Share News

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Jun 03 , 2026 | 06:12 AM

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) 290 ఉద్యోగాలకు సంబంధించి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

290 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) 290 ఉద్యోగాలకు సంబంధించి మూడు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో రోడ్లు, భవనాల శాఖలో 222 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ సివిల్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) ఉద్యోగాలు ఉండగా, 49 ఏఈఈ ఎలక్ర్టికల్‌ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే, కాలుష్య నియంత్రణ మండలిలో 19 ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. 18 నుంచి 44 ఏళ్లలోపు వారిని అర్హులుగా నిర్ణయించారు. పరీక్షలన్నీ ఓఎంఆర్‌ (ఆఫ్‌లైన్‌) విధానం లేదా సిబిటి (ఆన్‌లైన్‌) పద్ధతిలో నిర్వహిస్తామని, దీనిపై త్వరలో స్పష్టత ఇస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి హరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 నుంచి జూలై 13 వరకు ఏఈఈ సివిల్‌ ఉద్యోగాలకు, ఈనెల 10 నుంచి జూలై 17 వరకు ఏఈఈ ఎలక్ర్టికల్‌ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈ నెల 8 నుంచి జూలై 15 వరకు కాలుష్య నియంత్రణ మండలి పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తామని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. క్రైస్తవ మతంలోకి మారినవారిని ఎస్సీ, ఎస్టీలుగా పరిగణించబోమని కమిషన్‌ స్పష్టత ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ విభాగంలో దరఖాస్తు చేసేవారు సమర్పించాల్సిన ధ్రువపత్రాలను నోటిఫికేషన్లో పేర్కొంది.

Updated Date - Jun 03 , 2026 | 06:12 AM