Share News

కొత్తవలస జూట్‌మిల్‌ షట్‌డౌన్‌

ABN , Publish Date - May 06 , 2026 | 12:22 AM

కొత్తవలస ఉమా జూట్‌ మిల్లును యాజమాన్యం మూడు నెలలు పాటు షట్‌డౌన్‌ చేస్తూ ప్రకటించింది. మిల్లులో ఉత్పత్తికి ముడిసరుగా ఉన్న జనపనారకు తీవ్ర కొరత ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగానే షట్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు తెలిపింది.

కొత్తవలస జూట్‌మిల్‌ షట్‌డౌన్‌
Kothavalasa JuteMill

  • మూడు నెలలు కొనసాగేలా నిర్ణయం

  • జనపనార కొరతే కారణం

  • కార్మికులను ఒప్పించిన యాజమాన్యం

కొత్తవలస ఉమా జూట్‌ మిల్లును యాజమాన్యం మూడు నెలలు పాటు షట్‌డౌన్‌ చేస్తూ ప్రకటించింది. మిల్లులో ఉత్పత్తికి ముడిసరుగా ఉన్న జనపనారకు తీవ్ర కొరత ఏర్పడిందని పేర్కొంది. ఈ కారణంగానే షట్‌డౌన్‌ అమలు చేస్తున్నట్టు తెలిపింది. జూలై 31వ తేదీ వరకు ఈ పరిస్థితి కొనసాగనుంది. ఈ వ్యవధిలో కార్మికులకు పనిఉండదు. వేతనం ఉండదు. ప్రస్తుతం మూడు రోజులకు సరిపడే గోగునార ఉండడంతో మగ్గాలు పని చేస్తున్నాయి. అది పూర్తయితే పూర్తిగా షట్‌డౌన్‌ అమలులోకి వస్తుంది.

కొత్తవలస, మే 5 (ఆంధ్రజ్యోతి): కొత్తవలసలోని ఉమా జూట్‌ మిల్లును సుమారు రెండు సంవత్సరాల కిందటే లాకౌట్‌ నుంచి తెరచి యాజమాన్యం కార్మికులకు పని కల్పించింది. గతంలో ఉన్న యాజమాన్యం స్థానంలో కొత్త యాజమాన్యం పగ్గాలు చేపట్టింది. కార్మికులకు బకాయిలను క్లియర్‌ చేసింది. పదవీ విరమణ చేసిన, చనిపోయిన కార్మికులకు చెల్లించాలసిన బకాయిలను ఇచ్చేసింది. యాజమాన్యం, కార్మికులు మంచి అవగాహానతో పని చేసుకుంటూ ఉత్పత్తి చేస్తున్న తరుణంలో ముడిసరుకు సమస్య తలెత్తింది. దీనిపై యాజమాన్యం ముందుగా కార్మికులతో చర్చించి షట్‌ డౌన్‌కు దారి తీసిన పరిస్థితులను వివరించి సహకరించాలని కోరింది. ఒక వేళ మూడునెలలులోగా జనపనార అందుబాటులోకి వస్తే మిల్లును తెరిచి ఉత్పత్తి సాగించడానికి అంగీకారం తెలిపింది.


దిగుమతులు ఆగిపోవడమే ప్రధాన కారణం

జూట్‌మిల్లులకు ప్రధాన ముడిసరుకు అయిన జనపనార పంట పశ్చిమబెంగాల్‌తో పాటు బంగ్లాదేశ్‌ నుంచి దిగుమతి అవుతుంది. బంగ్లాదేశ్‌ నుంచి వచ్చే జనపనారను ఏజెంట్లు ముందుగా కొనుగోలు చేసి జూట్‌ మిల్లులకు విక్రయిస్తారు. అయితే బంగ్లాదేశ్‌ నుంచి మన దేశానికి దిగుమతి అయ్యే జనపనార ఆగిపోయింది. మరోవైపు పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో విరివిగా జనపనారను పండిస్తారు. ఆ రాష్ట్రంలో సుమారు 140 వరకు జూట్‌ మిల్లులు ఉన్నాయి. వీటిలో చాలామిల్లులు మూతపడ్డాయి. అయితే కేంద్ర ప్రభుత్వం జూట్‌ మిల్లులకు పలు రాయితీలు ప్రకటించడంతో ఆ రాష్ట్రంలోని అన్ని జూట్‌ మిల్లులు తెరుచుకున్నాయి. దీంతో జూట్‌ కొరత ఏర్పడింది.


నష్టాలు భరించలేకే

గతంలో జనపనార ధర కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉండగా జనపనార నుంచి తయారు చేసే పురికొసల ధరలు కేజీ 170 రూపాయల వరకు ఉండేది. ప్రస్తుతం జనపనార ధర కూడా 170 రూపాయలు అయిపోవడంతో పాటు పురి కొసలు ధరలు మాత్రం కేజీ 170 రూపాయలే ఉండడంతో ఉత్పత్తి వ్యయం పెరిగిన కారణంగా మిల్లును షట్‌ డౌన్‌ చేయాల్సి వస్తోందని యాజమాన్యం చెబుతోంది.


జిల్లాలో కానరాని పంట

గతంలో విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో జనపనార పంట విరివిగా సాగులో ఉండేది. జూట్‌మిల్లులు సంక్షోభంలో పడ్డంతో ఈ పంటను రైతులు వేయడం మానేశారు. అలాగే కోసిన తరువాత కనీసం నెల రోజుల పాటు చెరువుల్లో నాన బెట్టి నార తీయాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్నిసార్లు పంట ఎండిపోయి పాడై పోయేది. పశ్చిమబెంగాల్‌ రాష్ట్ల్రంలో జనపనారను నాన బెట్టుకోవడానికి గంగానది నీటిని కేటాయిస్తారని చెబుతున్నారు.

Updated Date - May 06 , 2026 | 07:59 AM