కూతురి ప్రేమను నిరాకరించిన తండ్రి.. పోలీసుల ఎదుటే కత్తితో దాడి..
ABN , Publish Date - Jun 14 , 2026 | 01:00 PM
కూతురి ప్రేమ వివాహాన్ని అంగీకరించని ఓ తండ్రి మరీ కర్కశంగా ప్రవర్తించాడు. పోలీసుల ఎదుటే ఆమెను కత్తితో పొడిచి హతమార్చాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే...
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బందా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట.. పోలీసుల సమక్షంలో తమ పెళ్లిని ఒప్పించేందుకు యత్నించింది. దీనికి ఆమె తండ్రి నిరాకరించాడు. ఆగ్రహంతో ఊగిపోతూ కన్నకూతురనే విచక్షణ మరచి ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ ప్రాణాలు కోల్పోయింది.
ఇదీ జరిగింది..
శివానీ అనే 19ఏళ్ల యువతి స్థానికంగా ఉంటే లలిత్ వర్మ అనే యువకుణ్ని ప్రేమించింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పగా వారు అంగీకరించలేదు. ఎలాగైనా లలిత్‌తోనే జీవనం సాగించాలనుకున్న ఆమె.. గత మే 18న ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత వారిద్దరూ ఓ గుళ్లో చట్టబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఇంతలో తమ కూతురు కనిపించడంలేదని శివానీ కుటుంబసభ్యులు బందా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ జంటకోసం గాలింపు చర్యలు చేపట్టారు. వారు మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో ఉన్నారని తెలుసుకుని, విచారణ నిమిత్తం యూపీలోని బందాకు తీసుకువచ్చారు.
ఈ క్రమంలో తాము చట్టబద్ధంగానే వివాహం చేసుకున్నామన్న శివానీ, లలిత్ వర్మ.. సంబంధిత పత్రాను పోలీసులకు సమర్పించారు. పోలీసులు శివానీకి వైద్య పరీక్షలు నిర్వహించి, వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్న తరుణంలో ఆమె కుటుంబసభ్యులు పీఎస్‌కు చేరుకున్నారు. కౌన్సెలింగ్ సమయంలో శివానీ తల్లిదండ్రులు తమతో పాటు ఇంటికి రావాలని ఆమెను ఒత్తిడి చేశారు. నిరాకరించిన శివానీ.. లలిత్‌తోనే కలిసి జీవించాలని పట్టుబట్టింది. వాదన తీవ్రరూపం దాల్చింది. శివానీ తల్లి ఆమెను వెనక నుంచి పట్టుకోగా.. తండ్రి కత్తితో కూతురిపై దాడిచేశాడు. తమ కళ్లెదుటే ఘటన జరుగుతున్నా పోలీసులు చూస్తూ ఉండిపోయారు. తీవ్రగాయాలైన ఆమెను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి మృతురాలి తండ్రిని అరెస్ట్ చేశారు. విచారణ చేపట్టినట్టు స్థానిక ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి:
అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం.. 18 ఏళ్లు నిండిన వారికి ఇకపై నో ఆధార్..
బల్క్ డీజిల్ కొనుగోళ్లపై ఆంక్షలు.. ఆసుపత్రుల్లో ఆందోళన