ఐటీ షేర్లలో కొనుగోళ్లు.. స్టాక్ మార్కెట్‌లో మళ్లీ జోష్..
ABN , Publish Date - Oct 13 , 2026 | 11:35 AM
వరుస నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు, ఐటీ షేర్లలో ర్యాలీ, మార్కెట్‌లో ఒడిదొడుకులను సూచించే ఇండియా విఐక్స్ తగ్గడం సూచీలకు ఊతమిచ్చాయి.
ఇంటర్నెట్ డెస్క్: వరుస నష్టాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తిరిగి పుంజుకున్నాయి. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతు, ఐటీ షేర్లలో ర్యాలీ, మార్కెట్‌లో ఒడిదొడుకులను సూచించే ఇండియా విఐక్స్ తగ్గడం సూచీలకు ఊతమిచ్చాయి. ఉదయం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ ఒకదశలో 500 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 50 మళ్లీ 22,500 స్థాయిని అధిగమించింది (Indian Stock Market today).
ఐటీ రంగంలో కొనుగోళ్లు దేశీయ సూచీలకు సానుకూలంగా మారాయి. నిఫ్టీ ఐటీ సూచీ 3 శాతానికి పైగా పెరిగింది. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ మొదలైన షేర్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఇటీవల హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రకటించిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించడం, లాభదాయకత మెరుగుపడటం వంటి అంశాలు ఐటీ షేర్లపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి (IT Stocks rally).
మార్కెట్‌లో రానున్న రోజుల్లో ఒడిదొడుకులు ఎంత తీవ్రంగా ఉండవచ్చో సూచించే ఇండియా విఐక్స్ (India VIX) కూడా తగ్గింది. మంగళవారం ఉదయం ఇది సుమారు 3 శాతం పడిపోయి 14.82 స్థాయికి చేరింది. మరోవైపు ఇటీవల వరుస నష్టాల కారణంగా చాలా సూచీలు ఆకర్షణీయంగా మారాయి. దీంతో మదుపర్లు కొనుగోళ్లకు మొగ్గు చూపుతున్నారు. దీంతో సూచీలు లాభాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 11:30 గంటల సమయంలో సెన్సెక్స్ 388 పాయింట్ల లాభంతో 72,312 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 122 పాయింట్ల లాభంతో 22,485 దగ్గర ఉంది.
ఇవి కూడా చదవండి..
రోహిత్, కోహ్లీ మాత్రమే కాదు.. 2027 ప్రపంచకప్‌లో అసలైన బలం ఇదే: మహమ్మద్ కైఫ్
ప్రతిపక్ష కూటమి పిటిషన్‌లో 14 లోపాలు.. కోర్టు ఫీజులో రూ.220 తక్కువగా చెల్లింపు..