పాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేసి వారి నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు శివ పరారీలో ఉన్నట్లు ఏసీపీ నరేశ్‌రెడ్డి తెలిపారు. ఎస్‌హెచ్‌వో నర్సింహరాజు, క్రైం పోలీసులకు ఏసీపీ నగదు పురస్కారం అందజేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

రోహిత్‌రెడ్డి జైలుకు

నేనే తప్పూ చేయలేదు!

Read Latest Telangana News and National News

Updated Date - Mar 16 , 2026 | 06:35 AM