షెడ్యూల్ వచ్చేసింది!
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:37 AM
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం జాతికి అంకితం కానున్న వేళ.... విమానయాన సంస్థలు తమ షెడ్యూల్స్ ప్రకటిస్తున్నాయి. మొదట ఎయిర్ ఇండియా స్పందించింది. ఆగస్టు 17 నుంచి తమ సేవలు అందిస్తామని శుక్రవారం ప్రకటించింది.
సర్వీసు వివరాలు ప్రకటించిన ఎయిర్ ఇండియా
హైదరాబాద్, బెంగళూరు, బెజవాడలకు రెగ్యులర్ సేవలు
విశాఖపట్నం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం జాతికి అంకితం కానున్న వేళ.... విమానయాన సంస్థలు తమ షెడ్యూల్స్ ప్రకటిస్తున్నాయి. మొదట ఎయిర్ ఇండియా స్పందించింది. ఆగస్టు 17 నుంచి తమ సేవలు అందిస్తామని శుక్రవారం ప్రకటించింది. ప్రతి విమానాశ్రయానికి ఒక కోడ్ ఉంటుంది. విశాఖ విమానాశ్రయానికి ‘వీటీజెడ్’ ఉండగా, ఇకపై దానిని భోగాపురం విమానాశ్రయానికి ఉపయోగిస్తామని ఇప్పటికే ప్రకటన విడుదలైంది. దీంతో భోగాపురానికి వీటీజెడ్ కోడ్ సూచిస్తూ ఎయిర్ ఇండియా షెడ్యూల్ జారీచేసింది. అవి..
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఉదయం ఏడు గంటలకు బయలుదేరి భోగాపురానికి 8.20 గంటలకు చేరుతుంది. తిరిగి ఇక్కడి నుంచి 8.50 గంటలకు బయలుదేరి 10 గంటలకు హైదరాబాద్ వెళుతుంది. అక్కడ మధ్యాహ్నం 2.35 గంటలకు బయలుదేరి 3.55 గంటలకు ఇక్కడికి వస్తుంది. తిరిగి ఇక్కడి నుంచి సాయంత్రం 4.35 గంటలకు బయలుదేరి ఆరు గంటలకు హైదరాబాద్ చేరుతుంది. ఈ సర్వీసులు రోజూ అందుబాటులో ఉంటాయి.
బెంగళూరు: బెంగళూరులో ఉదయం 5.55 గంటలకు బయలుదేరి భోగాపురానికి 7.30 గంటలకు చేరుతుంది. మరో విమానం సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి 6.30 గంటలకు ఇక్కడికి వస్తుంది. భోగాపురంలో రాత్రి 10.10 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 11.50 గంటలకు బెంగళూరుకు చేరుతుంది. ఈ సర్వీసులు సోమ, మంగళ, బుధ, గురు, శనివారాల్లో మాత్రం నడుస్తాయి.
విజయవాడ: విజయవాడ-భోగాపురం మధ్య రోజూ నాలుగు విమాన సర్వీసులు నడవనున్నాయి. భోగాపురంలో రాత్రి ఏడు గంటలకు బయలుదేరి ఎనిమిది గంటలకు విజయవాడ చేరుతుంది. మరో విమానం కూడా రాత్రి ఏడు గంటలకు బయలుదేరి అక్కడికి 8.05 గంటలకు చేరుతుంది. విజయవాడలో రాత్రి 8.30 గంటలకు బయలుదేరి భోగాపురానికి 9.40 గంటలకు చేరుతుంది. మరో విమానం రాత్రి 8.35 గంటలకు బయలుదేరి రాత్రి9.40 గంటలకు భోగాపురం వస్తుంది. ఈ సర్వీసులు రోజూ అందుబాటులో ఉంటాయి.