Share News

సీతారాముల కల్యాణం చూతము రారండి

ABN , Publish Date - Mar 27 , 2026 | 04:29 AM

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కల్యాణోత్సవం, శనివారం జరిగే శ్రీరామ మహా పట్టాభిషేకం కోసం భద్రాద్రి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభిత కల్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక శుక్రవారం అట్టహాసంగా జరగనుంది....

సీతారాముల కల్యాణం చూతము రారండి

  • నేడు భద్రాద్రి రామయ్యకు కల్యాణం.. రేపు మహాపట్టాభిషేకం

  • కల్యాణ వేడుకకు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం

  • రూ.351కోట్లతో భద్రాద్రి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన కూడా

  • ఆలయ అభివృద్ధి మాస్టర్‌ప్లాన్‌ను విడుదల చేసిన తుమ్మల

  • కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు

భద్రాచలం, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కల్యాణోత్సవం, శనివారం జరిగే శ్రీరామ మహా పట్టాభిషేకం కోసం భద్రాద్రి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో శిల్పకళాశోభిత కల్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక శుక్రవారం అట్టహాసంగా జరగనుంది. కల్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి చేరుకుంటున్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టింది. కల్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కల్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్‌ హనుమంతరావు కల్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది మాదిరిగానే కల్యాణ మండప ప్రాంగణంలో ఎండ వేడి నుంచి భక్తులు సేద తీరేందుకు పొగ మంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పలు చోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేశారు. 2వేల మందికి పైగా పోలీస్‌ సిబ్బంది బందోస్తులో ఉన్నారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం 3లక్షల లడ్డూలు, 5లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. భక్తులకోసం తెలుగు రాష్ట్రాల నుంచి 406 బస్సులను నడుపుతున్నారు.


పుష్కరాల నాటికి అభివృద్ధి పనులు పూర్తి

సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను సమర్పించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30గంటలకు తిరుకల్యాణ మహోత్సవం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం అభిజిత్‌లగ్నంలో సీతారాముల కల్యాణం జరుగుతుంది. శనివారం మిథిలా స్టేడియంలోనే కల్యాణ సీతారామచంద్రస్వామికి మహా పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఈ వేడుకకు గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా హాజరు కానున్నారు. మరోవైపు, భద్రాద్రి రామాలయ అభివవృద్ధి పనులను రూ.586కోట్లతో మూడు దశల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలివిడతలో రూ.351కోట్లతో పనులను చేపట్టనున్నారు. ఈ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. 2027జూలైలో గోదావరి పుష్కరాల నాటికి ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది.

రాబోయే రోజుల్లో భద్రాద్రికి రైల్వే, విమాన సదుపాయాలు

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచల పుణ్యక్షేత్రానికి ఇప్పటికే పలు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని, రాబోయే రోజుల్లో విమాన, రైల్వే సదుపాయాలను పూర్తిస్థాయిలో కల్పించేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. భద్రాద్రిలో శ్రీరామనవమి, సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భద్రాచలం ఆలయ అభివృద్ధికి సంబంధించిన నమూనాను(మాస్టర్‌ ప్లాన్‌) విడుదల చేశారు. కాగా, భద్రాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌ రెడ్డి 2024 మార్చి 11న ప్రకటన చేశారు.

Updated Date - Mar 27 , 2026 | 04:29 AM