బంగారం కొనాలా.. వద్దా? నిపుణులు ఏం చెబుతున్నారు?
ABN , Publish Date - Oct 13 , 2026 | 03:43 PM
బంగారం ధర ప్రస్తుతం రూ.1.5 లక్షల దిగువకు తగ్గింది. అంతేకాకుండా పండగలు, పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తోంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. తులం బంగారం ధర మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి రూ.1,49,621గా ఉంది. అయితే, భవిష్యత్తులో పసిడి ధర మరింత తగ్గనుందా? లేక పెరుగుతుందా అన్న సందేహం చాలా మందిని ఆలోచింపజేస్తోంది.
ఇంటర్‌నెట్ డెస్క్: బంగారం ధర ప్రస్తుతం రూ.1.5 లక్షల దిగువకు తగ్గింది. అంతేకాకుండా పండగలు, పెళ్లిళ్ల సీజన్ కూడా వస్తోంది. దీంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. తులం బంగారం ధర మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి రూ.1,49,621గా ఉంది. అయితే, భవిష్యత్తులో పసిడి ధర మరింత తగ్గనుందా? లేక పెరుగుతుందా అన్న సందేహం చాలా మందిని ఆలోచింపజేస్తోంది. సాధారణంగా గ్లోబల్ ఎకానమీ, అమెరికా ద్రవ్యోల్బణం, ఫెడరల్ రిజర్వ్ చేసే వడ్డీ రేట్లలో మార్పు లాంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తుంటాయి. అంతేకాకుండా అమెరికా వడ్డీ రేట్లు, అంతర్జాతీయ రాజకీయ ఉద్రిక్తతలు, చమురు ధరల్లో మార్పులు వంటి అంశాల ప్రభావం కూడా బంగారం ధరలపై ఉంటుంది. ఈ నేపథ్యంలో బంగారం ధర మరోసారి మరింత తగ్గే అవకాశం ఉండవచ్చని, అప్పటివరకూ ఎదురుచూడడం మంచిదని పసిడి కొనుగోలుదారులు భావిస్తున్నారు. మరోవైపు పసిడిపై పెట్టుబడి పెట్టేవారు కూడా అమెరికా ద్రవ్యోల్బణ డేటాను ఆసక్తిగా పరిశీలిస్తున్నారు. ఫెడరల్ రిజర్వ్ తర్వాతి చర్య ఏమిటన్న దానిపై దృష్టి పెట్టారు.
గోల్డ్, వడ్డీ రేట్ల మధ్య తేడా తెలుసుకోవాలి
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారు బంగారం, వడ్డీ రేట్ల మధ్య తేడా తెలుసుకోవడం అవసరమని ఆగ్‌మాంట్‌లో చీఫ్ రీసర్చ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ రెనీషా చైనానీ అన్నారు. గత కొద్ది రోజుల్లో చమురు ధరలు తగ్గినా బంగారం, వెండి ధరలు ఓ మోస్తరు వరకు స్థిరంగా ఉన్నాయని ఆమె తెలిపారు. ‘అమెరికాలో వడ్డీ రేట్లలో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందని ట్రేడర్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు బంగారానికి, వడ్డీ రేట్లకు మధ్య ఉన్న సంబంధాన్ని కూడా కొనుగోలుదారులు అర్థం చేసుకోవాలి. బాండ్లు, డిపాజిట్ల మీద వడ్డీ వచ్చినట్లు బంగారంపై వడ్డీ రాదు. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగినపుడు, రిటర్నులు ఇచ్చే ఆస్తుల వైపే పెట్టుబడిదారులు మొగ్గుచూపుతారు. ఈ నేపథ్యంలో అలాంటివారు బంగారంపై అంతగా ఆసక్తి చూపకపోవచ్చు. మరోవైపు పశ్చిమాసియాలో జియోపొలిటికల్ టెన్షన్ల వల్ల చమురు ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం మరింత పెరగవచ్చనే ఆందోళన నెలకొంది. ఈ అంశాలన్నింటినీ పసిడి కొనుగోలుదారులు పరిశీలించాలి’ అని రెనీషా పేర్కొన్నారు.
కొనడం అవసరమా కాదా?
పెళ్లిళ్లు, పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో బంగారం కొనేందుకు చాలా మంది పసిడి ప్రియులు ప్లాన్ చేస్తున్నారు. అయితే, బంగారం కొనడం అవసరమా? ధర ఎంత పెరిగినా కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామా అన్నదానిపైనే నిర్ణయం ఆధారపడి ఉంటుందని రెనీషా తెలిపారు. వివాహం లేదా పండగల కోసం బంగారం కొనాల్సి వస్తే, అదేసమయంలో భవిష్యత్తులో బంగారం ధర తగ్గుతుందని కొనకుండా ఎదురుచూస్తే అది రిస్క్ అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఎందుకంటే, ధరలు పడిపోవచ్చని లేదా అంతర్జాతీయ పరిణామాల్లో అస్థిరతల కారణంగా పెరగనూవచ్చని ఆమె చెప్పారు. ఈ నేపథ్యంలో ఒకేసారి బంగారం కొనకుండా దశలవారీగా కొంటే మంచిదని, అలా చేస్తే ధరలు ప్రతికూలంగా ఉన్నపుడు కొనాల్సిన రిస్క్ తగ్గుతుందని సూచించారు. ‘‘బంగారాన్ని పెట్టుబడిగా కొనాలని ప్లాన్ చేస్తుంటే, అమెరికా ద్రవ్యోల్బణ డేటా మల్టీకమొడిటీ ఎక్స్‌చేంజ్ (ఎంసీఎక్స్) సపోర్ట్ లెవెల్స్‌ను చూసి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,48,000 నుంచి రూ.1,49,000 మధ్యలో ఉంది. ఈ టైంలో గోల్డ్ కొనడం మంచిదే. అయితే, భవిష్యత్తుల్లో ధరలు మరింత తగ్గుతాయా అన్నదానిని కచ్చితంగా చెప్పలేం. అలాగే బంగారం ధరల్లో మేకింగ్ చార్జీలు, వేస్టేజీ చార్జీలు, జీఎస్టీ వంటివి కూడా ఉంటాయి. అలాగే హాల్‌మార్కింగ్, స్వచ్ఛతను కూడా చెక్ చేసుకోవాలి. వీటన్నింటినీ పరిశీలించి కొనుగోలుదారులు నిర్ణయించుకోవాలి. బంగారం అవసరమైనవారు వివిధ తేదీల్లో కొనుగోలు చేస్తే మంచిది. పెట్టుబడి కోసం కొనాలనుకునేవారు అంతర్జాతీయ వడ్డీ రేట్లు, ఎంసీఎక్స్ ధరలను పరిశీలించాలి. చివరగా బంగారం కొనడం అనేది కొనుగోలుదారుల ఉద్దేశంపై ఆధారపడి ఉంటుంది’’ అని రెనీషా పేర్కొన్నారు.
ఇవీ చదవండి:
అధికారం అజమాయిషీకి కాదు.. ప్రజలకు సాధికారత కల్పించాలి: మోదీ
రాహుల్‌గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట.. పరువునష్టం కేసులో విచారణపై స్టే