విశాఖ పోర్ట్ సరికొత్త రికార్డు.. 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు రవాణా..
ABN , Publish Date - Oct 14 , 2026 | 07:20 PM
సరకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సరకు రవాణా మైలురాయిని చేరుకుంది.
విశాఖపట్నం, అక్టోబర్ 14: సరకు రవాణాలో విశాఖపట్నం పోర్ట్ సరికొత్త రికార్డు సృష్టించింది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో కేవలం 196 రోజుల్లోనే 50 మిలియన్ మెట్రిక్ టన్నుల (ఎంఎంటీ) సరకు రవాణా మైలురాయిని చేరుకుంది. అక్టోబర్ 13 నాటికి మొత్తం 5,00,07,081 టన్నుల కార్గోను విజయవంతంగా హ్యాండిల్ చేసినట్లు పోర్ట్ అథారిటీ వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. 17 రోజులు, అంతకుముందు ఏడాదితో పోలిస్తే 28 రోజుల ముందుగానే ఈ ఘనత సాధించినట్లు వివరించింది.
అందుకు ట్రాఫిక్ విభాగాన్ని పోర్ట్ చైర్పర్సన్ జె.ఎస్. బింద్రా, డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరాంజి అభినందించారు. ఇదే స్ఫూర్తితో 2026–27 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 100 ఎంఎంటీ సరుకు రవాణా లక్ష్యాన్ని సాధించాలని సిబ్బందికి పిలుపునిచ్చారు. మరో వైపు పోర్టులోని ఎస్పీఎం బెర్త్ వద్ద 339.50 మీటర్ల పొడవైన 'ATREBATES' అనే అతిపెద్ద ముడి చమురు నౌకకు బెర్తింగ్ సదుపాయం కల్పించారు. భారీ నౌకల నిర్వహణలో పోర్ట్ మౌలిక సదుపాయాలు, సాంకేతిక సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సర్కు వ్యతిరేకంగా 2 లక్షల మందితో మార్చ్: టీపీసీసీ చీఫ్
పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Read Latest AP News And Telugu News