భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు.. 900 పాయింట్లకు పైగా సెన్సెక్స్ పతనం
ABN , Publish Date - Jun 03 , 2026 | 10:55 AM
భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఈ ఉదయం గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయిన మార్కెట్ సూచీలు.. తర్వాత వరుస పతనాన్ని చవిచూస్తున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ దాదాపు 900 పాయింట్లు, నిఫ్టీ 240 పాయింట్లకు పైగా నష్టపోయాయి.
ఆంధ్రజ్యోతి, మే 3: పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య ముదిరిన యుద్ధ ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను భారీగా దెబ్బతీశాయి. ఈ (బుధవారం) ఉదయం ట్రేడింగ్ ప్రారంభం నుంచే మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం గం. 10.50 సమయానికి సెన్సెక్స్ 851 పాయింట్లు పతనమై, 73,803 వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయానికి నిఫ్టీ 243 పాయింట్లు కోల్పోయి, 23,240 వద్ద కదలాడుతోంది. మార్కెట్లోని దాదాపు అన్ని రంగాలు రెడ్ మార్క్‌లోనే ట్రేడ్ అవుతుండటం ఇన్వెస్టర్లలో ఆందోళన పెంచింది.
కువైట్‌లోని యూఎస్ మిలిటరీ బేస్‌లపై ఇరాన్ నేరుగా క్షిపణి దాడులు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపింది. ఇన్నాళ్లూ ఇరు దేశాల మధ్య చర్చలు సఫలమవుతాయని భావించిన మార్కెట్లకు ఈ తాజా దాడులు గట్టి షాకిచ్చాయి. యుద్ధం మరింత ముదిరే అవకాశం ఉందన్న భయాలు గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తున్నాయి. యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ (Brent Crude) బ్యారెల్‌కు 0.88శాతం పెరిగి 96.84 డాలర్లకు చేరింది.
ఐటీ (IT) షేర్లలో భారీ అమ్మకాలు:
ఈరోజు మార్కెట్ పతనానికి ఐటీ రంగానికి చెందిన దిగ్గజ షేర్లు ప్రధాన కారణమయ్యాయి. ముఖ్యంగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఏకంగా 6.65శాతం కుప్పకూలగా, పర్సిస్టెంట్ సిస్టమ్స్ (Persistent Systems) 5.16శాతం నష్టపోయింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి పెద్ద షేర్లలో అమ్మకాల ఒత్తిడి నిఫ్టీని కిందకు లాగింది.
ఈ భారీ పతనంలోనూ కాంకర్డ్ బయోటెక్ (Concord Biotech) 7.83శాతం, రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 5శాతం, ఎన్‌హెచ్‌పీసీ (NHPC) 4.47శాతం లాభాలతో ట్రేడ్ అవుతూ మార్కెట్‌కు కొంత మద్దతుగా నిలిచాయి. ఇక, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.70గా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News