ఎండీఆర్ చార్జీ విధింపు వాయిదా! దీపావళి తరువాతే..
ABN , Publish Date - Oct 13 , 2026 | 02:34 PM
వాణిజ్య యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చార్జీల విధింపు వాయిదా పడింది. దీపావళి తరువాత ఈ చార్జీలు మొదలవుతాయని ఎన్‌పీసీఐ తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ చార్జీల విధింపు వాయిదా పడింది. దీపావళి తరువాత ఈ చార్జీలు మొదలవుతాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తాజాగా ఓ ప్రకటనలో తెలిపింది. పండుగ సీజన్ నేపథ్యంలో వ్యాపార వర్గాల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. దీపావళి తరువాత అమలు తేదీ ఎప్పుడనేది మరోసారి ప్రకటిస్తామని పేర్కొంది. రూ.2 వేలకు పైబడిన కొన్ని వాణిజ్య యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ చార్జీ విధించేందుకు ఎన్‌పీసీఐ సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నెల 12 నుంచి ఈ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉన్నా పండుగ సీజన్‌లో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ చార్జీల విధింపును ఎన్‌పీసీఐ వాయిదా వేసింది.
వాణిజ్య డిజిటల్ చెల్లింపులపై ప్రాసెసింగ్ ఫీజు కింద ఈ చార్జీలను విధిస్తారు. డిజిటల్ పేమెంట్స్ నెట్‌వర్క్ నిర్వహణ కోసం ఈ చార్జీలను విధిస్తారని గతంలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఈ చార్జీలను వాణిజ్య సంస్థలే చెల్లిస్తాయి. ఇక రైల్వే, టెలికం సేవలు, ఇన్సూరెన్స్, వ్యవసాయ రంగానికి సంబంధించిన పేమెంట్స్‌పై మాత్రం కేవలం రూ.5ల చార్జీనే విధిస్తారు. రూ.75వేలు ఆపై చెల్లింపులపై గరిష్ఠంగా రూ.300 ఎండీఆర్ మాత్రమే ఉంటుందని కూడా కేంద్రం చెప్పింది. ఎండీఆర్ చార్జీలతో పేమెంట్ నెట్‌వర్క్ మరింత బలోపేతం అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. సైబర్‌సెక్యూరిటీ వసతులు మరింత బలోపేతం అవుతాయని, మోసాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని చెప్పింది. యూపీఐ చెల్లింపు వ్యవస్థ నిర్వహణ వార్షిక ఖర్చులు రూ.20 వేల కోట్లని కూడా కేంద్రం గతంలో పేర్కొంది.
ఈ వార్తలనూ చదవండి:
భారత్ భవిష్యత్తుకు సెమీకండక్టర్ల రంగమే కీలకం: టాటా సన్స్ ఛైర్మన్ చంద్రశేఖరన్
ఐటీ షేర్లలో కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్‌లో మళ్లీ జోష్..