ప్రగతి రథం.. వృద్ధి పథం
ABN , Publish Date - Feb 28 , 2026 | 02:22 AM
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. మాన్యుఫాక్చరింగ్, సేవల రంగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక...
క్యూ3లో జీడీపీ వృద్ధి రేటు 7.8%. ఈ ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.4% నుంచి 7.6 శాతానికి పెంపు
2022-23 ఆధార సంవత్సరంగా లెక్కించిన తొలి గణాంకాలను విడుదల చేసిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో భారత జీడీపీ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైంది. మాన్యుఫాక్చరింగ్, సేవల రంగాల మెరుగైన పనితీరు ఇందుకు దోహదపడింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో ఇదే కాలానికి నమోదైన 7.4ు వృద్ధితో పోలిస్తే పెరిగినప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి (క్యూ2) నమోదైన 8.4ు వృద్ధి రేటుతో పోలిస్తే మాత్రం గణనీయంగా తగ్గింది. అయితే, ట్రంప్ సుంకాలతో అంతర్జాతీయ వాణిజ్యంలో అనిశ్చితుల నేపథ్యంలోనూ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న బడా ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.
ఆధార సంవత్సరం మార్పు తొమ్మిదోసారి..
2022-23 ఆధార సంవత్సరంగా గణించిన కొత్త జీడీపీ సిరీ్‌సలో విడుదల చేసిన తొలి గణాంకాలివి. ఇదివరకు జీడీపీ లెక్కింపునకు 2011-12 ఆధార సంవత్సరంగా ఉంది. జీడీపీ గణాంకాల లెక్కింపునకు ఆధార సంవత్సరాన్ని సవరించడం ఇది 9వసారి. కొత్త సిరీస్ ప్రకారం.. ఈ ఆర్థిక సంవత్సరం మొత్తానికి జీడీపీ వృద్ధి 7.6 శాతంగా నమోదు కావచ్చని అంచనా. ఈ జనవరిలో విడుదల చేసిన ముందస్తు అంచనా 7.4 శాతంతో పోలిస్తే 0.2ు అధికమిది.
క్యూ1, క్యూ2 వృద్ధి రేటు సవరణ
ఈ క్యూ2 జీడీపీ వృద్ధి రేటును గతంలో ప్రకటించిన 8.2 శాతం నుంచి 8.4 శాతానికి పెంచిన కేంద్రం.. జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికం (క్యూ1) వృద్ధి రేటును మాత్రం 7.8 శాతం నుంచి 6.7 శాతానికి కుదించింది.
2026-27 వృద్ధి అంచనా 7-7.4 శాతం
కొత్త జీడీపీ సిరీస్ విడుదల నేపథ్యంలో వచ్చే ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలనూ సవరించారు. ఈ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్న 2026-27 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 7-7.4 శాతం శ్రేణిలో నమోదు కావచ్చని ప్రఽభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. ఈ జనవరిలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వేలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన వృద్ధి శ్రేణి 6.8-7.2 శాతంతో పోలిస్తే ఇది 0.2 శాతం అధికం.
ఎకానమీ: 4 లక్షల కోట్ల డాలర్లు
ప్రస్తుత సంకేతాలను బట్టి చూస్తే, వచ్చే ఆర్థిక సంవత్సరంలో నామినల్ జీడీపీ వృద్ధి రేటు దాదాపు 11 శాతానికి చేరుకోవచ్చని, దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 4 లక్షల కోట్ల డాలర్ల మైలురాయిని దాటవచ్చని నాగేశ్వరన్ అన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని కొనసాగించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జాతీయ గణాంకాల శాఖ డేటా ప్రకారం..
జీడీపీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 2022-23 సంవత్సరం ఆధారంగా లెక్కించిన వాస్తవిక జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) రూ.84.54 లక్షల కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి నమోదైన రూ.78.41 లక్షల కోట్లతో పోలిస్తే 7.8 శాతం వృద్ధి కనబరిచింది.
ప్రస్తుత ధరల ఆధారంగా లెక్కించిన నామినల్ జీడీపీ ఈ క్యూ3లో రూ.90.91 లక్షల కోట్లుగా ఉంది. 2024-25 క్యూ3లో నమోదైన రూ.83.46 లక్షల కోట్లతో పోలిస్తే 8.9 శాతం పెరిగింది.
ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) మొత్తానికి వాస్తవిక జీడీపీ రూ.322.58 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తొలి సవరణ అంచనా రూ.299.89 లక్షల కోట్లతో పోలిస్తే 7.6 శాతం వృద్ధి నమోదు కావచ్చని అంచనా.
2025-26 ఆర్థిక సంవత్సరానికి నామినల్ జీడీపీ రూ.345.47 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నమోదైన రూ.318.07 లక్షల కోట్లతో పోలిస్తే 8.6 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా.
జీవీఏ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 2022-23 ఆధార సంవత్సరంగా గణించిన ‘జోడించిన స్థూల విలువ’ (జీవీఏ) రూ.294.40 లక్షల కోట్లకు పెరగవచ్చని అంచనా. గత ఆర్థిక సంవత్సరానికి నమోదైన రూ.273.36 లక్షల కోట్లతో పోలిస్తే 7.7 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నామినల్ జీవీఏ రూ.313.61 లక్షల కోట్లుగా ఉండవచ్చని అంచనా. 2024-25లో నమోదైన 288.54 లక్షల కోట్లతో పోలిస్తే 8.7 శాతం వృద్ధి చెందవచ్చని అంచనా.
ఈ క్యూ3లో రియల్ జీవీఏ 7.8ు వృద్ధితో రూ.77.38లక్షల కోట్లకు చేరుకుంది. 2024-25లో ఇదేకాలంలో రూ.71.77లక్షల కోట్లుగా ఉంది. నామినల్ జీవీఏ 8.2ు వృద్ధి చెంది రూ.82.58 లక్షల కోట్లకు పెరిగింది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ