బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నారా..? అయితే ఈ నాలుగు విషయాలు తెలుసుకోవాల్సిందే!
ABN , Publish Date - Nov 29 , 2026 | 07:36 PM
మీరు బ్యాంకుల నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ నాలుగు విషయాలను తెలుసుకుని తీరాల్సిందే.. పూర్తి కథనం చదవండి
ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు, కారు కొనాలనుకునే వారికి బ్యాంకు రుణాలు అండగా మారాయి. అప్పుల కోసం చాలా మంది బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. అయితే కొందరు బ్యాంక్ లోన్ విషయంలో తొందరపాటు కనబరుస్తున్నారు. రుణాలకు సంబంధించిన నిబంధనలను, షరతులను పట్టించుకోవడం లేదు. దీని వల్ల పలు ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే బ్యాంక్ లోన్ తీసుకునే సమయంలో కొన్ని కీలక అంశాలను అర్థం చేసుకోవడం ముఖ్యం. ఈ అలవాటు భవిష్యత్తు ఆర్థిక సమస్యలను దూరం చేస్తుంది. బ్యాంకుల నుంచి అప్పులు తీసుకునే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.
వడ్డీ భారం ఏమాత్రం..?
బ్యాంకు నుంచి రుణం పొందుతున్నప్పుడు అన్నిటికంటే ముందు చేయాల్సిన పని.. వడ్డీ రేట్లను తెలుసుకోవడం. సాధారణంగా వడ్డీ రేట్లు బ్యాంకు, ఆర్థిక సంస్థల బట్టి మారుతూ ఉంటాయి. రేట్లు తక్కువగా ఉన్నాయా.. అనే దానితో పాటు ఇవి స్థిరంగా ఉన్నాయా.. అనేదీ చూడాలి. కొన్ని సందర్భాల్లో వడ్డీ రేట్లు కాలానుగుణంగా మారతాయి. వీటినే ఫ్లోటింగ్ రేట్లు అని అంటారు. ఎప్పుడూ స్థిరంగా ఉంటే.. స్థిర వడ్డీ రేట్లు అని పిలుస్తారు.
నెలకు ఎంత కట్టాలి..?
రుణానికి ముందు నెలవారీ ఆదాయవ్యయాలను లెక్కించుకోవాలి. అప్పుడు ప్రతి నెలా ఎంత రుణం తిరిగి చెల్లించగలమో తెలుస్తుంది. మీకు ఎంత ఈఎంఐ కట్టడానికి వీలవుతుందో బ్యాంకులకు తెలియజేయాలి. సులభంగా చెల్లించే విధంగా ఈఎంఐను ఏర్పాటు చేసుకుంటే ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు.
ఆ ఫీజుల మాటేంటి..?
లోన్ తీసుకునే ముందే బ్యాంకు విధించే ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంట్ ఛార్జీలు లాంటివి తనిఖీ చేయాలి. ఇంకా ఇతర ఛార్జీలు ఏమున్నాయో స్పష్టంగా చూడాలి. ఈఎంఐ సకాలంలో చెల్లించకపోతే బ్యాంకు విధించే పెనాల్టీ గురించీ తెలుసుకోవాలి. ఈ సమాచారాన్ని రాతపూర్వకంగా పొందడం మేలు.
తొందరపాటు వద్దే వద్దు..!
రుణాన్ని ఆమోదించిన తరువాత బ్యాంకు ఒక ఒప్పంద పత్రాని జారీ చేస్తుంది. చాలామంది రుణగ్రస్తులు దాన్ని చదవకుండానే సంతకాలు చేస్తారు. ఇలా చేయడం అసలు మంచిది కాదు. పత్రంలోని ప్రతి అక్షరాన్ని చదవి తీరాల్సిందే. ఈ విషయంలో తొందరపాటు పనికిరాదు. ఒప్పంద పత్రంలో రుణ కాలపరిమితి, వడ్డీ రేటు, ఈఎంఐ చెల్లింపు తేదీ, ఆలస్య రుసుముల సమాచారం సహా ఇతర వివరాలు ఉంటాయి. అందుకే చదవిన తరువాతే సంతకం చేయాలి.
ఇవీ చదవండి
జీఎస్టీ రిజిస్ట్రేషన్ రద్దు ఇక సులభం..