గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ హవా.. నిమ్మకూరులో ఘన విజయం
ABN , Publish Date - Nov 29 , 2026 | 05:21 PM
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మద్దతుదారులు విజయఢంకా మోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో వరుస విజయాలు నమోదు చేస్తున్నారు.
అమరావతి, నవంబర్ 29: ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మద్దతుదారులు విజయఢంకా మోగిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామాల్లో వరుస విజయాలు నమోదు చేస్తూ హవా కొనసాగిస్తున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) స్వగ్రామమైన కృష్ణా జిల్లా నిమ్మకూరులో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది.
టీడీపీ మద్దతుతో బరిలోకి దిగిన అభ్యర్థి అశోక్ చక్రవర్తి 289 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థిపై గెలుపొందారు. ఎన్నికల ఫలితాల్లో టీడీపీ మద్దతుదారులు విజయాలు నమోదు చేస్తుండగా.. పలు చోట్ల వైసీపీ, టీడీపీ రెబల్ అభ్యర్థులూ గెలుపొందుతున్నారు.
అనంతపురం జిల్లా నార్పల మండలం రంగాపురంలో టీడీపీ మద్దతుదారు కొండలనాయుడు 168 ఓట్ల మెజారిటీతో సర్పంచ్‌గా గెలుపొందారు. గార్లదిన్నె మండలం కమలాపురంలో టీడీపీ మద్దతు అభ్యర్థి సురేశ్ నాయుడు 173 ఓట్లతో విజయం సాధించారు. బుక్కరాయసముద్రం మండలం నీలంపల్లిలో టీడీపీ రెబల్ అభ్యర్థి కురుబ నాగలింగ 132 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక, పుట్లూరు మండలం కుమ్మణమలలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి వైష్ణవి 146 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అదే మండలంలోని సూరేపల్లిలో టీడీపీ మద్దతుదారు రాజేశ్వరి 898 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.
శ్రీ సత్యసాయి జిల్లాలోనూ పలు గ్రామాల్లో టీడీపీ మద్దతుదారుల జోరు కొనసాగుతోంది. నంబులపూలకుంట మండలం గోకనపల్లిలో టీడీపీ బలపరిచిన అభ్యర్థి 129 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నల్లచెరువు మండలం అలుగుండులో టీడీపీ మద్దతుదారు వెంకటశివారెడ్డి 72 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కదిరి రూరల్ మండలం బూరుగుపల్లిలోనూ టీడీపీ బలపరిచిన అభ్యర్థి విజయం సాధించారు. తలుపుల మండలం బట్రేపల్లిలో సర్పంచ్ అభ్యర్థి కె.లక్ష్మమ్మ టీడీపీ మద్దతుతో గెలుపొందారు. అమడగూరు మండలం కసముద్రంలో పద్మావతమ్మ 127 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
మరోవైపు, నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం మీర్జాపురంలో టీడీపీ మద్దతుదారు పిక్కిరి నాగరత్నమ్మ సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. కర్నూలు జిల్లా గోనెగొండ్ల మండలం ఐరన్ బండలో టీడీపీ మద్దతుదారు బాషా సర్పంచ్‌గా గెలుపొందారు.
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం దోసకాయలపాడులో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి కర్ణ కృష్ణమ్మ 903 ఓట్లతో విజయం సాధించారు. దర్శి మండలం వెంకటాచలంపల్లిలో టీడీపీ మద్దతు అభ్యర్థి ఎర్రగుంట్ల కోటయ్య సర్పంచ్‌గా 1,625 ఓట్లతో గెలుపొందారు.
ఇక మార్కాపురం జిల్లా రాచర్ల మండలం ఓద్దులవాగువానిపల్లిలో టీడీపీ మద్దతు సర్పంచ్ అభ్యర్థి ఇప్పాల లక్ష్మీదేవి 800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ జోరు పెంచడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. దీంతో వైసీపీకి గట్టి షాక్ ఇచ్చినట్లు అవుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి
మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు మృతి.. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
పులివెందులలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తల మృతి!
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం.. మరికాసేపట్లో తేలనున్న అభ్యుర్థుల భవితవ్యం