Share News

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు ఇక సులభం..

ABN , Publish Date - Nov 29 , 2026 | 03:55 AM

వ్యాపారం మూసివేయటం, వ్యాపారాన్ని వేరొకరికి విక్రయించటం, ఇద్దరు భాగస్వాములు విడిపోవటం, టర్నోవర్‌ రిజిస్ట్రేషన్‌ పరిమితి కంటే తగ్గిపోవటం.. ఇలా రకరకాల కారణాలతో చాలా మంది వ్యాపారస్తులు..

జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ రద్దు ఇక సులభం..

వ్యాపారం మూసివేయటం, వ్యాపారాన్ని వేరొకరికి విక్రయించటం, ఇద్దరు భాగస్వాములు విడిపోవటం, టర్నోవర్‌ రిజిస్ట్రేషన్‌ పరిమితి కంటే తగ్గిపోవటం.. ఇలా రకరకాల కారణాలతో చాలా మంది వ్యాపారస్తులు తమ జీఎస్‌టీ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేసుకోవాలనుకుంటారు. అయితే దరఖాస్తు చేసిన తర్వాత రద్దు కావటానికి ఎంత కాలం పడుతుంది? తప్పనిసరిగా అధికారి పరిశీలించాలా? అధికారి నుంచి ఏదైనా సందేహం వస్తే ఎన్ని రోజుల్లో జవాబు ఇవ్వాలి? షాపులో మిగిలిపోయిన స్టాక్‌ సంగతి ఏమిటి? అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. దీంతో ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ఇటీవల జరిగిన 57వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో సిఫారసు చేయటం, దాని ప్రకారం ప్రభుత్వం రెండు నోటిఫికేషన్లు జారీ చేయటం జరిగింది. ఆ వివరాలు మీ కోసం.. అక్టోబరులో జరిగిన 57వ కౌన్సిల్‌ సమావేశంలో రిజిస్ట్రేషన్‌, రిటర్నులు, రిఫండ్స్‌కు సంబంధించి అనేక సంస్కరణలను సిఫారసు చేసిన విషయం తెలిసిందే. రిజిస్ట్రేషన్‌ రద్దు విషయంలో అధికారుల ప్రమేయం తగ్గించి, పోర్టల్‌ ద్వారానే ఆటోమేటిక్‌గా రద్దయ్యే విధానాన్ని దశల వారీగా తీసుకురావాలని కౌన్సిల్‌ సూచించింది. దీనికి అనుగుణంగా మొదటి నోటిఫికేషన్‌ ద్వారా నవంబరు 1వ తేదీ నుంచి కొత్త విధానం అమల్లోకి రాగా, రెండో నోటిఫికేషన్‌ ద్వారా డిసెంబరు 1వ తేదీ నుంచి ఆ విధానాన్ని మరింత సరళతరం చేసింది.


ప్రాథమిక విధానం: రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన 30 రోజుల లోపు పోర్టల్‌లో రద్దు దరఖాస్తు చేసుకోవాలి. ఇక్కడ ముఖ్య విషయం ఏమిటంటే, దరఖాస్తు చేసే ముందే పెండింగ్‌లో ఉన్న రిటర్నులన్నీ ఫైల్‌ చేసి ఉండాలి. కాంపోజిషన్‌ పద్ధతిలో ఉన్న వారు తమ త్రైమాసిక స్టేట్‌మెంట్‌ కూడా ఫైల్‌ చేసి ఉండాలి. అలాగే ఏదైనా నెలకు అమ్మకాల రిటర్న్‌ ఫైల్‌ చేసి ఉంటే, అదే నెలకు పన్ను చెల్లింపు రిటర్న్‌ కూడా ఫైల్‌ చేసి ఉండాలి. ఇవి లేకుండా దరఖాస్తు ముందుకు వెళ్లదు. దరఖాస్తు చేసిన తర్వాత మిగిలిన కాలానికి సంబంధించిన రిటర్నులను వాటి గడువు తేదీల లోపు ఫైల్‌ చేయాలి. ఇకపోతే దరఖాస్తు సమర్పించిన రోజు నుంచి రద్దు ప్రక్రియ పూర్తయ్యే వరకు రిజిస్ట్రేషన్‌ సస్పెండ్‌ అయినట్లుగా పరిగణిస్తారు.

స్టాక్‌ విషయం: రిజిస్ట్రేషన్‌ రద్దయ్యే నాటికి షాపులో ఉన్న సరుకు మీద, తయారీలో ఉన్న సరుకు మీద, యంత్రాల వంటి క్యాపిటల్‌ గూడ్స్‌ మీద గతంలో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) తీసుకుని ఉంటే, ఆ క్రెడిట్‌కు సమానమైన మొత్తాన్ని చెల్లించాలి. ఆ సరుకును అమ్మితే కట్టాల్సిన పన్ను అంతకంటే ఎక్కువ అయితే ఆ ఎక్కువ మొత్తాన్ని చెల్లించాలి. ఈ స్టాక్‌ వివరాలు, దాని మీద కట్టాల్సిన పన్ను, చెల్లించిన వివరాలు రద్దు దరఖాస్తులోనే తెలియజేయాలి. డిసెంబరు 1వ తేదీ నుంచి ఈ దరఖాస్తు ఫారమ్‌ను కూడా మార్చి.. స్టాక్‌ మీద చెల్లించాల్సిన క్రెడిట్‌ను అందులోనే లెక్కించే విధంగా రూపొందించటం జరిగింది.


నవంబరులో వచ్చిన మార్పులు: గతంలో ప్రతి రద్దు దరఖాస్తును అధికారి పరిశీలించి ఆర్డర్‌ ఇచ్చేవారు. నవంబరు 1 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త విధానంలో రిటర్నులన్నీ గడువు లోపు ఫైల్‌ చేసి, పన్ను, వడ్డీ, లేట్‌ ఫీజు, పెనాల్టీ వంటి బకాయిలన్నీ చెల్లించిన వారికి పోర్టల్‌.. ఆటోమేటిక్‌గా రిజిస్ట్రేషన్‌ రద్దు చేస్తుంది. అయితే నవంబరు నెలలో దీనికి ఒక షరతు ఉండేది. రిజిస్ట్రేషన్‌ తీసుకున్నప్పటి నుంచి ఏ నెలలో కూడా రిజిస్టర్డ్‌ వ్యాపారులకు చేసిన అమ్మకాల మీద పన్ను రూ.2.5 లక్షలు దాటకుండా ఉండాలి. ఒకవేళ ఏదైనా నెలలో అది దాటి ఉంటే, చివరి రిటర్న్‌ను నిర్ణీత గడువు తర్వాత మూడు రోజుల లోపు ఫైల్‌ చేసిన వారికి మాత్రమే ఆటోమేటిక్‌ రద్దు వర్తించేది.

డిసెంబరు 1 నుంచి అమల్లోకి వచ్చేవి: డిసెంబరు ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే రెండో నోటిఫికేషన్‌ ద్వారా ఈ రెండు షరతులను తొలగించటం జరిగింది. అంటే అమ్మకాల మీద పన్ను ఎంత ఉందనే దానితో సంబంధం లేకుండా, రిటర్నులన్నీ గడువు లోపు ఫైల్‌ చేసి, బకాయిలన్నీ చెల్లించిన ప్రతి ఒక్కరి రిజిస్ట్రేషన్‌ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. రద్దు అనేది వ్యాపారస్తుడు కోరిన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. రద్దయినట్లు సమాచారం పోర్టల్‌ ద్వారానే ఎలకా్ట్రనిక్‌గా అందుతుంది. దీని కోసం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉండదు.

స్థూలంగా చెప్పాలంటే, డిసెంబరు ఒకటో తేదీ నుంచి రిటర్నులన్నీ సమయానికి ఫైల్‌ చేసి, బకాయిలన్నీ చెల్లించిన ఏ వ్యాపారస్తుడి రిజిస్ట్రేషన్‌ అయినా అమ్మకాల పరిణామంతో సంబంధం లేకుండా, అధికారి ప్రమేయం లేకుండానే పోర్టల్‌ ద్వారా ఆటోమేటిక్‌ రద్దవుతుంది. కాబట్టి, వ్యాపారం మూసేయాలనుకునే వారు ముందుగా పెండింగ్‌ రిటర్నులు, స్టాక్‌ మీద కట్టాల్సిన పన్ను, ఇతర బకాయిలు అన్నీ క్లియర్‌ చేసుకుని 30 రోజుల లోపు దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. వ్యాపారస్తులు, వారికి సేవలందించే ట్యాక్స్‌ ప్రాక్టీషనర్లు ఈ మార్పులు గమనించాలి.

Updated Date - Nov 29 , 2026 | 03:58 AM