ఏటీఎంలో నగదు తీస్తున్నారా!
ABN , Publish Date - Nov 29 , 2026 | 04:05 AM
బ్యాంక్ ఏటీఎంల్లో తరచూ లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్లపై డెబిట్ కార్డులను వినియోగించి నగదు ఉపసంహరించుకుంటున్నారా.? అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన..
సొంత బ్యాంక్ ఏటీఎంల్లో నెలకు ఐదు సార్లే ఉచితం
ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో మూడు నుంచి ఐదు ఫ్రీ
బ్యాలెన్స్ చెక్ వంటి లావాదేవీలూ ఈ పరిమితిలోనే
అమల్లోకి ఆర్‌బీఐ కొత్త మార్గదర్శకాలు
బ్యాంక్ ఏటీఎంల్లో తరచూ లావాదేవీలు నిర్వహిస్తున్నారా..? పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషిన్లపై డెబిట్ కార్డులను వినియోగించి నగదు ఉపసంహరించుకుంటున్నారా.? అయితే, కొత్తగా అమల్లోకి వచ్చిన (నవంబరు 27 నుంచి) ఆర్‌బీఐ మార్గదర్శకాల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. నెలవారీ ఉచిత లావాదేవీలు సొంత బ్యాంక్ ఏటీఎంల్లో, ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో ఎన్ని? ఆ తర్వాత ఒక్కో లావాదేవీకి ఎంత చొప్పున చార్జీ చెల్లించాలి? నగదు ఉపసంహరణ మొత్తంపై పరిమితి? తదితర వివరాలన్నీ ఈ మార్గదర్శకాల్లో ఉన్నాయి.
ఏటీఎంల్లో ఉచిత లావాదేవీలు..
సేవింగ్స్ బ్యాంక్ ఖాతాదారుడు డెబిట్ కార్డు ద్వారా సొంత బ్యాంక్ ఏటీఎంలలో నెలకు 5 ఉచిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. నగదు ఉపసంహరణతోపాటు బ్యాలెన్స్ ఎంత ఉందో చూసుకోవడం వంటి నాన్ ఫైనాన్షియల్ లావాదేవీలు కూడా ఈ పరిమితి కిందకే వస్తాయి. ఒక్కసారి నగదు ఉపసంహరించుకుని, నాలుగు సార్లు బ్యాలెన్స్ చెక్ చేసుకున్నా ఉచిత పరిమితి అయిపోనట్టుగానే భావించాలి.
ఇతర బ్యాంకుల ఏటీఎంలలో అయితే మెట్రో నగరాల్లో నెలకు 3 ఉచిత లావాదేవీలే ఉంటాయి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, కోల్‌కతా మెట్రో నగరాల కిందకు వస్తాయి.
నాన్ మెట్రో ప్రాంతాల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో నెలకు 5 ఉచిత లావాదేవీలు చేసుకోవచ్చు.
మెట్రో, నాన్ మెట్రోల్లోని ఇతర బ్యాంకుల ఏటీఎంలను కలిపి ఉపయోగించినా నెలలో ఐదు వరకే ఉచితం.
లావాదేవీలు విఫలమైతే..?
విఫలమైన లావాదేవీలకు చార్జీలు ఉండవు. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, కనెక్టివిటీకి సంబంధించి సాంకేతిక సమస్యలు, ఏటీఎంల్లో నగదు లేకపోవడం వంటి కారణాలతో విఫలమైన లావాదేవీలను ఉచిత లావాదేవీల కింద లెక్కించరు.
బ్యాంకు లేదా సర్వీస్ ప్రొవైడర్ కారణంగా తిరస్కరణకు గురైన లావాదేవీలకు చార్జీలు విధించకూడదు.
తప్పు పిన్ లేదా ఇతర ధ్రువీకరణ సమస్యలతో విఫలమైన లావాదేవీలకూ సైతం చార్జీలు ఉండవు.
పీఓఎస్ మెషిన్ల ద్వారా నగదు ఉపసంహరణ
ఝపీఓఎస్ మెషిన్ల ద్వారా కూడా నగదు ఉపసంహరించుకోవచ్చు. డెబిట్ కార్డు, కేవైసీ పూర్తి చేసిన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్లు, యూపీఐ ద్వారా ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
ఝఒక్కో లావాదేవీలో గరిష్ఠంగా రూ.2,000 తీసుకోవచ్చు. ఇలా నెలకు గరిష్ఠ ఉపసంహరణ పరిమితి అన్ని ప్రాంతాల్లో కలిపి రూ.10,000.
ఝఈ సేవపై చార్జీలు విధిస్తే లావాదేవీ విలువలో 1 శాతానికి మించకూడదు.
ఉచిత లావాదేవీలపై అలర్ట్‌లు
ఒక నెలలో ఎన్ని ఉచిత లావాదేవీలు ఉపయోగించుకున్నారో ప్రతి లావాదేవీ అనంతరం బ్యాంకులు ఖాతాదారులకు విధిగా తెలియజేయాలి.
ఉచిత లావాదేవీల పరిమితి దాటితే ఎంత చార్జీ పడుతుందో కూడా ముందుగానే హెచ్చరించాలి.
ఉచిత లావాదేవీల సంఖ్య, నగదు ఉపసంహరణ పరిమితి, చార్జీల వివరాలను ఏటీఎంల వద్ద ఇంగ్లిష్, హిందీ, స్థానిక భాషల్లో ప్రదర్శించాలి. ప్రతి ఏటీఎం వద్ద అది మెట్రోనా లేక నాన్ మెట్రోనా అన్నది బ్యానర్ రూపంలో లేదా స్ర్కీన్‌పై వెల్లడించాలి.
రూ.23 చొప్పున చార్జీ
ఉచిత పరిమితి ముగిసిన తర్వాత నిర్వహించే ప్రతి లావాదేవీ పై బ్యాంకులు రూ.23 చొప్పున గరిష్ఠంగా చార్జీ వసూలు చేయొచ్చు. దీనికి పన్నులు అదనం. బోర్డు ఆమోదించిన విధానం ప్రకారం ఈ గరిష్ఠ చార్జీకి లోబడి ఎంతైనా లావాదేవీ చార్జీని బ్యాంకులు నిర్ణయించుకోవచ్చు.
ఉపసంహరణపై పరిమితి
ఇతర బ్యాంకుల ఏటీఎంల్లో అయితే ఒక లావాదేవీలో గరిష్టంగా రూ.10,000 వరకే ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.