మ్యూల్ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు
ABN , Publish Date - Mar 27 , 2026 | 07:31 AM
మ్యూల్ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు జరిపిన ముఠాలోని నలుగురు సభ్యులను నగర సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు.
నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్ సిటీ: మ్యూల్ ఖాతాల ద్వారా రూ.26.07 కోట్ల లావాదేవీలు జరిపిన ముఠాలోని నలుగురు సభ్యులను నగర సైబర్ క్రైం అధికారులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన రాజేష్ వెంకటరామన్, గుజరాత్‌కు చెందిన రుషబ్ జస్వంత్‌రాయ్ ‘‘వన్‌స్టాప్ సాపింగ్ స్టేషన్ ప్రైవేట్ లిమిటెడ్’’ డైరెక్టర్లుగా ఉన్నారు. వీరు క్లోజ్‌ఎక్స్ పే, ట్రస్టీపే, ఆక్టల్ పే వంటి పేమెంట్ గేట్‌వేలను సృష్టించి, ఐఎంపీఎస్, యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి లావాదేవీలు నిర్వహించేవారు. ప్రతీ లావాదేవీపై 2 నుంచి 3 శాతం కమీషన్ తీసుకునే వారు.
పేమెంట్ గేట్‌వే కార్యకలాపాల నిర్వహణకు నగరానికి చెందిన భమిడిపాటి అభిషేక్‌ను, కేరళకు చెందిన అగస్టీన్ విలియమ్స్‌ను నియమించుకున్నారు. వీరికి ఢిల్లీకి చెందిన అండీ అలియాస్ షహీద్ వివిధ సంస్థల పేరుతో మ్యూల్ ఖాతాలను తెరిచి వాటిని గోవాకు చెందిన మన్‌మీత్ శర్మ అలియాస్ సోనియాకు అందించేవాడు. సోనియా ఈ ఖాతాల వివరాలను గుజరాత్‌కు చెందిన అభిషేక్‌కు పంపేది. ఆ వివరాలను అభిషేక్ అహ్మదాబాద్‌లోని సూర్యోదయా బ్యాంక్ అధికారులకు ఇచ్చేవాడు. బెట్టింగ్ ద్వారా వచ్చే ఆదాయం రాకేష్ వెంకటరామన్ నిర్వహించే గేట్‌వేలో డిపాజిట్ అయ్యేది.
రాజేష్ 5 శాతం, సోనియా 5 శాతం కమీషన్ తీసుకొని మిగిలిన మొత్తాని అండీ ఖాతాకు పంపేవారు. ఇలా ఈ ముఠా సభ్యులు బెట్టింగ్ వెబ్‌సైట్లకు సంబంధించిన రూ.26.07 కోట్ల మేర లావాదేవీలు జరిపారు. నగరానికి చెందిన ఓ యువతి (24) ఇన్‌స్టాగ్రామ్‌లో వీరి ప్రకటన చూసి, గేమింగ్ సైట్లలో రూ.30 లక్షలు పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ ముఠాలోని వెంకటరామన్, భమిడిపాటి రాజేష్, ఆగస్టీన్ విలియమ్స్, సున్‌మీత్ శర్మలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.6.50 లక్షలు స్వాదీనం చేసుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేడు భద్రాద్రి రామయ్యకు కల్యాణం.. రేపు మహాపట్టాభిషేకం..
గోల్డ్, సిల్వర్ రేట్స్.. నేడు ఎలా ఉన్నాయంటే..
Read Latest Telangana News and National News