Share News

చోరీలపై ఉక్కుపాదం: 51 కేసులు ఛేదించి, 60 మంది అరెస్ట్!

ABN , Publish Date - May 23 , 2026 | 04:32 PM

విశాఖ నగరంలో చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా విశాఖ క్రైమ్ విభాగం పోలీసులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ఏప్రిల్ నెల ‘రికవరీ మేళా’లో రికార్డు స్థాయిలో రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు.

చోరీలపై ఉక్కుపాదం: 51 కేసులు ఛేదించి, 60 మంది అరెస్ట్!
Visakhapatnam Recovery Mela

విశాఖపట్నం, మే23: నగరంలో చోరీలకు అడ్డుకట్ట వేయడంతో పాటు, బాధితులకు సత్వర న్యాయం చేయడమే లక్ష్యంగా విశాఖ క్రైమ్ విభాగం పోలీసులు శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన ఏప్రిల్ నెల ‘రికవరీ మేళా’లో రికార్డు స్థాయిలో రికవరీ చేసిన సొత్తును బాధితులకు అందజేశారు. ఏప్రిల్ నెలలో కమిషనరేట్ పరిధిలో మొత్తం 68 చోరీ కేసులు నమోదు కాగా, సాంకేతికత, చాకచక్యంతో వ్యవహరించిన క్రైమ్ పోలీసులు కేవలం నెల రోజుల్లోనే 51 కేసులను చేధించారు. ఈ కేసులతో సంబంధం ఉన్న 60 మంది ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు.


ఈ ముద్దాయిల నుంచి రూ. 1.04 కోట్ల విలువైన ప్రాపర్టీని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 924.14 గ్రాముల బంగారం, 4.5 కేజీల వెండి మరియు రూ. 3.12 లక్షల నగదు ఉన్నాయి. ఈ సొత్తును పోలీస్ కమిషనర్ (సీపీ) శంఖబ్రత బాగ్చి చేతుల మీదుగా శనివారం బాధితులకు సురక్షితంగా అప్పగించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. గడిచిన 22 నెలల్లో విశాఖ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అద్భుతమైన పనితీరు కనబరిచామని, మొత్తం 9,202 మంది బాధితులకు సుమారు రూ. 22 కోట్ల విలువైన ప్రాపర్టీని రికవరీ చేసి అందజేశామని వెల్లడించారు.


ఇటీవల నగరంలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసుపై సీపీ స్పందిస్తూ.. ఈ కేసులో ప్రధాన నిందితుడిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో లోతుగా విచారణ జరుపుతున్నామని తెలిపారు. అలాగే నగరంలో పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని శంఖబ్రత బాగ్చి పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌లు, పార్ట్ టైమ్ జాబ్స్ పేరుతో మోసాలు జరిగినా, లేదా ఎవరైనా ఆన్‌లైన్‌లో అసభ్యకరంగా బ్లాక్‌మెయిల్‌కు పాల్పడినా ఏమాత్రం భయపడకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని లేదా జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌ను ఆశ్రయించాలని సీపీ శంఖబ్రత బాగ్చి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

అందరం కలిసికట్టుగా మహానాడును విజయవంతం చేద్దాం: మంత్రి లోకేశ్

నాలుగు వారాల్లో సమస్యను పరిష్కరించుకోవాలి.. ఎమ్మెల్యేకు పవన్ సూచన

Updated Date - May 23 , 2026 | 04:43 PM