వాట్సాప్ పనిచేయాలంటే సిమ్ కార్డ్ ఉండాల్సిందే.. మార్చి 1 నుంచే కొత్త రూల్స్!
ABN , Publish Date - Feb 28 , 2026 | 09:54 PM
పెరుగుతున్న సైబర్ నేరాలు, సిమ్-స్వాప్ మోసాలు, నకిలీ ఖాతాలను అరికట్టేందుకు కేంద్రం కొత్త నిబంధనలను తీసుకువస్తోంది. మారిన ఈ నిబంధనలు మార్చి 1 నుంచి అమలులోకి రానున్నాయి. వాటి గురించి ఓసారి పరిశీలిస్తే...
ఇంటర్నెట్ డెస్క్: శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతున్న నేటి కాలంలో ప్రతి నెలా క్యాలెండర్ మారుతున్న కొలదీ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు.. అటు ఆర్థిక పరంగా, ఇటు ఇతర రంగాల్లో నియమాలెన్నో సడలింపునకు లోనవుతున్నాయి. అలా మార్చి 1వ తేదీ నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. సిమ్ బైండింగ్, యూపీఐ సంబంధిత నియమాలు ఇందులో ప్రధానమైనవి.
సిమ్ కార్డు ఉండాల్సిందే..
ఇకపై.. వాట్సాప్, టెలిగ్రామ్, అరట్టై వంటి మెసేజింగ్ యాప్‌లు సక్రమంగా పనిచేయాలంటే సిమ్ కార్డు బైండింగ్ నిబంధనను తప్పనిసరి చేసింది కేంద్రం. దీని ప్రకారం వినియోగదారులు తమ ఫోన్‌లో రిజిస్టర్ చేసుకున్న యాక్టివ్ సిమ్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. సిమ్ లేకపోతే లేదా తొలగిస్తే ఆ సేవలు పనిచేయవు. అదనంగా వాట్సాప్ వెబ్ వంటి డెస్క్‌టాప్ సెషన్లు ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ అవుతాయి. వాటిని తిరిగి యాక్సెస్ చేయడానికి మళ్లీ ధ్రువీకరించుకోవాలి. అయితే.. సైబర్ మోసాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తరహా నిబంధలను తీసుకొచ్చింది కేంద్రం.
అన్నీ రైల్‌వన్‌లోనే..
రైల్వే శాఖలో గతంలో తీసుకొచ్చిన అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్(యూటీఎస్) ఇకపై పనిచేయదు. జనరల్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్ల బుకింగ్ కోసం ప్రవేశపెట్టిన ఈ సేవలు మార్చి 1 నుంచి నిలిపివేస్తున్నట్టు రైల్వే ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందులో అందించే సేవలను రైల్వే శాఖ ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన 'రైల్‌వన్' యాప్‌లో లభ్యమవుతాయని పేర్కొంది. యూటీఎస్‌ఆర్-వాలెట్‌లో ఏమైనా నగదు ఉన్నట్టయితే అది ఆటోమేటిగ్గా 'రైల్‌వన్'కు బదిలీ అవుతుందంది.
ఆ పేమెంట్స్‌కు బయోమెట్రిక్..
మార్చి 1 నుంచి యూపీఐ ఆధారిత చెల్లింపులు మరింత సురక్షితం కానున్నాయి. పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిపేటప్పుడు పాస్‌వర్డ్‌తో పాటు బ్యాంకులు అదనంగా బయోమెట్రిక్ తప్పనిసరి కానుంది. బయోమెట్రిక్ స్థానంలో ఓటీపీ లాంటి ఇతర ఆథరైజేషన్ కూడా ప్రత్యామ్నాయంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉంటుంది. సైబర్ మోసాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు.
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తమ వినియోగదారులకు చేసే ఫోన్‌కాల్స్‌ను '1600 సిరీస్' నంబరును వినియోగించాలని ట్రాయ్ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ విభాంగంలో ఇప్పటికే ఈ విధానం అమలులో ఉంది. మార్చి 1 నుంచి ఎన్‌బీఎఫ్‌సీలు, మార్చి 15 నుంచి స్టాక్‌బ్రోకర్ల నుంచి వచ్చే కాల్స్ కూడా ఈ సిరీస్ నుంచే రానున్నాయి. బ్యాంకుల పేరిట సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది ట్రాయ్.
ఇవీ చదవండి:
ప్రగతి రథం.. వృద్ధి పథం.. భారత్ వృద్ధి రేటు 7.8 శాతం