not stop ganjai గంజాయి ఆగట్లే
ABN , Publish Date - May 06 , 2026 | 12:15 AM
not stop ganjai గత నెలలో బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టుబడింది. క్యాబేజీ లోడు మాటున గంజాయి తరలిస్తుండగా నార్కోటిక్ కంట్రోల్ టీమ్ దాడిచేసి పట్టుకుంది. గంజాయి తరలిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం పట్టుబడ్డారు.
గంజాయి ఆగట్లే
ఆ మూడు మార్గాల నుంచి జిల్లాలోకి ప్రవేశం
పదే పదే నిషేధిత వస్తువుల రాక
రవాణాకు అడ్డాగా భావిస్తున్న స్మగ్లర్లు
దొరికితే కదా దొంగ అన్న బరితెగింపు
గత నెలలో బొండపల్లిలో 650 కిలోల గంజాయి పట్టుబడింది. క్యాబేజీ లోడు మాటున గంజాయి తరలిస్తుండగా నార్కోటిక్ కంట్రోల్ టీమ్ దాడిచేసి పట్టుకుంది. గంజాయి తరలిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు సైతం పట్టుబడ్డారు. జిల్లా మీదుగా గంజాయి రవాణా చేస్తూ అనేకసార్లు దొరికిపోతున్నా మళ్లీ మళ్లీ తరలిస్తూనే ఉన్నారు. గంజాయితో పాటు నిషేధిత వస్తువుల తరలింపులో దొరికితే దొంగ.. లేకుంటే దొర అని భావిస్తున్నారేమో. గంజాయి రవాణాలో పట్టుబడిన చాలా మంది యువకులు ఇదే ఆలోచనతో ఉన్నట్లు పలుమార్లు వెల్లడైంది. అయితే ఆ మూడు మార్గాల్లో నుంచే గంజాయి, ఇతర ఉత్పత్తులు జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి.
రాజాం, మే 5 (ఆంధ్రజ్యోతి):
నిషేధిత గుట్కా, ఖైనీ, మత్తు పదార్థాల వినియోగం జిల్లాలో తగ్గడం లేదు. మన రాష్ట్రంలో వీటిపై నిషేధం ఉన్నప్పటికీ వినియోగం యథాతథంగా సాగుతోంది. దీనికి ఒడిశాయే కారణం. ఆ రాష్ట్రంలో నిషేధం లేకపోవడంతో పక్కనే ఉన్న విజయనగరం జిల్లాలోకి యథేచ్ఛగా రవాణా అవుతున్నాయి. పదే పదే మూడు మార్గాల గుండా జిల్లాలోకి గంజాయి, ఇతర ప్రాణాంతకాలు ప్రవేశిస్తున్నాయి. ఒడిశాలోని గజపతి, జైపూర్, రాయగడ జిల్లాలకు సంబంధించి అంతర్ రాష్ట్ర రహదారులు ఉన్నాయి. అరకు- విశాఖ ప్రధాన రహదారి, హడ్డుబంగి-పాలకొండ-విజయనగరం రోడ్డు, సాలూరు-పార్వతీపురం-విజయనగరం రహదారులు కేరాఫ్‌గా మారాయి. ఈ రోడ్లలో అంతగా తనిఖీలు లేవు. చెక్ పోస్టులను సైతం ఎత్తేశారు. ప్రత్యేక పోలీసులను విధుల నుంచి తొలగించారు. దీంతో గంజాయి రవాణాదారులకు ఈజీ అయిపోయింది.
యువత, విద్యార్థులే టార్గెట్
ఒడిశా నుంచి ఎక్కువగా ఎంఎస్‌టీ రైల్వే పాస్ మీద వ్యాపారులు గుట్కా, ఖైనీలను తెస్తున్నారు. షాపులకు సరఫరా చేస్తున్నారు. ఇటు గంజాయి వినియోగం కూడా ఇటీవల అధికమైంది. గంజాయి తాగడాన్ని ఒక ఫ్యాషన్ యువత భావిస్తున్నారు. ఫలానా చోట గంజాయి దొరకుతుందని కోడ్ సంభాషణ ద్వారా చెప్పుకుంటున్నారు. 20 సంవత్సరాల్లోపు ఉన్నవారినే పక్కా ప్రణాళికతో గంజాయికి అలవాటు చేస్తున్నారు. ప్రతిగ్రామంలో ఐదారుగురు యువకులను ఎంపిక చేసుకొని మొగ్గులోకి దించుతున్నారు. మద్యం కంటే తక్కువ ధరకు లభిస్తుండడం, నిషా ఎక్కువగా ఇస్తుండడంతో ఇట్టే అడిక్టవుతున్నారు. గంజాయితో పాటు బ్రౌన్ షుగర్ వంటి ప్రాణాంతక నిషేధిత వస్తువులు చలామణి అవుతున్నాయని తెలుస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. వీటి రవాణాకు యువత, విద్యార్థులను వినియోగిస్తుండడం విచారకరం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అద్దెకు కార్లను ఇచ్చే సంస్కృతి నడుస్తోంది. ఎవరికైనా అవసరమైతే డ్రైవింగ్ వస్తే రోజువారీ కిరాయి రూపంలో కార్లను అద్దెకిస్తుంటారు. గంజాయి రవాణదారులకు ఇదో మార్గంగా మారింది. నలుగురైదుగురు యువకులను మాట్లాడుకుంటున్నారు. అధిక మొత్తంలో నగదు ఆఫర్ చేస్తున్నారు. ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు.
నిత్యం నిఘా
పోలీస్ శాఖ పరంగా సరిహద్దు ప్రాంతంలో నిత్యం నిఘా ఉంటుంది. జాతీయ రహదారితో పాటు అంతర్ రాష్ట్ర రహదారుల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాం. నిషేధిత వస్తువులు కనిపిస్తే స్వాధీనం చేసుకుని రవాణాదారులను అరెస్టు చేస్తున్నాం. చెక్‌పోస్టుల ఏర్పాటు ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే ఏర్పాటు చేస్తాం.
- ఉపేంద్ర, సీఐ, రాజాం
------------------