Share News

help to displaced people నిర్వాసితులకు అండగా!

ABN , Publish Date - May 06 , 2026 | 12:18 AM

help to displaced people ఎస్‌.కోటలో పేదలకు చెందిన 1166 ఎకరాలను ప్రభుత్వం జెఎస్‌డబ్ల్యూ(జిందాల్‌)కు ఇచ్చింది. ఆ భూముల్లో అల్యూమినియం పరిశ్రమ పెడతామని యాజమాన్యం చెప్పింది. 2006లో భూములు అప్పగించగా నేటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు.

help to displaced people నిర్వాసితులకు అండగా!
హైదరాబాద్‌ సోమవారం జిందాల్‌ భూ సేకరణపై ఆరా తీస్తున్న జాతీయ ఎస్టీకమిషన్‌ సభ్యుడు హుస్సేన్‌

నిర్వాసితులకు అండగా!

త్వరలోనే జిల్లాకు జాతీయ ఎస్టీ కమిషన్‌ రాక

పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని జిందాల్‌కు ఇప్పటికే సూచన

పక్షం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం

ఇవ్వకపోయినా ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని తాజాగా హైదరాబాద్‌లో ప్రకటన

ఉక్కిరిబిక్కిరవుతున్న రెవెన్యూ అధికారులు

- ఎస్‌.కోటలో పేదలకు చెందిన 1166 ఎకరాలను ప్రభుత్వం జెఎస్‌డబ్ల్యూ(జిందాల్‌)కు ఇచ్చింది. ఆ భూముల్లో అల్యూమినియం పరిశ్రమ పెడతామని యాజమాన్యం చెప్పింది. 2006లో భూములు అప్పగించగా నేటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు. దాదాపు 400 మంది పేదల నుంచి భూములు తీసుకున్నారు. పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని వారంతా ముందుకొచ్చారు. ఇప్పుడేమో ఇండస్ట్రీయల్‌ పార్కు వస్తుందని యాజమాన్యం చెప్పుకొస్తోంది. దీనిని ప్రశ్నించే రైతులను పోలీస్‌లతో కొట్టించి జైలు పాలు చేస్తున్నారు. కమిషన్‌ వద్దకు వచ్చేవారిని భయపెడుతున్నారు. దీనిపై పబ్లిక్‌ గ్రీవెన్స్‌ ఏర్పాటు చేయాలి. ఐదుసార్లు కమిషన్‌ నోటీస్‌లు ఇచ్చినా పట్టించుకోలేదు. ఎస్సీ, ఎస్టీల పట్ల అధికారులకు ఎంత ఉదారత ఉందో అర్థం చేసుకోవచ్చు. కమిషన్‌ సమన్లు జారీ చేయడంతో కలెక్టర్‌ వచ్చారు. పక్షం రోజుల్లో అధికారులు నివేదిక ఇచ్చినా, ఇవ్వకపోయినా క్షేత్రస్థాయిలో పబ్లిక్‌ హియిరింగ్‌ నిర్వహిస్తాం. గత నెలలో రావాల్సి ఉండగా అనివార్య కారణాలతో రాలేకపోయాం.

- జిందాల్‌ భూ వ్యవహారంపై జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జె.హుస్సేన్‌ హైదరాబాద్‌లో సోమవారం మీడియాతో చెప్పిన మాటలివి

శృంగవరపుకోట/ రూరల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి):

జిందాల్‌ భూ నిర్వాసితులకు జాతీయ ఎస్టీ కమిషన్‌ అండగా నిలిచింది. నిర్వాసిత రైతుల విషయంలో వ్యవహరిస్తున్న ప్రభుత్వ అధికారుల తీరును తప్పుపట్టింది. ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని జిందాల్‌ యాజమాన్యానికి సూచించింది. పక్షం రోజుల్లో అధికారులు నివేదిక ఇచ్చినా, ఇవ్వకపోయినా క్షేత్రస్థాయిలో పబ్లిక్‌ హియిరింగ్‌(ప్రజా సదస్సు) ఏర్పాటు చేసి వాస్తవాలను తెలుసుకుంటామని తాజాగా స్పష్టం చేసింది. జిందాల్‌ భూ వ్యవహారంపై జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జె.హుస్సేన్‌ హైదరాబాద్‌లో సోమవారం ఇచ్చిన భరోసాకు నిర్వాసిత రైతులు అనందం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని వివరించేందుకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుతో కలసి శృంగవరపుకోట తహసీల్దార్‌ డి.శ్రీనివాసరావును రైతులు మంగళవారం కలిశారు. జాతీయ ఎస్టీ కమిషన్‌ ఎదుట జరిగిన చర్చను వివరించారు. కమిషన్‌ మాటలను వినిపించారు. న్యాయం చేయాలని కోరారు.

అలుపెరగని పోరు

జిందాల్‌ భూ నిర్వాసితులు ఓ పక్క వివిధ రూపాల్లో నిరసనలు, కోర్టులో దావాలు, కమిషన్‌లకు ఫిర్యాదులు చేస్తూనే మరోపక్క భూ సేకరణలో అప్పట్లో జరిగిన అక్రమాలను ఒక్కోక్కటిగా బయటపెడుతున్నారు. కిల్తంపాలెం పంచాయతీ శివారు అడ్డతీగ గ్రామానికి చెందిన ఊరం సింహాచలానికి అందాల్సిన పరిహారం చీడిపాలెం గ్రామానికి చెందిన ఊరం సింహాచలం కుటుంబానికి అందించినట్లు వెలుగులోకి వచ్చింది. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరుగుతోంది. మరోవైపు జిందాల్‌ భూ సేకరణలో ఎటువంటి భూములను కోల్పోకుండానే బినామి ఉద్యోగాలను కల్పించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని భూనిర్వాసితులు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా ఒకటి తరువాత ఇంకోక్కటి అన్నట్లుగా భూ నిర్వాసితులు అప్పట్లో జరిగిన తప్పులను ఎత్తిచూపుతున్నారు. రోజుకో సమస్యను భూ నిర్వాసితులు వినిపిస్తుండడం, కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందిస్తుండడంతో స్థానిక రెవెన్యూ అధికారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.

అధికారుల ఉక్కిరిబిక్కిరి

జిందాల్‌ వ్యవహారంపై విచారణకు గ్రామ రెవెన్యూ అధికారి, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, డిప్యూటీ తహసీల్దార్‌, తహసీల్దార్‌లు ప్రత్యేకంగా సమయం కేటాయించాల్సి వస్తోంది. రెవెన్యూ పరంగా రోజువారీ విధులకు అటంకం కలుగుతోంది. ప్రస్తుతం గ్రామాల్లో భూముల రీసర్వే జరుగుతోంది. దీనికి తోడు భూసమస్యలను పరిష్కరించాల్సి ఉంటుంది. పుట్టిన తేదీ, మరణ ధ్రువపత్రం, కుటుంబ ధ్రువపత్రం, కుల, ఆదాయ ధ్రువపత్రాల జారీ పనులు ఎలాగూ ఉన్నాయి. ఈ పనులకు అదనంగా ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన జిందాల్‌ భూ సేకరణ సమస్యల పరిష్కారానికి నివేదికలు తయారు చేసివ్వడం కత్తిమీద సాములా మారిందని స్థానిక రెవెన్యూ అధికారులు వాపోతున్నారు.

Updated Date - May 06 , 2026 | 12:18 AM