పాంచ్ నగారా
ABN , Publish Date - Mar 16 , 2026 | 03:52 AM
దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న మరో ఎన్నికల ఘట్టానికి నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్......
బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు
పలు రాష్ట్రాల్లోని 8 స్థానాలకు ఉప ఎన్నికలు కూడా.. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల
బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29న రెండు విడతల్లో.. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో..
అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్
ఆయా రాష్ట్రాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్: సీఈసీ
న్యూఢిల్లీ, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): దేశ రాజకీయాల్లో అత్యంత కీలకంగా భావిస్తున్న మరో ఎన్నికల ఘట్టానికి నగారా మోగింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదివారం షెడ్యూల్ ప్రకటించింది. దేశంలో అందరి దృష్టి కేంద్రీకృతమై ఉన్న పశ్చిమ బెంగాల్‌లో ఏప్రిల్ 23, 29వ తేదీల్లో కేవలం రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, అసోం, కేరళ, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ ప్రకటించారు. ఈ మేరకు ఎన్నికల కమిషనర్లు ఎస్‌ఎస్ సంధు, వివేక్ జోషితో కలిసి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల జరగనున్న నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుందని సీఈసీ పేర్కొన్నారు. కాగా, ఈ అన్ని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మే 4న ప్రకటిస్తారు. ఈ ఎన్నికలతోపాటు గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు. గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనుండగా, గుజరాత్, మహారాష్ట్రలో ఉప ఎన్నికలు ఏప్రిల్ 23న నిర్వహిస్తారు.
వివాదాలపై స్పందించబోం..
ఎన్నికల జాబితాలో అనర్హులైన ఓటర్లను తొలగించేందుకు, అర్హులకు అవకాశం కల్పించేందుకు రాజ్యాంగంలోని 326 అధికరణ ప్రకారం ప్రత్యేక విస్తృత ఓటర్ల జాబితా (ఎస్‌ఐఆర్) సవరణ చేపట్టినట్లు సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ తెలిపారు. స్వచ్ఛమైన ఎన్నికల జాబితా నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. పశ్చిమ బెంగాల్ ఓటర్ల జాబితాపై వివాదాలు, కేసుల గురించి తాను మాట్లాడబోనన్నారు. ఈ దేశ చట్టాలు, ప్రవర్తనా నియమావళికి అనుగుణంగా ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. తప్పుడు సమాచారం, డీప్ ఫేక్ వార్తలపై కఠిన చర్యలు తీసుకుంటామని, వాటిని గమనించి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేందుకు రాష్ట్ర నోడల్ అధికారులను నియమించామని చెప్పారు. రాజకీయ పార్టీల, నేతల ప్రకటనల్ని తాము పట్టించుకోబోమని, వాటికి ప్రతిస్పందించలేమని అన్నారు. ఎన్నికలకు ముందు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ప్రకటించడంపై స్పందిస్తూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందని, కానీ.. ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే ఏ నిర్ణయాన్నీ అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లోనూ నూటికి నూరుశాతం పారదర్శకత ఉండేలా వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, ప్రతి రెండు గంటలకోసారి పోలైన ఓట్ల సంఖ్యను ప్రకటిస్తామని చెప్పారు.
బెంగాల్‌లో తొలిదశకు 30న నోటిఫికేషన్..
పశ్చిమ బెంగాల్‌లో మొదటి దశ ఎన్నికలకు నోటిఫికేషన్ ఈ నెల 30న జారీ అవుతుందని సీఈసీ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేయడానికి ఏప్రిల్ 6 చివరి తేదీ అని, ఉపసంహరణ ఏప్రిల్ 9 వరకు చేసుకోవచ్చని అన్నారు. ఏప్రిల్ 23న తొలి దశ పోలింగ్ జరుగుతుందన్నారు. రెండో దశకు ఏప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు, నామినేషన్లు దాఖలుకు చివరి తేదీ ఏప్రిల్ 9 కాగా, ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 23 అని పేర్కొన్నారు. ఏప్రిల్ 29న రెండోదశ పోలింగ్ జరుగుతుందన్నారు. ఇక తమిళనాడు ఎన్నికలకు మార్చి 30న నోటిఫికేషన్ ప్రకటిస్తారు. నామినేషన్లు దాఖలుకు చివరితేదీ ఏప్రిల్ 6 కాగా, ఉపసంహరణకు చివరి తేదీ ఏప్రిల్ 9. తమిళనాడులో ఏప్రిల్ 23న ఓటింగ్ జరుగుతుంది. కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలకు మార్చి 16న నోటిఫికేషన్ జారీ అవుతుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 23.
17.4 కోట్ల మంది ఓటర్లు..
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళ, పుదుచ్చేరిలో మొత్తం 824 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 17.4 కోట్ల మంది అర్హులైన ఓటర్లు ఉన్నారు. వీరిలో అత్యధికంగా పశ్చిమ బెంగాల్‌లో 6.44 కోట్ల మంది ఓటర్లు ఉండగా, తమిళనాడులో 5.67 కోట్లు, కేరళలో 2.70 కోట్లు, అసోంలో 2.50 కోట్లు, పుదుచ్చేరిలో 9.44 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో 2.19 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా, దాదాపు 25 లక్షల మంది ఎన్నికల అధికారులు ఎన్నికల నిర్వహణలో పాల్గొననున్నారు. 126 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న అసోం అసెంబ్లీ పదవీకాలం మే 20న ముగియనుండగా, 30 నియోజకవర్గాలున్న పుదుచ్చేరి అసెంబ్లీ గడువు జూన్ 15న ముగుస్తుంది. కాగా, 234 నియోజకవర్గాలున్న తమిళనాడు అసెంబ్లీ పదవీకాలం మే 10న, 140 నియోజకవర్గాలున్న కేరళ అసెంబ్లీ పదవీకాలం మే 23న, 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ గడువు మే 7న ముగియనుంది.